భామనే.. సత్యభామనే..

సత్రాజిత్‌ మహారాజు గారాల పట్టి సత్య. కోటలో పుట్టి అల్లారు ముద్దుగా పెరగడం వల్ల కోరిన ప్రతిదీ సొంతం కావాలనుకునే పట్టుదల తనది. దుర్మార్గుడైన శతధన్వుడితో తన పెళ్లి చేసేందుకు తండ్రి మాటిచ్చాడని తెలిసి ఎంతగానో మదన పడింది. కృష్ణుణ్ణి ఎన్నిసార్లో స్మరించింది. నరకుణ్ణి మట్టుపెట్టేందుకు సత్యగా అవతారం దాల్చిన భూమాత కదా! తన ప్రార్థనలు ఫలించి కృష్ణుడి అర్ధాంగి అయిన వేళ సాధారణ యువతిలా పరవశించి పోయింది.

Updated : 24 Oct 2022 08:06 IST

పురాణాల్లో మనకి మహా ఇష్టమైన పాత్ర సత్యభామ. ఈ తరం అమ్మాయిలు అలవరచుకోవాల్సిన ధైర్యం, స్థైర్యం, సమయస్ఫూర్తి లాంటి సుగుణాలు నేర్పిన సత్యది ఆసక్తికర తత్వం. దర్పం నిండిన సోయగం. ఇలానే ఉండాలనిపించే విశిష్ట వ్యక్తిత్వం.

త్రాజిత్‌ మహారాజు గారాల పట్టి సత్య. కోటలో పుట్టి అల్లారు ముద్దుగా పెరగడం వల్ల కోరిన ప్రతిదీ సొంతం కావాలనుకునే పట్టుదల తనది. దుర్మార్గుడైన శతధన్వుడితో తన పెళ్లి చేసేందుకు తండ్రి మాటిచ్చాడని తెలిసి ఎంతగానో మదన పడింది. కృష్ణుణ్ణి ఎన్నిసార్లో స్మరించింది. నరకుణ్ణి మట్టుపెట్టేందుకు సత్యగా అవతారం దాల్చిన భూమాత కదా! తన ప్రార్థనలు ఫలించి కృష్ణుడి అర్ధాంగి అయిన వేళ సాధారణ యువతిలా పరవశించి పోయింది. కడలిలో ఐక్యమయ్యే నదిలా ఉప్పొంగింది. స్త్రీ సహజ లక్షణం మరి.

సత్యా కృష్ణుల పెళ్లి సందర్భంలో ఆమె సద్గుణాలను గురించి చెబుతూ ప్రేమ, దయ, నీతి, ధర్మనిరతి, విచక్షణ, కీర్తికాంక్ష కలిగిన సత్యభామను శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడంటూ ప్రస్తుతించాడు పోతనా మాత్యుడు. సత్యభామ లక్షణాలు ఆదర్శ మహిళగా ఖ్యాతి పొందేందుకు ఏతరం వారికైనా తర్ఫీదునిచ్చేవే అనడంలో సందేహమేముంది?!

ఆ కాలంలోనే సత్యభామ ఆధునిక భావజాలమున్న మహిళ. స్త్రీలు ఇంటి గుమ్మం దాటడానికే ఆంక్షలున్న రోజుల్లో కట్టుబాట్ల వలయాన్ని దాటి కదన రంగానికెళ్లింది. నరకాసురుణ్ణి వధించేందుకు ఆ ఏడు మల్లెలెత్తు సుకుమారి తన సౌకుమార్యాన్ని పక్కనపెట్టింది. చిన్న నాటే యుద్ధ విద్యలన్నీ ఆపోశన పట్టింది కావడంతో రాక్షసులను చీల్చి చెండాడింది. అలా పతికి సహకరించి అర్ధాంగి పదానికి అక్షర సత్యమై నిలిచింది. ఆ తెగువ అనన్య సామాన్యం. మగువ కోమలత్వాన్ని విడిచి కరకుదనం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టించింది.

