ఆ సీసాలు గాజులవుతున్నాయిలా...

మత్తుకు మారుపేరైన మద్యం సీసాల్ని చూస్తే వెగటేస్తుంది. కానీ బిహార్‌ మహిళలు ఆ చెత్తను మహత్తరంగా మారుస్తున్నారు. తమదైన శైలిలో రంగురంగుల గాజులు రూపొందించి శభాష్‌ అనిపించుకుంటున్నారు.

Published : 10 Oct 2022 00:30 IST

మత్తుకు మారుపేరైన మద్యం సీసాల్ని చూస్తే వెగటేస్తుంది. కానీ బిహార్‌ మహిళలు ఆ చెత్తను మహత్తరంగా మారుస్తున్నారు. తమదైన శైలిలో రంగురంగుల గాజులు రూపొందించి శభాష్‌ అనిపించుకుంటున్నారు.

‘నాకు గాజులంటే బోల్డంత ఇష్టం. అవి ధైర్యానికి సంకేతం’ అంటుంది పట్నాకు చెందిన సునీత. నిజానికి కళకళలాడుతూ గలగలలాడే గాజులంటే అమ్మాయిలందరికీ సరదానే. సునీత భర్త ప్రతి రోజూ తాగి వస్తాడు. ఆ మత్తులో ఆమెని చితకబాదుతాడు. రోజూ చేతికున్న గాజులన్నీ పగిలిపోవాల్సిందే. ఇది సునీత కథ మాత్రమే కాదు, బిహార్‌లో చాలామంది గృహిణుల వ్యథ. 2016 నుంచి అక్కడ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. కానీ అక్రమ రవాణా ఆగలేదు. ఎక్సైజ్‌ దాడిలో పట్టుబడే లక్షల మద్యం సీసాలను రోడ్‌రోలర్ల సాయంతో ధ్వంసం చేసేవారు. ఆ గాజు వ్యర్థాలను ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అది అనారోగ్య సమస్యలకూ కారణమయ్యేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ విభాగం పగిలిన ఆ గాజు సీసాలతో చేతి గాజుల తయారీ నేర్చు కునేందుకు కొందరు మహిళలను ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపింది. గాజుల తయారీ యూనిట్ల ఏర్పాటుకోసం రూ.కోటి మంజూరు చేసింది. తర్వాత ఇది ఎందరికో ఉపాధిమార్గమైంది. మరెందరో తమకిష్టమైన గాజులను అతి తక్కువ ధరకి ఇళ్ల ముందరే కొనుక్కునే అవకాశం లభిస్తోంది.

‘సీసాలతో గాజులను రూపొందించడం భేషైన పరిష్కారం’ అంటారు బిహార్‌ ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ మంత్రి సునీల్‌కుమార్‌. ఆ పరిణామానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్త్రీలు. నిషేధాన్ని లక్ష్యపెట్టక మద్యం కోసం అర్రులు చాస్తూ వీధుల్లో తిరిగే భర్తలు.. కోపంతో రగిలిపోతూ వాళ్లమీద తిరుగుబాటు చేసే భార్యలు.. ఇలాంటి వాతావరణంలో ధ్వంసమైన సీసాలతో రంగురంగుల గాజుల్ని రూపొందించే ఏర్పాటు అపురూప ఆలోచన, అద్భుత పరిణామం.

ఒకప్పుడు పట్నాలో నిత్యం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకునేవి. కానీ ఇటీవల కాలంలో కొంత మార్పు వచ్చింది. కొత్త ఆలోచనలూ, కొంగొత్త ఆశయాలకూ మారుపేరైంది. సీసాలతో గాజుల తయారీ ఒక్కటే కాదు... ప్రతి ఆటంకానికీ విరుగుడు కనిపెట్టేందుకు చూస్తున్నారు. మొండి బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు హిజ్రాలను నియమించాలని చూస్తోంది పట్నా.

పన్ను ఎగవేతదారుల ఇళ్ల ముందు వాళ్లు డప్పు వాయిస్తూ, పాటలు పాడుతుంటే సిగ్గుపడి తక్షణం బాకీ చెల్లిస్తారనేది ఆలోచన.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్