నేర్చుకున్న చోటే యజమానిగా..

వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే వారు కొందరైతే, ప్రతికూల పరిస్థితుల్లో సైతం అవకాశాల్ని సృష్టించుకునే వారు మరికొందరు. నగిరెడ్డి రమాదేవి ఈ రెండో కోవకు చెందుతారు. ప్రభుత్వం నిర్వహించే ఉపాధి శిక్షణ తీసుకుని... తన కలను నెరవేర్చుకోవడమే కాదు, ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరుచుకున్నారామె. 

Updated : 18 Oct 2022 06:42 IST

వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే వారు కొందరైతే, ప్రతికూల పరిస్థితుల్లో సైతం అవకాశాల్ని సృష్టించుకునే వారు మరికొందరు. నగిరెడ్డి రమాదేవి ఈ రెండో కోవకు చెందుతారు. ప్రభుత్వం నిర్వహించే ఉపాధి శిక్షణ తీసుకుని... తన కలను నెరవేర్చుకోవడమే కాదు, ఆర్థిక పరిస్థితినీ మెరుగుపరుచుకున్నారామె. ‘డిజైర్‌ ఓవర్‌సీస్‌’ పేరుతో టెక్స్‌టైల్‌ సంస్థ నిర్వహిస్తూ... తనలాంటి వందల మహిళలకు చేయూతనందిస్తున్నారు.

‘అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే అవకాశాల కోసం కష్టపడితేనే ఫలితం వస్తుంది’ అన్న నమ్మకమే నన్ను నడిపిస్తోంది’ అనే రమాదేవికి సవాళ్లను స్వీకరించడమంటే ఎంతో ఇష్టం. ఆమెది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు. వ్యవసాయ కుటుంబం. అప్పటి ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఇంటర్‌లోనే తనకి పెళ్లి చేశారు. చదువుకోవాలన్న ఆమె కోరికను భర్త ప్రోత్సహించడంతో బీఈడీ పూర్తి చేశారు. కానీ పిల్లలూ, కుటుంబ బాధ్యతలతో ఉద్యోగం చేయాలనే కల నెరవేర్చుకోలేకపోయారు. ఈలోగా ఆర్థిక ఇబ్బందులు. దర్జీ పనిచేసే భర్తకు సాయంగా ఉండొచ్చని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలోని ఫ్యాషన్‌ టెక్నాలజీ సెంటర్‌లో దుస్తుల తయారీలో శిక్షణ తీసుకున్నారావిడ. తక్కువ సమయంలోనే మోడల్‌ దుస్తుల తయారీలో పట్టు సాధించారు.

ఇబ్బందులను తట్టుకుని...

అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఆర్‌డీఏ నెలకొల్పిన ఫ్యాషన్‌ టెక్నాలజీ సెంటర్లన్నీ నిర్వహణ లోపంతో మూతపడటం మొదలయ్యాయి. కొన్నింటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనుకుంది ప్రభుత్వం. విషయం తెలుసుకున్న రమ కె.కోటపాడు సెంటర్‌ను నిర్వహించేందుకు నెలవారీ అద్దె ప్రాతిపదికన డీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్నారు. అలా 2014 నుంచి నడుపుతున్నారు. దీన్ని కేవలం వ్యాపారంగానే కాకుండా తోటి మహిళలకు తోడ్పడే అవకాశంగా చూశారు రమ. ఇక్కడ వందల మంది ఔత్సాహిక మహిళలకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 50-100 మంది ఉపాధి పొందుతున్నారు. రమ, ఆమె భర్త... వివిధ సంస్థల బల్క్‌ ఆర్డర్లు తీసుకుని వీరికీ పని కల్పిస్తూ, తామూ ఆదాయాన్నీ అందుకుంటున్నారు.

కరోనా తెచ్చిన కష్టం...

సాఫీగా సాగుతున్న రమాదేవి ప్రయాణంలో కరోనా కొత్త కష్టాల్ని తెచ్చిపెట్టింది. తయారు చేసిన వేలాది దుస్తుల్ని ఆయా కంపెనీలు తీసుకెళ్లలేదు. కొత్త ఆర్డర్లూ రాలేదు. దాంతో నెలల తరబడి పనీ, ఆదాయమూ రెండూ లేవు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మిగతా సెంటర్లూ మూతపడ్డాయి. రమ మాత్రం సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలనుకున్నారు. కార్పొరేట్‌, ప్రభుత్వ, సంస్థలకు మాస్కులు కుట్టడం మొదలు పెట్టారు. కరోనా ముందు వరకూ ఈ సంస్థ కోటి రూపాయల టర్నోవర్‌ చేసేది. తర్వాత ఇల్లు గడిచేంత కూడా రాకపోయినా... తగ్గలేదామె. ఆమె నమ్మకమే నిజమైంది. క్రమంగా సంస్థ గాడిన పడింది. విశాఖలోని ఫార్మా పరిశ్రమలు, ప్రముఖ ఆసుపత్రులతో పాటు అనేక సంస్థలు సిబ్బందికి వేల సంఖ్యలో ఏకరూప దుస్తులను తనతోనే కుట్టిస్తున్నాయి. పలు దుకాణాలకు షర్టులూ, ప్యాంట్‌లూ, టాప్‌లూ, లెగ్గింగ్‌లూ, కుర్తీలూ, నైటీలూ... ఒకటేమిటి అన్నీ బల్క్‌లో కుట్టిస్తారిక్కడ. ‘ఒకప్పుడు నెలకు రూ.వెయ్యి స్టైఫండ్‌తో ఇక్కడ పని నేర్చుకున్నాను. ఈ రోజు నెలకు రూ.3.5 లక్షల దాకా జీతాలిచ్చే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. ఇదంతా ధైర్యం, పట్టుదల వల్లే’ అంటున్నారు రమ.

-పైడిరాజు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్