వ్యక్తిత్వాన్ని మార్చేశారు

ఒక్కోసారి సత్యభామ అసలు పేరు ఆవేశం, ఇంటిపేరు ఈర్ష్య కాబోలు అనిపిస్తుంది. నిజానికి భారత భాగవతాల్లో తనో ఉత్తమ భార్యగానే కనిపిస్తుంది. కృష్ణదేవరాయలూ, తిరుమలదేవిల తగవు తీర్చేందుకు ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ పాత్ర తీరుతెన్నును మార్చేశాడు. నాటకాలూ, సినిమాలూ దాన్నే అనుసరించడంతో ఆమె ఆత్మాభిమానం కాస్తా అసూయగా చిత్రితమైంది.

భామాకలాపం

పూలు వికసించడం, మేఘం వర్షించడం అంత సహజ ప్రక్రియ స్త్రీ పురుషుల ప్రణయారాధన. మనసుకు నచ్చిన వ్యక్తి పట్ల ప్రేమ, విరహం వ్యక్తీకరణకు ఆంగిక వాచిక ఆహార్యాలతో అనువైన కూచిపూడి నృత్య ప్రదర్శన భామాకలాపం. ఇప్పటికీ, ఎప్పటికీ ప్రమోదం కలిగించే ఈ నృత్యం సత్యభామ పాత్రకు ప్రత్యేకం. పురాణాల్లో వందల స్త్రీల పాత్రలున్నా వేరెవ్వరికీ అందని అదృష్టమది. మూర్తీభవించిన స్త్రీత్వంతోబాటు కొండంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించేది సత్యభామ కనుకనే శతాబ్దాలుగా భామాకలాపం మన మనసులు దోచుకుంటోంది.

వల్లమాలిన ప్రేమ

కృష్ణాసత్యలది జన్మజన్మల అనుబంధమైనా ఆ నల్లనయ్య పట్ల ప్రేమారాధన విషయంలో ఆమెది తనివి తీరని దాహం. అందుకే ఆవిడ ప్రతిచర్యలోనూ శ్రీకృష్ణుడు తనకు మాత్రమే సొంతమనే భావన వ్యక్తమవుతుంది. చూసేవాళ్లు పెనిమిటిని కొంగుకు కట్టేసుకుంటోంది అనుకుంటారే కానీ కన్నయ్యకి కూడా ఆమె పట్ల అంతే అనురాగం, ఆరాధన ఉన్నాయని అర్థం చేసుకోరు. ఎంత ఇష్టం లేకపోతే దేవేంద్రుణ్ణి సైతం ఎదిరించి, పారిజాతాపహరణం చేసుకొస్తాడు. గోవిందుడలా వల్ల మాలిన ప్రేమను ప్రదర్శించబట్టే కదా భామ అంతగా ప్రతిస్పందన చూపగలిగింది.

ఒకసారి సత్యభామ ‘పాండవులకు నీ పట్ల అనురాగం తగ్గకుండా ఉండేందుకు ఏం చేస్తున్నావు?’ అనడిగింది ద్రౌపదిని. ఆ సూత్రాలేంటో తెలిస్తే కృష్ణుడు తనకే సొంతమయ్యేలా చేసుకోవాలన్న ఆరాటం ఆమెది. అప్పుడు ద్రౌపది ‘వారితో కలిసి సంతోషంగా ఉండటానికి అహాన్ని దూరం పెడతాను. ఎన్నడూ కటువుగా మాట్లాడను. వారి అభిప్రాయాలను సంకేతంతోనే గ్రహించి పనులయ్యేలా చూస్తాను. వారి దగ్గర ఇతరులను చులకన చేయను. ఎందరు సేవకులున్నా నేనే వండి వడ్డిస్తాను..’ అంటూ చెబితే ఆసక్తిగా వింది సత్య. సత్యాకృష్ణుల ప్రేమ అనంతం, అపూర్వం. ‘సత్యభామ సరసం, పారిజాత పల్లవి, తులసీదళం’- పేర్లతో జానపద గీతాలు నేటికీ వినిపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్