ఆ నవ్వే సేవలకు ప్రేరణ!

డబ్బులేక చదువులు ఆగిపోతున్నాయంటే తక్షణమే ఆర్థిక సాయం చేస్తారు. స్వయం ఉపాథితో కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకునే ఏ ఇల్లాలికైనా చేయూతనిస్తారు.

Updated : 10 Oct 2022 14:52 IST

డబ్బులేక చదువులు ఆగిపోతున్నాయంటే తక్షణమే ఆర్థిక సాయం చేస్తారు. స్వయం ఉపాధితో కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకునే ఏ ఇల్లాలికైనా చేయూతనిస్తారు. సుదూరాల నుంచి చికిత్స కోసం నగరానికి వచ్చే చిన్నారుల ఆకలి బాధల్నీ తీరుస్తారు. అనారోగ్యం, ఆపద, అత్యవసరం.. కష్టం ఏదైనా తనను సంప్రదించేవాళ్లని ఖాళీ చేతులతో పంపరు నెల్లూరుకు చెందిన షేక్‌ పర్వీన్‌. ఓ సాధారణ ఇల్లాలు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటే...

పిల్లలు జీవితంలో స్థిరపడ్డారు.. ప్రభుత్వోద్యోగిగా భర్త షౌకత్‌ హుస్సేన్‌ పదవీ విరమణ తర్వాత సొంతూరు నెల్లూరు చేరుకున్నారు. మక్కాకూ వెళ్లొచ్చారు. కానీ తన జీవితం అక్కడితో ఆగిపోకూడదనుకున్నారు. పరోపకారంలోనే సంతృప్తి, స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతాయని భావించి.. భర్తతో, పిల్లలతో ఆ మాటే చెప్పారు. అద్దెలూ, భర్త పెన్షన్‌లో కొంత భాగం ఇస్తే సేవ చేస్తాననడంతో వారూ సరేనన్నారు. ‘ప్యూర్‌ స్మైల్‌’ పేరుతో తన సేవా కార్యక్రమాల్ని 2017లో ప్రారంభించారు పర్వీన్‌. ప్రచార ఆర్భాటం లేకుండా అవసరం ఉన్నవారికి సాయం చేసుకుపోవడం మొదలుపెట్టారు. అందుకు మొదట నగరంలోని మురికివాడల్ని ఎంచుకున్నారు. టైలరింగ్‌ నేర్చుకున్నా కుట్టు మిషన్‌ కొనుక్కోలేకపోతున్నామని చాలామంది చెప్పడంతో వారికి మిషన్లు కొనిచ్చారు. ‘జీవన జ్యోతి’ పేరుతో ఇప్పటివరకూ రూ.14 లక్షలతో 200 మందికి కుట్టుమిషన్లు ఇచ్చారు. త్వరలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తానంటారు పర్వీన్‌. టిఫిన్‌ దుకాణం పెట్టుకునేవారికి గ్రైండర్లు, కూరగాయలూ; పండ్ల దుకాణాలు నడపాలనుకునేవాళ్లకి తోపుడు బండ్లు అందించారు. అక్కడ చాలామంది అర్ధాకలితో రోజులు గడుపుతుంటారని తెలుసుకున్నారు. అందుకే కుటుంబ సభ్యుల, బంధువుల పుట్టినరోజులూ, పెళ్లిరోజుల సందర్భంగా బస్తీల్లోనే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తుంటారు. వారంలో మూడు రోజులు.. రోజూ కనీసం 100 మంది ఆకలి తీరుస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 50 రోజుల పాటు వందల మందికి అన్నదానం చేశారు. గతేడాది నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ఆహార పొట్లాలు, వంట సామగ్రి, దుస్తులు అందించి ఉదారతను చాటుకున్నారు.
నెల్లూరు రెడ్‌క్రాస్‌లో తలసీమియా విభాగానికి కో కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పర్వీన్‌. దాదాపు 100 మంది చిన్నారులకు నెలలో రెండుసార్లు రక్తమార్పిడి సదుపాయాన్నీ, చికిత్సనీ అందిస్తోంది రెడ్‌క్రాస్‌. విడతలుగా వారంలో మూడ్రోజులు రక్తం ఎక్కించుకునేందుకు చిన్నారులు వస్తారు. వారితోపాటు తల్లిదండ్రులూ.. వీరందరూ మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడటం చూసి.. సొంత ఖర్చులతో అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలలో ఒకరోజు చెన్నైకు చెందిన డాక్టర్‌ రమ్య అక్కడకు వచ్చి పిల్లల్ని పరీక్షిస్తారు. ఆ ఒక్కరోజే దాదాపు 50 మంది పిల్లలు వస్తారు. ఆరోజు ఆహారంతోపాటు నిరుపేద కుటుంబాల చిన్నారులకు మందుల్నీ అందిస్తారు. వీటికి నెలకు రూ.30 వేలు ఖర్చవుతుంది. గత రెండేళ్లుగా ఈ సేవల్ని అందిస్తున్నారు పర్వీన్‌. స్వర్ణదీపం, కారుణ్య, విశ్వ వెలుగు.. లాంటి దివ్యాంగుల ఆశ్రమాలకు వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లూ, ఫ్యాన్లూ, సీసీ కెమెరాల్లాంటివి అందించారు. తల్లిదండ్రులు చనిపోవడంతోనో, మరో కారణంతోనో చదువులు ఆగిపోతున్నాయంటే వెంటనే ఆదుకుంటారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల్లాంటివి కొనిస్తారు. ఇలా సాయం కోరి వచ్చే ప్రతి ఒక్కరికీ కాదనకుండా అండగా నిలుస్తారామె.


బాధ్యతగా భావిస్తా..

‘మావారి రిటైర్మెంట్‌ తర్వాత.. లేనివారికి సాయపడే కొత్త బాధ్యతని దేవుడు అప్పగించాడని భావిస్తా. సేవాకార్యక్రమాలకు కుటుంబ సభ్యులూ, బంధుమిత్రుల నుంచి తప్ప ఇతరుల నుంచి విరాళాలు తీసుకోను. రంజాన్‌ మాసంలో జకాత్‌ రూపంలో రూ.లక్షలు సాయం అందిస్తాం. సుకన్య సమృద్ధి యోజన కింద పొదుపు చేసేందుకు 30 మంది పేదింటి ఆడపిల్లలకు ఏటా రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నా. మున్ముందు నా సేవల్ని విస్తృతం చేస్తా. సాయం అందుకున్నవారి పెదాలపైన ఒక స్వచ్ఛమైన నవ్వు కనిపిస్తుంది. అదే మరింత మందికి సాయపడేందుకు ప్రేరణ కలిగిస్తుంది. అందుకే మా సేవా కార్యక్రమాలకు ప్యూర్‌ స్మైల్‌ అని పేరు పెట్టా’.


- ఓసూరి మురళీకృష్ణ, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్