ఆమె పోరు... చట్టాల్ని మార్చింది

సేవ ఆవిడకు వారసత్వం. ఆ దారిలో సాగుతుండగా... తన కూతురు పసిపిల్లను చూసుకోవడం కోసం శ్రమించి సాధించుకున్న ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

Updated : 16 Oct 2022 07:45 IST

సేవ ఆవిడకు వారసత్వం. ఆ దారిలో సాగుతుండగా... తన కూతురు పసిపిల్లను చూసుకోవడం కోసం శ్రమించి సాధించుకున్న ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడామె వేసుకున్న ప్రశ్న... ఇలా ఇంకెంత మంది ఇబ్బందుల పాలవుతున్నారో అనే. వెంటనే వారి సమస్యల పరిష్కారానికి ఒంటరిగానే నడుం కట్టారావిడ. ఆవిడ పోరాటం చట్టాల్నే మార్చింది... కొత్త చట్టాల్నీ చేయించింది... ఆవిడే ‘కుసుమం’...

సామాజికసేవే జీవితంగా భావించే కుటుంబంలో పుట్టారు కుసుమం.ఆర్‌. పున్నప్రా. నానమ్మ, తాతయ్య, తండ్రి గ్రామ సేవలో పాలు పంచుకుంటే, అమ్మ వనితా సమాజ సభ్యురాలు. చిన్నప్పటి నుంచి అమ్మ చిటికెనవేలు పట్టుకొని సేవా కార్యక్రమాలకు వెళ్లేవారీమె. కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన ఈమె డిగ్రీ చదివారు. ప్రభుత్వ సంస్థ కెల్‌ట్రాన్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగం చేస్తూనే, వనితా సమాజం తరఫున సేవలు కొనసాగించారు. మరుందంకుళి రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో సభ్యురాలిగానూ సేవలందించే వారు. ఈమె ప్రసవించినప్పుడు కెల్‌ట్రాన్‌లో క్రెష్‌ సౌకర్యం ఉండటంతో పాపను అక్కడుంచి విధులకు వెళ్లే వారు. తర్వాత కొన్నాళ్లకు ఉద్యోగానికి రాజీనామా చేసి, ట్రేడ్‌ యూనియన్‌లో చేరారీమె.

చట్టపరంగా..
కుసుమం కూతురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అప్పటికే ఆమెకు పెళ్లై ఓ చంటిపిల్ల్ల. ఐటీ సంస్థలో ప్రసూతి సెలవులు లేకపోవడంతో చివరకు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తనొక్కతే కాదు... మరెందరో ఐటీ ఉద్యోగినులు ప్రసూతి సెలవుల్లేక ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని కుసుమం చూశారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం కట్టారు. ‘పత్రికల్లో ఈ అంశంపై వ్యాసాలు, చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టా. చాలామంది ఐటీ ఉద్యోగినులతో మాట్లాడా. ఈ సమస్యపై నేను రాసిన ఓ వ్యాసాన్ని 2014లో ‘టెక్‌ బేబీస్‌ ఆర్‌ డినైడ్‌ బ్రెస్ట్‌ మిల్క్‌’ శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించి, ప్రముఖ దినపత్రికలో ప్రచురించారు. దాంతో నా పోరాటం రాష్ట్ర స్థాయికి చేరింది. ఉద్యోగినులు ప్రసవించాక ఆరు నెలల సెలవులు, చంటిపిల్లలకు క్రెష్‌ సౌకర్యం తప్పని సరి. అప్పటికి నేను ఉద్యోగ విరమణ చేసి ఆరు నెలలైంది. ఇక నా సమయాన్ని పూర్తిగా ఈ సమస్యపై పోరాటానికి కేటాయించా. కేరళ లేబర్‌ కమిషన్‌ ఆఫీసు చుట్టూ తిరిగేదాన్ని. మానవ హక్కుల సంఘానికి లేఖలు రాసే దాన్ని. మూడేళ్లు పట్టువదలకుండా ఈ రెండు కార్యాలయాలకూ తిరుగుతూనే ఉన్నా. చివరికి నా కృషి, పట్టుదల ఫలించాయి... ‘ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌- ఈఎస్‌ఐ యాక్ట్‌ 1948’కి సవరణ చేశారు. తర్వాత మిగిలిన సమస్యలపై దృష్టిపెట్టా. నా పిటిషన్‌తో ‘1961 మెటర్నిటీ బెన్‌ఫిట్స్‌ యాక్ట్‌’కి సవరణ జరిగింది. ఫలితంగా 2015లో 50.. అంతకన్నా ఎక్కువ ఉద్యోగులున్న ఏ సంస్థలోనైనా తల్లి పనిచేసే చోటుకి 500 మీటర్లలోపు డే కేర్‌ సెంటర్‌ సదుపాయం తప్పని సరి అయ్యింది.  ఆ తర్వాత... 2017లో ఐటీ సంస్థల్లో మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవుల చట్టాన్ని తీసుకు రావడానికీ అలుపెరగని శ్రమ చేశా. అంతే కాకుండా ప్రసవం తర్వాత ఉద్యోగినులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి లేకుండా ఈఎస్‌ఐ చట్టాన్ని కట్టుదిట్టం చేయడంలోనూ నాదే ప్రధాన పాత్ర... ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి’ అంటున్న కుసుమం అక్కడితో ఆగలేదు. ప్రభుత్వేతర పాఠశాలలు, ఇంజినీరింగ్‌, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీ సిబ్బందికీ ఈ తరహా సౌకర్యాలు వచ్చే వరకూ కృషి చేశారు.

మనం ఒక్కరమే, మనతో ఏం అవుతుంది అనుకోకూడదు. ధైర్యంగా రంగంలోకి దిగి పోరాడటం మొదలుపెడితే ఫలితం దానంతట అదే వస్తుంది... అంటారీ యోధురాలు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్