ఈమె..ఐరన్‌మాన్‌

30... దాటితే చురుకు తగ్గుతుంది. 40... దాటితే.. పరుగు పెట్టడానికి సిగ్గుపడతాం. ఇక 50... దాటితే కూర్చున్న చోటు నుంచి లేవడానిక్కూడా ఆలోచిస్తాం.

Published : 30 Oct 2022 00:34 IST

30... దాటితే చురుకు తగ్గుతుంది. 40... దాటితే.. పరుగు పెట్టడానికి సిగ్గుపడతాం. ఇక 50... దాటితే కూర్చున్న చోటు నుంచి లేవడానిక్కూడా ఆలోచిస్తాం. కానీ సూరత్‌కి చెందిన డాక్టర్‌ మీనా 54 ఏళ్ల వయసులో... అత్యంత కష్టమైన ఐరన్‌మాన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ రేసులో విజయపతాకాన్ని ఎగరేసి... నడి వయసు వారికి స్ఫూర్తిగా నిలిచారు...

సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో.. కాల్చేస్తున్న వేడిగాలుల మధ్య, పాములా మెలికలు తిరుగుతున్న కొండచరియల అంచుల్లో సాగిన రేసులో యాక్సిడెంట్‌ బారినపడి కూడా అనుకున్న సమయానికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకున్నారు డాక్టర్‌ మీనా వంకావాలా. ఐరన్‌మాన్‌రేసు... ఇది అత్యంత సంక్లిష్టమైన పోటీల్లో ఒకటి. 3.5 కిలోమీటర్లు ఈత, తర్వాత.. 180 కి.మీలు సైకిల్‌ రేసు. అదయ్యాక.. 42 కి.మీలు పరుగు. ఇదంతా పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ రేసులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో పోటీపడినా, కనీసం పాల్గొనే అర్హత కూడా సాధించలేక వెనుతిరిగే వాళ్లే ఎక్కువ. అర్హత సాధించినా, సైకిల్‌ రేసు పూర్తయ్యేలోపే చాలా మంది  చేతులెత్తేస్తారు. ఇటీవలే ఈ రేసు అమెరికాలోని హవాయి ద్వీపంలో జరిగింది. ఇందులో పాల్గొన్న ఏకైక భారతీయ మహిళ మీనా. గైనకాలజిస్టుగా పనిచేస్తున్న ఆమె గంట ముందే లక్ష్యాన్ని చేరుకున్నారు. ‘సముద్రమట్టం నుంచి ఎత్తుగా ఉండటం వల్ల వేడిగాలులు, ఉక్కబోత. ఒక కొండ మెలిక దగ్గర.. సైకిల్‌ తిరగబడి గాయపడ్డా. కాసేపటికి కోలుకున్నా. కానీ సీనియర్‌ డాక్టర్‌ వచ్చి చూసే వరకూ వీలుకాదని నిర్వాహకులు వారించారు. దాంతో గంటన్నర ఆగిపోవాల్సి వచ్చింది. ఇక నేను ఇంటికే అనుకున్నా. అయినా ప్రయత్నించా. ఆశ్చర్యంగా నాకిచ్చిన సమయం కంటే ముందే చేరుకుని విజేతనయ్యా. 22 హాఫ్‌ మారథానుల్లో పాల్గొన్న అనుభవం, రోజువారీ వ్యాయామం నాకిక్కడ ఎంతో ఉపకరించాయి. ఇబ్బందులే లేవా అంటే ఉన్నాయి. పోటీ తర్వాత విపరీతమైన తలనొప్పి వేధించింది. కారణం.. రేసులో శక్తికోసం కెఫిన్‌ ఉన్న పానీయాలు ఇస్తారు. నాకవి అలవాటు లేవు కాబట్టి ఈ ఇబ్బంది. ఇప్పుడు నా మనవలకు చెప్పుకోవడానికి ఓ పెద్ద విజయం ఉంది. అది చాలు.’ అంటూ నవ్వేశారు డాక్టర్‌ మీనా.


నేనే కాదు, పట్టుదల, మానసిక స్థైర్యం, ఆరోగ్యం పట్ల స్పృహ ఉంటే వయసులకు అతీతంగా మీరూ సాధించగలరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్