చదువు లేకున్నా.. ఛైర్‌పర్సన్‌ అయ్యారు

రైతు కష్టం వృథా కాకూడదనుకున్నారు. అందుకే.. అక్షరజ్ఞానం లేకున్నా గిరిబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం దళారులని ఎదురించారు.  ఏడు మండలాల రైతులని ఏకం చేసి వాళ్లకు సారథ్యం వహిస్తున్న సరస్వతి స్ఫూర్తిగాథ ఇది...  శ్రీకాకుళం జిల్లాలోని చిన్న కిట్టాలపాడు సరస్వతిది.

Updated : 12 Oct 2022 07:25 IST

రైతు కష్టం వృథా కాకూడదనుకున్నారు. అందుకే.. అక్షరజ్ఞానం లేకున్నా గిరిబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం దళారులని ఎదురించారు.  ఏడు మండలాల రైతులని ఏకం చేసి వాళ్లకు సారథ్యం వహిస్తున్న సరస్వతి స్ఫూర్తిగాథ ఇది... 

శ్రీకాకుళం జిల్లాలోని చిన్న కిట్టాలపాడు సరస్వతిది. గిరిజన మహిళ. చిన్నవయసులోనే పెళ్లి, అయిదేళ్లకే భర్త వదిలేశాడు. ముగ్గురు పిల్లలు.. అయినా కుంగిపోలేదావిడ. వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యంగా బతికారు. పశువులు కాయడం, పోడు వ్యవసాయంతో వచ్చిన ఆదాయమే జీవనాధారం. కష్టపడి పండించినా దళారులు తక్కువ ధరకే తీసుకునేవారు. దీన్ని గమనించిన సరస్వతి వాళ్లని ప్రశ్నించారు. అయినా మార్పు లేకపోవడంతో మరికొందరిని కూడగట్టుకొని బయట అమ్మడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒత్తిళ్లు. అయినా తగ్గలేదు. తన ప్రయాణానికి చుట్టుపక్కల గ్రామాలూ తోడయ్యాయి. వీళ్ల పోరాటాన్ని గమనించిన విద్యా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆరేళ్ల క్రితం వీళ్ల గ్రామాన్ని దత్తత తీసుకుంది. పొలం పనులు లేనప్పుడు కూలికెలితేనే ఇక్కడి ప్రజలకు ఆదాయం. వీళ్లకు ఉపాధి కల్పించాలని ఈ సంస్థ ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమ నెలకొల్పింది. సరస్వతి అందులో కార్మికురాలిగా చేరి, తోటి మహిళల్నీ చేర్పించారు. ఆర్థికంగా వారి కుటుంబాలు నిలదొక్కుకునేలా చేశారు. పంటను బహిరంగ విపణిలో అమ్ముకునేలానూ సంస్థ సాయమందించేది. రైతులు పండించిన ధాన్యాలు, జీడిపిక్కలు,  చీపుర్లు, చింతపండు, పసుపు వంటివాటిని సేకరించి సంస్థకు అందించేవారు. వాళ్లు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్‌ తదితర డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అధిక ధరలకు వీటిని విక్రయిస్తున్నారు.

ఏడొందల మందికి నాయకత్వం

స్థానిక రైతులంతా నాబార్డు ఆధ్వర్యంలో ‘గ్రీన్‌బర్డ్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘం’గా ఏర్పడ్డారు. ఈమె నాయకత్వ లక్షణాలను గుర్తించిన స్వచ్ఛంద సంస్థ 2019లో సంఘానికి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా పోటీ చేయించింది. దళారీ వ్యవస్థ, దాని నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పిస్తూ.. వారి పంటకు మార్కెట్లో అధిక లాభాలొచ్చేలా చేస్తున్నారు. అందుకే 2020లో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ఈమెను ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. మొదట్లో 100 మందితో ఉండే ఈ సంఘం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 700కు చేరింది. నాబార్డు ఈమెను ఈఏడాది ఉత్తమ మహిళా ఛైర్‌పర్సన్‌గా ఎంపికచేసింది. పెసలు, మినుములను పప్పులుగా మార్చడానికి కావాల్సిన యంత్రాల కొనుగోలు కోసం రూ.5లక్షలు సమున్నతి పథకం ద్వారా రుణంగా తీసుకొన్నారు. వీటిని మార్కెట్లకు తరలించడానికి వీలుగా వాహనాన్నీ కొనుగోలు చేశారు. ఇప్పుడీ సంఘం టర్నోవర్‌ రూ.40లక్షలు. ఇంతచేస్తున్నా ఈమెకు సంతకం మినహా ఏమీరాదు. సమస్యను గుర్తించడం, ప్రశ్నించేతత్వం ఉంటే ఏదైనా సాధ్యమంటారీమె. ఆడపిల్లల్ని డిగ్రీలు చదివించారు. కొడుకు స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

- జోగిమహంతి ఆనందరావు, సారవకోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్