ఉమెన్నోవేటర్‌.. మహిళలకు ప్రత్యేకం!

‘మిమ్మల్ని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతా.. అందుకు ఫీజు అవసరం లేదు. మీరు మరో మహిళని వ్యాపారవేత్తగా మార్చితే చాలు’.. అరె ఇదేదో చిరంజీవి సినిమా డైలాగ్‌లా ఉందే అనుకుంటున్నారా?

Updated : 27 Oct 2022 16:15 IST

‘మిమ్మల్ని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతా.. అందుకు ఫీజు అవసరం లేదు. మీరు మరో మహిళని వ్యాపారవేత్తగా మార్చితే చాలు’.. అరె ఇదేదో చిరంజీవి సినిమా డైలాగ్‌లా ఉందే అనుకుంటున్నారా? తృప్తి ఈ పద్ధతిలోనే 10వేలమంది మహిళలతో నెట్‌వర్క్‌ని ఏర్పరిచి రికార్డు సృష్టించారు. మెంటారింగ్‌, పెట్టుబడులూ అందిస్తూ మహిళా వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నారు..

ఆ రోజు ప్రఖ్యాత శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం... అంతటా సందడే. ఆ చిరునవ్వులు, ఆత్మీయ పలకరింపులని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు అదే కాలేజీలో సీఏ చదివి, ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌లో ఉద్యోగం చేస్తున్న తృప్తి సింఘాల్‌ సోమాని. ‘100 ఉమెన్‌ ఫేసెస్‌ ఆఫ్‌ ఎస్సార్‌సీసీ’ అంటూ నెట్‌వర్క్‌ని ఏర్పరిచి స్నేహితురాళ్లని ఆహ్వానించారు. పట్టుమని 20 మంది కూడా చేరలేదు. ‘ఆసియాలోనే పేరున్న కాలేజీలో చదువుకున్నా... ఎందుకు చొరవ చూపడం లేదు? ఈ ప్రశ్న నన్ను వేధించింది. చాలా మందితో మాట్లాడాక విషయం అర్థమైంది. ఆడవాళ్ల సామర్థ్యంపై సహజంగానే చిన్న చూపు. ‘వీళ్లు సాధించగలరా?’ అనే అపనమ్మకం పైఅధికారుల్లో ఉంటుంది. దాంతో మనమూ ‘అవును మన వల్ల కాదులే!’ అని వెనకడుగు వేస్తాం. దీన్నే ‘గోలెమ్‌ ఎఫెక్ట్‌’ అంటారు. ఈ నైరాశ్యాన్ని తొలగించి స్త్రీలలో ఉత్సాహాన్ని తీసుకురావాలనుకున్నా. ‘100 ఉమెన్‌ ఫేసెన్‌’ పేరుతో కొత్త నెట్‌వర్క్‌కి శ్రీకారం చుట్టా’ అనే తృప్తి పుట్టింది బరేలీలో. ‘అక్కడ మా ఇల్లు పెద్ద సంస్థానంలా ఉండేది. ఆ ఇంట్లో ఒకచోటి నుంచి మరొక చోటికి సైకిల్‌ మీద రావొచ్చు. తర్వాత నా పరిస్థితి మారిపోయింది. గుడ్‌గావ్‌లోని అత్తయ్య ఇంటి నుంచి బస్సులు, రైళ్లు మారి దిల్లీ ఎస్సార్‌సీసీ కాలేజీకి వచ్చే దాన్ని. ఈ ప్రయాణం లోకజ్ఞానాన్ని నేర్పింది. ఆడవాళ్ల ఇక్కట్లనూ తెలిపింది. తర్వాత ప్రైస్‌వాటర్‌ కూపర్స్‌లో చేరాను. అంతలో హఠాత్తుగా నాన్న చనిపోయారు. కుటుంబ వ్యాపారాన్ని నేనే చేపట్టాల్సి వచ్చింది. దేశంలోని ప్రముఖ సంస్థలకు సీఏ సేవలు అందిస్తుంటాం. ఇందులో 200 మంది ఉద్యోగులున్నారు. ఈ సంస్థ నిర్వహణలోనే ఎన్నో ఎత్తుపల్లాలని చూశా. ఆ అనుభవమే ఈ నెట్‌వర్క్‌కి ఉపయోగపడింది’ అంటారు తృప్తి.

ఆలోచనలు ఆచరణలోకి...
‘నెట్‌వర్క్‌ ఒక్కటే సరిపోదు. వాళ్ల మనసులో ఆలోచనలని ఓపిగ్గా వెలికి తీయాలి. వ్యాపారానికి ఏవి పనికొస్తాయో తెలుసుకోవాలి. నిపుణులతో మాట్లాడించాలి. సమాచారం తెలుసుకోవాలి. పెట్టుబడులు సంపాదించుకోవాలి. అదే కదా అసలైన ఇంధనం. ఇవన్నీ జరగాలంటే మెరికల్లాంటి మెంటార్లు కావాలి. ఇందుకోసమే ‘ఉమెన్నోవేటర్‌’ సంస్థను స్థాపించా. సాధారణ సంస్థగానే ప్రారంభమైనా... మెల్లగా అంతర్జాతీయ స్థాయి ఇంక్యుబేటర్‌గా తీర్చిదిద్దా. ప్రస్తుతం ఇది 50 నగరాల్లో విస్తరించింది. 10 వేలమంది ఇందులో సభ్యులు. వీళ్లలో చాలామంది పెట్టుబడులూ అందుకున్నారు. గత ఏడాది 100 నిమిషాల్లో.. 100 మంది వ్యాపార ఆలోచనలు చెప్పి రికార్డుల్లోకీ ఎక్కారు. ఇదంతా నా గొప్పతనం కాదు. పరస్పర సహకారం వల్లనే సాధ్యమైంది. నెట్‌వర్క్‌లోకి చేరడానికి ఫీజు అవసరం లేదు. మీరు మరో మహిళకి మెంటార్‌గా ఉండండి చాలు అన్నా. ఈ ఆలోచన బాగా పనిచేసింది. ఒకరికొకరు అందిపుచ్చుకున్నారు. నేనూ స్వయంగా కొంత మందికి ఫండింగ్‌ ఇచ్చాను’ అనే తృప్తి మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ విభాగానికి ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్