పోలీస్‌ అక్క... తప్పు చేస్తే తాట తీస్తుంది!

అబ్బాయిలు పెట్టే వేధింపులని పంటిబిగువున భరిస్తారే కానీ.. ధైర్యం చేసి పోలీస్‌స్టేషన్‌ గడపతొక్కడానికి వెనకాడతారు అమ్మాయిలు. ‘అమ్మాయిలు ఇక్కడకు రాకపోతే... మనమే కాలేజీలకు వెళ్దాం. ఆకతాయిల పనిపడదాం. ఒక అక్కలా వాళ్లకు అండగా ఉందాం’ అనుకున్నారు కోయంబత్తూరు మహిళా పోలీసులు.

Updated : 02 Nov 2022 08:25 IST

అబ్బాయిలు పెట్టే వేధింపులని పంటిబిగువున భరిస్తారే కానీ.. ధైర్యం చేసి పోలీస్‌స్టేషన్‌ గడపతొక్కడానికి వెనకాడతారు అమ్మాయిలు. ‘అమ్మాయిలు ఇక్కడకు రాకపోతే... మనమే కాలేజీలకు వెళ్దాం. ఆకతాయిల పనిపడదాం. ఒక అక్కలా వాళ్లకు అండగా ఉందాం’ అనుకున్నారు కోయంబత్తూరు మహిళా పోలీసులు. అక్కడి అమ్మాయిలకు ‘పోలీస్‌ అక్క’ ఎలాంటి ధైర్యాన్నిస్తోందో తెలుసుకోవాలంటే చదివేయండి మరి..

ఆడపిల్ల భద్రత కన్నా... పరువు, ప్రతిష్ఠ వీటి గురించి ఆలోచించే వారే ఎక్కువ. అందుకే తమ ఇంటి ఆడపిల్లని ఎవరైనా ఏడిపించినా, అఘాయిత్యానికి పాల్పడినా బయటికి చెప్పుకోలేని పరిస్థితి చాలామందిది. దీంతో చాలామంది ఆడపిల్లలు కష్టాన్ని మనసులోనే దాచుకుని కుమిలిపోతున్నారు. ఈ బాధ శృతిమించి ఏ అఘాయిత్యమో చేసుకున్నప్పుడే ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. ఈ పరిస్థితులు కోయంబత్తూరులోనూ ఉండటంతో అక్కడి పోలీసులు ‘పోలీస్‌ అక్క’ పేరుతో వినూత్న ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. ‘మీ కుటుంబంలో మేమూ ఒకరం’ అంటూ భరోసా ఇస్తున్నారు.

ఒక్కో కాలేజీకి.. ఒక్కో అధికారిణి

కోయంబత్తూరులో 61 కళాశాలలున్నాయి. వాటిల్లో వేలమంది ఆడపిల్లలు చదువుతున్నారు. కోయంబత్తూరు కమిషనరేట్‌ పరిధిలోని 37మంది చురుకైన మహిళా అధికారులు పోలీస్‌ అక్కలుగా మారి ఒక్కొక్కరు ఒక్కో కాలేజీ బాధ్యత తీసుకున్నారు. ప్రతి అమ్మాయి దగ్గర వీళ్ల ఫోన్‌నెంబరు, వాట్సాప్‌, మెయిల్‌ వివరాలు ఉంటాయి. అలాగే ఫోన్లలో అత్యవసరంలో ఆదుకొనేందుకు వీలుగా ఎస్‌వోఎస్‌తో ఉన్న ఓ యాప్‌ను కూడా ఇన్‌స్టాల్‌ చేశారు. పోలీస్‌ అక్కలు... ప్రతీ వారం కాలేజీలకి వెళ్లి అక్కడి విద్యార్థినులతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడతారు. 24గంటలూ ఫోన్లలో అందుబాటులో ఉంటారు. ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

శిక్ష వేయడం ఉద్దేశం కాదు...

‘ఈ మధ్య ఓ అమ్మాయి ఫోన్‌ చేసింది. తను ప్రేమించిన అబ్బాయే వేధిస్తున్నాడని.. అతనితో తనకి ముప్పుందన్నది ఆ కాల్‌ సారాంశం. ప్రస్తుతం అతనికి సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నాం, త్వరలోనే మారతాడు. సోషల్‌ మీడియాలో అబ్బాయిల వేధింపులు, ఫొటోల్ని మార్ఫింగ్‌ చేసి బెదిరించడం, ప్రేమ పేరుతో వెంటపడటం.. ఇటువంటి  ఫిర్యాదులే ఎక్కువగా అమ్మాయిల నుంచి అందుతున్నాయి. కౌన్సెలింగ్‌ తర్వాత కూడా అబ్బాయిలపై నిఘా ఉంటుంది. వీలైనంతవరకూ కేసులు, శిక్షల వరకూ వెళ్లకూడదనే చూస్తాం. యువత చక్కగా చదువుకుని లక్ష్యాలని చేరుకోవాలన్నదే మా ఉద్దేశం. అమ్మాయిల వివరాలు గోప్యంగా ఉంచుతాం కాబట్టి వాళ్లు నిర్భయంగా తమ ఇబ్బందులు చెప్పగలుగుతున్నారు’ అని అంటున్నారు అధికారుల్లో ఒకరైన ఇన్‌స్పెక్టర్‌ మీనాంబిగ.

వాళ్లు కుమిలిపోకుండా..

వేధింపులకు గురైన ఆడపిల్లలు కుమిలిపోకుండా తమ జీవితాల్లో మార్పు తెచ్చుకోగలగడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం అంటున్నారు అధికారులు. ‘ఆడపిల్లలతో మాట్లాడినప్పుడు ఎన్నో మానసిక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. వాళ్లని అలాగే వదిలేస్తే చదువుల్లో విఫలమవుతారు, ఆ స్థితినుంచి బయటపడేలా చేస్తున్నాం. ప్రాజెక్టు మొదలై కొద్దిరోజులే అయినా మంచి ఫలితాలొస్తున్నాయి. ఆడపిల్లలకు కౌన్సెలింగ్‌ చేస్తున్నప్పుడు కుటుంబంలో నెలకొన్న సమస్యలూ బయటికొస్తున్నాయి. దీంతో వారి తల్లిదండ్రుల్నీ  పిలుస్తున్నాం. సోషల్‌ మీడియాతో ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండేలా చూస్తున్నాం. అబ్బాయిల్లో కొందరు డ్రగ్స్‌కి కూడా బానిసలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ కోణంలో కూడా దర్యాప్తులు చేస్తున్నాం.’ అంటున్నారు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్‌.సుహాసిని. ఇంత భరోసా దొరకడం వల్లనే ఇప్పుడు కోయంబత్తూరులో ఏ కాలేజీలో చూసినా.. ‘పోలీస్‌ అక్క’ ఫోన్‌నెంబర్లు, పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ సైన్యమే ఇప్పుడక్కడి ఆడపిల్లలకు ధైర్యంగా మారింది.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్