పేదరికంపై వెదురు తిరిగింది..

రెండు పదులు నిండేసరికే ముగ్గురు పిల్లలకు తల్లైంది. పూట గడవడం కోసం ఇల్లిల్లూ తిరిగి దుస్తులు విక్రయించేది. చురుకైంది కావడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు.

Published : 19 Oct 2022 00:15 IST

రెండు పదులు నిండేసరికే ముగ్గురు పిల్లలకు తల్లైంది. పూట గడవడం కోసం ఇల్లిల్లూ తిరిగి దుస్తులు విక్రయించేది. చురుకైంది కావడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. ఇంకేం విజేతగా నిలిచింది. ఊరికి సౌకర్యాలతోపాటు, తానూ ఆర్థిక సాధికారతను సాధించింది. వెదురు ఉత్పత్తుల తయారీలో దూసుకుపోతోంది... అంతేనా వేల మంది మహిళలకూ శిక్షణనీ, ఉపాధినీ కల్పిస్తోన్న ‘తేచీ అన్నా’ విజయగాథ ఇదీ...

పేద కుటుంబంలో పుట్టడంతో ఎనిమిదో తరగతి వరకే తేచీ చదువుకోగలిగింది. 16వ ఏటనే తనకన్నా పదేళ్ల పెద్దైన వ్యక్తితో పెళ్లి చేసేశారు. దాంతో అరుణాచల్‌ప్రదేశ్‌, పాపుంపరే జిల్లాలోని అత్తారింటికి వచ్చింది. వాళ్లదీ పేద కుటుంబమే. 21 ఏళ్లు వచ్చే సరికి ముగ్గురు పిల్లలు. భర్త నిరుద్యోగి. ఇక తానే కష్టపడాలని ఇంటింటికీ తిరిగి వంటింటి వస్తువులు, ఫ్యాన్సీ నగలు వంటివీ అమ్మే పనిలో చేరింది... ఆ కొద్ది పాటి ఆదాయంతోనే కుటుంబాన్ని లాక్కొచ్చింది. ఆ ఊళ్లో ఎనిమిదో తరగతి వరకూ చదివింది తనొక్కతే. దాంతో 2009లో పంచాయతీ ఎన్నికల్లో తనని నిలబెట్టారు. చురుకైంది, తెలివైంది కావడంతో తేలిగ్గానే గెలిచింది.

ఉత్పత్తుల తయారీతో..
పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికవ్వడం తన జీవితంలో పెద్ద మలుపు అంటుందీమె. ‘ఊరి పెద్దలు, రాజకీయ ప్రముఖులను కలిసినప్పుడు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకొనే దాన్ని. ఓసారి రాష్ట్ర గవర్నరు జేజే సింగ్‌ మా ఊరికి వచ్చారు. గవర్నరుతో నన్ను మాట్లాడ మన్నారు. మాటల్లో స్థానిక వెదురుతో రకరకాల ఉత్పత్తులు తయారు చేసి, ఉపాధి పొందొచ్చని ఆయన సూచించారు. దీనికి పైసా పెట్టుబడి అవసరం లేదు. మాకు దాదాపు 57 రకాల వెదురు దొరుకుతుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మా జీవితాల్లో వెదురు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అమ్మ దగ్గర ఇంటికి కావాల్సిన వస్తువులను వెదురుతో తయారు చేయడాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నా. అది ఇప్పుడు ఉపయోగపడింది. వెదురుతో ఆభరణాలు సహా టోపీలు, బుట్టలు, పెట్టెలు వంటి రకరకాల వస్తువులు చేసి వారాంతపు సంతలో అమ్మడం మొదలు పెట్టా. నెమ్మదిగా వీటి గురించి  తెలిసి వేరే మార్కెట్ల నుంచి కూడా నా దగ్గరకి వచ్చే వారు. అప్పుడే అనిపించింది.... చుట్టుపక్కల మహిళలకూ శిక్షణ ఇస్తే వాళ్లూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు కదా అని. అలా 2011లో ‘పోమా బ్యాంబూ ప్రొడక్ట్స్‌’ ప్రారంభించా. రాష్ట్రేతర ప్రాంతాల ఎగ్జిబిషన్లలలో మా ఉత్పత్తులను ప్రదర్శించడంతో అక్కడి నుంచి కూడా ఆర్డర్లు మొదలయ్యాయి. నా వ్యాపారం సరే... వందలాది మహిళలకు శిక్షణనిచ్చి ఉపాధినీ కల్పించగలగడం చాలా సంతృప్తినిస్తోంది’ అంటోంది తేచీ.

కోర్సులు కూడా...
గతంలో రూపాయి సంపాదన తెలియని అక్కడి మహిళలు తేచీ చేయూతతో నెలకు రూ.10- 18 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. నేపాల్‌, కశ్మీరు, దిల్లీ, ముంబయి తదితర ప్రాంతాలకు చెందిన 3 వేల మందికిపైగా తేచీ శిక్షణలో నైపుణ్యాలను పెంచుకున్నారు. హాస్టల్‌ సౌకర్యంతో 14 రోజుల కోర్సునూ నిర్వహిస్తోంది. ‘ప్రభుత్వ సంస్థలకూ ఉత్పత్తులు అందిస్తున్నాం. రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రారంభించిన పోమా సంస్థ గతేడాది రూ.50 లక్షలు వార్షికాదాయాన్ని దాటడం సంతోషంగా ఉంది’ అంటున్న 42 ఏళ్ల తేచీ కథ స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్