ఆమె పోరాటం వేల జీవితాలకు వెలుగు

పెళ్లి చేసుకుందామనుకుంటే ‘దేవుడి భార్య’కి మళ్లీ పెళ్లేంటి అనేవారు? బిడ్డను బడికి పంపిద్దామంటే.. తండ్రి పేరు చెప్పమనేవారు. పింఛను అడిగితే ‘నువ్వు ఒంటరి మహిళవు కావు’గా అనే వెటకారం.

Updated : 07 Oct 2022 07:56 IST

పెళ్లి చేసుకుందామనుకుంటే ‘దేవుడి భార్య’కి మళ్లీ పెళ్లేంటి అనేవారు? బిడ్డను బడికి పంపిద్దామంటే.. తండ్రి పేరు చెప్పమనేవారు. పింఛను అడిగితే ‘నువ్వు ఒంటరి మహిళవు కావు’గా అనే వెటకారం. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ జోగిని దురాచారంపై 18ఏళ్ల క్రితం పోరాటం మొదలుపెట్టిన హాజమ్మ వేలమంది జోగినుల జీవితాల్లో వెలుగునింపారు..

ఆరోతరగతిలో.. తాళిబొట్టుతో బడికెళ్లిన ఆ అమ్మాయిని చూసి తోటి పిల్లలంతా ఏడిపిస్తే తనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దేవుడికిచ్చి పెళ్లిచేసి తనని జోగినిగా మార్చిన ఆ సాంఘిక దురాచారం గురించి ఆ అమ్మాయికీ తెలిసింది తక్కువే. నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండల కేంద్రం హాజమ్మ స్వస్థలం. పదకొండేళ్లకే జోగినిగా మారిన ఆమెకు చదువుపై ఆసక్తి ఉన్నా పాఠశాలకు వెళ్లలేని దుస్థితి. ఆ జీవితం నుంచి బయటపడదామని కూలిపనికి ముంబయి వెళ్లినా.. తర్వాత సొంతూరు తిరిగొచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంది. ‘పెళ్లా.. ఎవరొస్తారో చూస్తాం. వచ్చిన వాళ్లకి వెయ్యి రూపాయల జరిమానా వేస్తాం’అంటూ బెదిరించారు ఊరి పెద్దలు. వాళ్లని ఎదిరించి.. పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు. కొడుకుని ఇంజనీరింగ్‌ చదివించింది. కూతురు బీఎస్సీ నర్సింగ్‌ చేసింది. తన జీవితం బాగానే ఉంది. మరి ఈ వ్యవస్థకి బలవుతున్న తోటి మహిళల సంగతేంటి? ఈ ప్రశ్న18 ఏళ్ల క్రితమే వేసుకున్న హాజమ్మ పోరాటం మొదలుపెట్టింది. ప్రభుత్వ సాయంతో, ఎన్జీవోల తోడుగా జోగినుల జీవితాల్లో వెలుగులు తేవాలనుకుంది. ‘మాలా మా పిల్లల జీవితాలు మారకూడదని బడికి పంపితే.. అక్కడ తండ్రి ఎవరు? అనే ప్రశ్న ఎదురయ్యేది. మగపిల్లలకి పిల్లనిచ్చేవారు కాదు. ఈ జీవితం వద్దనుకున్నా వేరే ఉపాధి దొరికేది కాదు. పోనీ పింఛను అయినా ఆసరాగా ఉంటుంది అనుకుంటే భర్త చనిపోయినట్టుగా సర్టిఫికెట్‌ తీసుకురమ్మనేవారు. అదెలా సాధ్యం? వీటికి పరిష్కారంగా ప్రభుత్వం ప్రారంభించిన జోగిని నిర్మూలన కమిటీలో సభ్యురాలిగా చేరి సమస్యలపై ఉద్యమించాను. ఫలితంగా తల్లిపేరుతోనే పిల్లలని పాఠశాలల్లో చేర్చుకొనేలా ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చింది. ఇది మా పోరాటంలో కీలక విజయం. పింఛను పైనా పోరాడాం. ప్రభుత్వం జీవో విడుదల చేశాక మమ్మల్ని ఒంటరి మహిళల కోటాలో చేర్చి పింఛను ఇస్తున్నారు. ఇవి మాత్రమే సరిపోవుగా. మాకు సరైన ఉపాధి కావాలి. పిల్లలకు మంచి చదువుకావాలి. అందుకే ‘ఓపెన్‌ మెర్సీ ఇండియా ఫౌండేషన్‌’ సాయంతో వందల గ్రామాలు తిరిగి.. పిల్లలకు చదువు అందేలా చూస్తున్నా. మరికొంతమందికి జ్యూట్‌ బ్యాగుల తయారీతోపాటు కుట్లు, అల్లికలు నేర్పిస్తున్నాం. బ్యుటీషియన్‌, భవన నిర్మాణంలో శిక్షణ అందించాం. లయన్స్‌ క్లబ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ సహకారంతో వాళ్లకి కుట్టుమిషన్లూ అందించాం. అలా ఆర్థికంగా వాళ్లకు ఓ దారి దొరికేలా చేస్తున్నాం. కొన్నేళ్ల క్రితం అధికారులతో మాట్లాడితే నిలువనీడలేని జోగినీలకు 65 ఎకరాల భూమి దక్కింది. అందులో కొంతభూమిలో డీఆర్‌డీఏ సహకారంతో... రెండు సంస్థల్ని ఏర్పాటు చేశాం. అందులో ‘నారాయణ మహిళా శకి’్త ఒకటి. దీని సాయంతో ఫోర్టిఫైడ్‌ రైస్‌ని తయారు చేయడానికి కలెక్టర్‌ హరిచందన అండగా నిలిచారు. ‘పండిత రమాబాయి’ పేరుతో మరో సంస్థనూ ఏర్పాటు చేశాం’ అనే హాజమ్మ తమ కడగళ్లను ఆశ్రయ్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో జరిగిన సమావేశాల్లో వినిపించారు. వందల గ్రామాల్లో ఈ దురాచారానికి వ్యతిరేకంగా పోరాడుతూ వేలమందికి ఆధారం చూపించిన హాజమ్మకి జాతీయస్థాయిలో ఇచ్చే సావిత్రిబాయి పూలే అవార్డు సహా రాష్ట్ర ప్రభుత్వం నుంచీ ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ వ్యవస్థను పూర్తిగా రూపుమాపినప్పుడే తనకు సంతోషం అంటారావిడ.

- మహమ్మద్‌ గౌస్‌, నారాయణపేట

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్