ఆయన్ని నా ఛానెల్లో చూసి గుర్తుపట్టారట!

వంట.. రుచితోపాటు ఆరోగ్యాన్నీ పంచితే... ఎంత బాగుంటుందో! ఈ ఫార్ములానే ఆవిడకు తారక మంత్రమైంది. బరువు తగ్గాలనుకునే ఇల్లాళ్లకీ, తిండి తిననని మరాం చేసే చిన్నారులకీ, ఆరోగ్యంపై శ్రద్ధ చూపే పెద్దలకీ ‘ఇస్మార్ట్‌ గౌతమి’గా దగ్గరయ్యేలా చేసింది.

Updated : 22 Nov 2022 14:19 IST

వంట.. రుచితోపాటు ఆరోగ్యాన్నీ పంచితే... ఎంత బాగుంటుందో! ఈ ఫార్ములానే ఆవిడకు తారక మంత్రమైంది. బరువు తగ్గాలనుకునే ఇల్లాళ్లకీ, తిండి తిననని మరాం చేసే చిన్నారులకీ, ఆరోగ్యంపై శ్రద్ధ చూపే పెద్దలకీ ‘ఇస్మార్ట్‌ గౌతమి’గా దగ్గరయ్యేలా చేసింది. ఆ వివరాలన్నీ ఆ యూట్యూబర్‌  తాళ్లూరు గౌతమి మాటల్లోనే...

జీవితం ఎప్పుడూ మనం కోరుకున్నట్లు ఉండదు... అలాగని నిరాశపడకూడదు. పరిస్థితుల్ని బట్టి కొత్త లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. నేనదే చేశా. మాది గుంటూరు జిల్లా వడ్లమూడి దగ్గర శలపాడు. రైతు కుటుంబం. అమ్మానాన్నలకు ఒక్కదాన్నే. చదువూ, ఆటపాటలూ.. అన్నిట్లో ముందే. సెలవులొస్తే డ్యాన్స్‌, సంగీతం, పెయింటింగ్‌... ఇలా క్షణం తీరిక లేకుండా గడిపేదాన్ని. ఎమ్మెస్సీ, ఎంటెక్‌ చేసి, దిల్లీలో ఉద్యోగమూ చేశా. బయోటెక్నాలజీ శాస్త్రవేత్తని కావాలన్నది నా కల. కానీ మంచి సంబంధమని పెళ్లికి ఒప్పించారు. మావారి వ్యాపారంతో విజయవాడలోనే ఉండాల్సొచ్చింది. నా చదువుకి తగ్గ ఉద్యోగాలేవీ కనిపించలేదు. జీవితం సంతోషంగానే సాగిపోతున్నా... ఇంకేదో చేయాలనే తపన. ఇద్దరు పిల్లలు. బాబుకి ఆరు నెలలున్నప్పుడు ఓ రోజు యూట్యూబ్‌లో వంటల ఛానెలొకటి చూశా. నాకూ ప్రయత్నించాలని అనిపించింది. మర్నాడే ఛానెల్‌ పెట్టేశా. మా వారికి చెబితే నీకు నచ్చింది చెయ్యమని వెన్నుతట్టారు. అప్పటికి వీడియో తీయడం, అప్‌లోడ్‌ చేయడాలేమీ తెలియదు. టెక్‌ ఛానెల్స్‌ చూసి నేర్చుకున్నా. మొదట్లో పదీ ఇరవై వ్యూస్‌ మాత్రమే వచ్చేవి. రెండు నెలలయ్యే సరికి వందలకు చేరుకున్నాయి. అప్పట్లో ఓ వీడియోకి 600 వ్యూస్‌ వస్తే తెగ థ్రిల్‌ అయిపోయా.


ఇరవై కిలోలు తగ్గా...

వంటలూ, తోటపనీ.. తోచినవన్నీ చేసే దాన్ని. ఈలోగా కరోనా రావడంతో లక్షల్లో కొత్త ఛానెల్స్‌ వచ్చాయి. వాటిల్లోనూ వంటలవే ఎక్కువ. అప్పుడే అనిపించింది. భిన్నంగా చేస్తే కానీ జనాన్ని చేరుకోలేమని. అప్పటికే పిల్లలు పుట్టాక బరువు పెరిగిన నేను... పోషకారాన్ని తీసుకుంటూ సుమారు ఇరవై కిలోల వరకూ తగ్గగలిగా. అది చూసి అందరూ ‘ఎలా తగ్గా’వని అడిగే వారు. ఈ విషయాన్నే కొత్తగా తల్లులైన వారందరికీ చెప్పాలనుకున్నా. బయోటెక్నాలజీ విద్యార్థిని కదా! పోషకాలూ, పదార్థాలూ... వంటి వాటిపై అవగాహన, ఆరోగ్య స్పృహ ఉండటంతో హెల్త్‌-ఫుడ్‌-డైట్‌ వీడియోలు ప్రారంభించా. ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌’ వీడియో వైరలైంది. అప్పట్నుంచి ఫాలోయర్లూ పెరిగారు. ఏడాదికే లక్షమందిని చేరుకోగలిగా. ఇప్పుడు 5 లక్షలు దాటారు.


అర్జంటుగా మాట్లాడాలంది...

ఓసారి ఓ అమ్మాయి నా ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ‘అర్జంట్‌గా మాట్లాడాలి’ అని మెసేజ్‌లు పెడుతోంది. ఎందుకంటేే... ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మీతో మాట్లాడతారట అంది. ఆధారాలు చూసి నిర్ధరించుకున్నా. ఆయన నా ప్రతి వీడియో చూస్తానని చెప్పినపుడు ఎంతో సంతోషమేసింది. హైదరాబాద్‌ వచ్చి ఆయన్ని కలిసి ఓ వీడియో తీసి అప్‌లోడ్‌ చేశా. తర్వాతోసారి ఆయన చేపలు కొనడానికి వెళ్తే... అమ్మే ఆవిడ ‘సార్‌ మిమ్మల్ని ఇస్మార్ట్‌ గౌతమి ఛానెల్‌లో చూశా’ అందట. ‘ఇంత పెద్ద దర్శకుడినీ నన్ను నీ ఛానెల్‌లో చూసి గుర్తు పట్టిందమ్మా’ అంటూ ఎంత నవ్వారో!


పిల్లల్ని చూసుకుంటూనే...

ప్రతి విషయాన్నీ నిర్ధరించుకుని, నోట్స్‌ సిద్ధం చేసుకున్నాకే వీడియో చేస్తా. పిల్లలు, ఇంటి పనులు, ఇదీ కష్టమే కానీ.. ప్రతిదానికీ నిర్దిష్ట సమయం కేటాయించుకున్నా. 750కి పైగా వీడియోలు చేశా. నా మొదటి సంపాదన రూ.45 వేలు. నెలలో అత్యధికంగా అందుకుంది రూ.3 లక్షలు. ప్రస్తుతం అమ్మ సాయంతో హోంఫుడ్స్‌ చేసి, మార్కెటింగ్‌ చేస్తున్నా. పిల్లల పెంపకంలో అత్తయ్య, ప్యాకింగ్‌లో మావారి తోడ్పాటు లేకుంటే ఇక్కడిదాకా రాగలిగేదాన్ని కాదు.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్