చిరువ్యాపారాలతో చేయూతనిచ్చింది..

బాగా చదివి... అయిదంకెల జీతమిచ్చే కొలువును సాధించింది. కానీ నైపుణ్యాలెన్ని ఉన్నా.. ఆర్థిక చేయూత లేక వెనుకబాటులోనే మగ్గిపోతున్న గ్రామీణ మహిళలను చూసిన ఆమె, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది. తన పథాన్ని మార్చుకుంది.

Published : 28 Oct 2022 00:33 IST

బాగా చదివి... అయిదంకెల జీతమిచ్చే కొలువును సాధించింది. కానీ నైపుణ్యాలెన్ని ఉన్నా.. ఆర్థిక చేయూత లేక వెనుకబాటులోనే మగ్గిపోతున్న గ్రామీణ మహిళలను చూసిన ఆమె, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది. తన పథాన్ని మార్చుకుంది. ఆవిడ చేయూతతో ఇప్పుడు వెయ్యిమందికిపైగా మహిళలు వ్యాపార మార్గంలో రాణిస్తున్నారు. మంజరి శర్మ స్ఫూర్తి కథనమిది.

ఐఐఎంలో చదివేటప్పుడు ప్రాజెక్టులో భాగంగా 2016లో బిహార్‌ ప్రభుత్వంతో కలిసి మంజరి మహిళా సాధికారతకు సంబంధించి పని చేసింది. ఇందు కోసం బెగుసారై, ఖగారియా, పాట్నా జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు వెళ్లేది. అక్కడి మహిళలను కలుసుకునేది. వారి సాధికారతపై చర్చలు, అధ్యయనాలు జరిపేది. అప్పుడే స్థానిక మహిళల్లో చాలా నైపుణ్యాలున్నట్లు గుర్తించింది. ఇంటి పనులు, వ్యవసాయంతోపాటు పచ్చళ్లు, అప్పడాలు వంటివెన్నో చాలా రుచిగా తయారు చేసే వారిని చూసి ఆశ్చర్యపోయేది. స్వయం సహాయక బృందాలుగా ఉన్నా వారికి సరైన ఆర్థిక చేయూత లేదు. అదే వారు అభివృద్ధి సాధించలేకపోవడానికి కారణమని అర్థమైంది. ప్రాజెక్టు పూర్తయ్యాక ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగిగా చేరింది మంజరి.

ఆలోచనతో..

ఉద్యోగంలో భాగంగా దేశమంతా పర్యటించేది మంజరి. ఎక్కడకు వెళ్లినా స్వయం సహాయక బృందాల కార్యకలాపాలను పరిశీలించేది. అన్ని చోట్లా అదే సమస్య. అందుకే గ్రామీణ మహిళలకు తనే సాధికారత కల్పించాలనుకున్నా అంటుంది మంజరి. ‘ఆ ఆలోచన వచ్చాక ఉద్యోగానికి రాజీనామా చేశా. కొల్హాపుర్‌, సతారా, ఔరంగాబాద్‌, పుణె, అమరావతిలోని స్వయం సహాయక బృందాలను కలిశా. వారికి ఆహార భద్రత, రసాయనాల రహిత, పోషక విలువలున్న ఆహార పదార్థాల తయారీ గురించి వివరించా. ఆ ఉత్పత్తుల విక్రయ విధానాలనూ నేర్పించా. మార్కెటింగ్‌ మెలకువలపై శిక్షణ ఇచ్చా. వారందరికీ ఆర్థిక చేయూత కోసం ‘ఫార్మ్‌ దీదీ’ పేరుతో 2019లో ఫుడ్‌టెక్‌ స్టార్టప్‌ ప్రారంభించా. దీదీ బిజినెస్‌ యాప్‌లో వారి ఉత్పత్తులను పొందుపరిచి, వినియోగదారులకు నేరుగా విక్రయించుకునేలా చేశా. మహిళలందరూ వారికి తెలిసిన పచ్చళ్లు, చట్నీలు, చిరుధాన్యాలతో అప్పడాల వంటి ఉత్పత్తులను చేసి అమ్ముకోగలుగుతున్నారు. వీరికి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులనూ అనుసంధానం చేశాను. ‘ఫార్మ్‌ దీదీ’ ద్వారా స్థానిక ఎన్జీవోలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేసి, అవసరమైన ఆలోచనలు అందించేలా ఏర్పాటు చేశాం. దీంతో నా పరిధి 80 గ్రామాలకు విస్తరించింది. ఇప్పుడు వీళ్లు ఆహార ఉత్పత్తులు సహా ప్రమిదలు, రాఖీలు, పండుగ గిఫ్ట్‌బాక్సులు వంటి 20 రకాలకుపైగా ఉత్పత్తులను చేస్తున్నారు. ప్రస్తుతం 40 గ్రామాలకు చెందిన 108 స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న వేల మంది మహిళలు ఈ సంస్థ ద్వారా ఆర్థిక స్వాలంబన పొందారు. లక్షమందిని గ్రామీణులను వ్యాపార మార్గాన నడిపించాలనేదే లక్ష్యం’ అంటోంది మంజరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్