యుద్ధంపై పోరులో... నోబెల్‌ గెలిచారు!

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఉక్రెయినుల పోరాటంలో మహిళల పాత్రేంటి? శిక్షణ ఎరుగని అమ్మాయిలూ ఆయుధాలు పట్టారు. అంతేనా.. రష్యా ఆగడాలను ప్రపంచ దృష్టికి తెచ్చారు. ఇదంతా ఆ దేశానికి చెందిన సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే ఎన్‌జీఓ ద్వారా సాధ్యమైంది.

Updated : 09 Oct 2022 07:38 IST

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఉక్రెయినుల పోరాటంలో మహిళల పాత్రేంటి? శిక్షణ ఎరుగని అమ్మాయిలూ ఆయుధాలు పట్టారు. అంతేనా.. రష్యా ఆగడాలను ప్రపంచ దృష్టికి తెచ్చారు. ఇదంతా ఆ దేశానికి చెందిన సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే ఎన్‌జీఓ ద్వారా సాధ్యమైంది. అందుకే ఆ బృందానికి నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. ఆ సంస్థను నడిపించేది, కీలక బాధ్యతలు నిర్వహించేది అందరూ మహిళలే. వారిలో ముఖ్యులు వీళ్లు..


ఆ కన్నీళ్లు భయపెట్టాయి

ఒలెగ్జాండ్రా మాత్వియ్‌చుక్‌

మాకు ఆయుధాలు కావాలి.. అత్యాధునికమైనవి’.. ఒక మానవ హక్కుల కార్యకర్త నుంచి ఈ మాటలు ఊహించగలమా? కానీ ఒలెగ్జాండ్రా అంతర్జాతీయ వేదికపై ప్రపంచాన్నిలా కోరింది! తను పుట్టేనాటికి ఉక్రెయిన్‌.. యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌లో భాగమే! 1991లో స్వతంత్రం పొందే వరకూ సాగిన పోరాటాలన్నింటినీ కళ్లారా చూసింది. ప్రజాస్వామ్య దేశంగా మారడం, పేదరికం, పౌరుల్లో ఆందోళన, రష్యా భయం.. దేశం ముందున్న సవాళ్లెన్నో! ఈక్రమంలో పౌర హక్కులకు భంగం వాటిల్లుతుండటాన్ని గమనించింది. అందుకే దర్శకురాలవ్వాలన్న కలను పక్కనపెట్టి, న్యాయవిద్యలో పీజీ చదివింది. పౌరహక్కుల ఉద్యమంలో పాలు పంచుకోవడం మొదలుపెట్టింది. సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (సీసీఎల్‌)కు ఛైర్‌పర్సన్‌ అయ్యింది. 2013-14లో యూరోమైదాన్‌ అల్లర్ల సమయంలో సైనిక చర్యను డాక్యుమెంట్‌ చేయడంతో పాటు బాధితులకు న్యాయ సాయం అందించడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యుద్ధ నేరాలను వెలుగులోకి తెచ్చి ఎన్నో పురస్కారాలూ అందుకుంది. ఈ ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లో రష్యా సేనల దాష్టీకాలకు సంబంధించిన ఆధారాలను ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టుకు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలనే కాదు.. ఉక్రెయిన్‌కు ఇతర దేశాల మద్దతు కూడగట్టడంలో ఎనలేని కృషి చేసింది. ‘ఇళ్లు, ఆసుపత్రులు, బడులు.. అన్నింటిపైనా బాంబుల వర్షమే. వేలమంది చనిపోయారు. ఇదంతా కొద్ది కాలమేనన్న ఆశ ఆవిరైంది. ధైర్యం సన్నగిల్లింది. కళ్లముందు మసక. తడిమి చూసుకుంటే కన్నీళ్లు. ఆశ్చర్యమేసింది.. ఆందోళన ఎంతగా కూడుకొని పోయిందో అర్థమయ్యాక భయమేసింది. చేతిలోని మొబైళ్లతోనే మా దుర్భర స్థితిని ప్రపంచం ఎదుట ఉంచాం. ఐక్యరాజ్య సమితి సాధించలేని దాన్నీ సామాన్య పౌరులు సమష్టిగా సాధించగలరనేది నా నమ్మకం’ అంటుంది 38 ఏళ్ల ఒలెగ్జాండ్రా.


వలంటీరు నుంచి డైరెక్టర్‌

ఒలెగ్జాండ్రా రోమంత్సోవా

2013-14 యూరో మైదాన్‌ అల్లర్లు.. దేశమంతా అట్టుడుకు తోంది. ఎకనామిక్స్‌ అండ్‌ లాలో డిగ్రీ, ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ల్లో పీజీ చేసిన రోమంత్సోవా భయపడుతూ కూర్చోలేదు. సీసీఎల్‌లో మానవ హక్కుల కార్యకర్తగా చేరింది. మానవ హక్కుల ఉల్లంఘన సమాచారాన్ని మొబైల్‌లోనే పొందేలా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌ని పర్యవేక్షించేది. అద్భుతమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆమె సొంతం. మూడేళ్లలోనే డైరెక్టర్‌ హోదాని అందుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఉక్రెయిన్‌ గళాన్ని బలంగా వినిపించడంలోనే కాదు.. రష్యన్‌ సైనికులు బంధించిన ఉక్రెయిన్‌ పౌరులను విడుదల చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ‘మా పోరాటం వల్ల మా కుటుంబాలకు ప్రాణహాని అని తెలుసు. అలాగని దాక్కొని కూర్చోలేం. ఆఖరి శ్వాస వరకూ సంస్థ కార్యకలాపాలు ఆగకూడదని నిర్ణయించుకున్నాం. చాట్‌బోట్‌, యాప్‌ల ద్వారా సహాయ వివరాలతోపాటు యుద్ధ నేరాల సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం కళ్లకు కడుతున్నాం. ఏదేమైనా మా సేవల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటాం’ అంటోంది 37 ఏళ్ల రోమంత్సోవా.


సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌.. ఉక్రెయిన్‌లో మానవహక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 2007లో ప్రారంభమైంది. ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చడం, పౌర సమాజాన్ని బలోపేతం చేయడం లక్ష్యాలుగా పోరాడుతోంది. తమ దేశంలో పుతిన్‌ సేనల యుద్ధ నేరాల వివరాలను సేకరించి... ప్రపంచం దృష్టికి తెస్తోంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్