ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి! లుక్మా కిచెన్‌!

వితంతువు ఒకరు... గృహ హింస బాధితురాలు ఇంకొకరు.... పేదరికం, అనారోగ్యంతో మంచాన పడ్డ కుటుంబ సభ్యుల కోసం మరొకరు... ఉపాధి కోసం అగచాట్లు పడుతుంటే ఆదుకున్నారావిడ... ఇలా వేలమంది అభాగ్య మహిళలకు శిక్షణ ఇచ్చి...

Updated : 03 Nov 2022 07:12 IST

వితంతువు ఒకరు... గృహ హింస బాధితురాలు ఇంకొకరు.... పేదరికం, అనారోగ్యంతో మంచాన పడ్డ కుటుంబ సభ్యుల కోసం మరొకరు... ఉపాధి కోసం అగచాట్లు పడుతుంటే ఆదుకున్నారావిడ... ఇలా వేలమంది అభాగ్య మహిళలకు శిక్షణ ఇచ్చి... ఆదాయ మార్గాలు చూపి వారి కుటుంబాలను నిలబెడుతున్నారు హైదరాబాద్‌కి చెందిన రుబీనా. ఆ వివరాలను వసుంధరతో పంచుకున్నారు...!

రుబీనా తండ్రి మిలిటరీ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో పెరిగారామె. పేద మహిళల కోసం ఏదైనా చేయాలని చదువుకునే రోజుల్లోనే నిర్ణయించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో పీజీ చేశాక టూరిజం అండ్‌ ట్రావెలింగ్‌, సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లపై పనిచేశారు. తొమ్మిదేళ్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖలో పని చేశారు. అవేవీ సంతృప్తినివ్వలేదు. ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఇక్కడే శిక్షణ, ఉపాధి సంస్థని ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మైనార్టీ మహిళల స్థితిగతులపై అధ్యయనం కోసం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరిగారు. ఆవిడ కుటుంబ సభ్యులతో సహా చాలా మంది వ్యతిరేకించినా మహిళా సాధికారతే లక్ష్యంగా ‘సఫా’ సంస్థని ప్రారంభించారు. ఆ పేరుకి అర్థం... స్వచ్ఛత, స్థైర్యం.

ఇబ్బందులెన్నో దాటి...

కట్టుబాట్లూ, సంప్రదాయాలూ, రకరకాల ఆంక్షలూ మొదట మహిళల్ని గడప దాటనివ్వలేదు. కొందరు మగవాళ్లు వచ్చి... మా ఆడవాళ్లని చెడగొడుతున్నారంటూ గొడవకి దిగేవారు. వారిని ఒప్పించడానికి నానా కష్టాలూ పడ్డారామె. శిక్షణ కోసం కొన్ని నెలలు ఒకరిద్దరే వచ్చేవారు. వారిలో ఒకరిగా కలిసి పోవడానికి బోలానగర్‌లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కుట్టుపని, ఎంబ్రాయిడరీ, జూట్‌బ్యాగులు, స్క్రీన్‌ ప్రింటింగ్‌, శానిటరీ ప్యాడ్ల తయారీ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధికీ తోడ్పడే వారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న వారిని చూసి మిగిలిన వాళ్లూ రావడం మొదలుపెట్టారు. 140 మందికి పైగా అనాథ, ఆసరా కోల్పోయిన చిన్నారులను ఉచితంగా చదివిస్తున్నారు. పేద పిల్లలకు ఉచిత ట్యూషన్లు, కెరియర్‌ గైడెన్స్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అందించి ఉపాధి కల్పిస్తున్నారు.

అందరూ యజమానులే..

కాలానుగుణంగా కొత్త ఆలోచనలూ చేయాలనుకున్నారు రుబీనా. సఫా సెంటర్‌కి వచ్చే కొందరు వంటలు అద్భుతంగా చేస్తారని తెలిసింది. ఆ సమయంలోనే కేరళలోని కుటుంబశ్రీ కమ్యూనిటీ కిచెన్‌ రుబీనాను ఆకట్టుకుంది. అచ్చం అలానే... ఒంటరి స్త్రీలతో క్లౌడ్‌ కిచెన్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు. మొదట 15 మందిని ఎంచుకుని స్టార్‌ చెఫ్‌లతో వంటలో మెలకువలతో పాటు కిచెన్‌ నిర్వహణ, శుభ్రత, ప్యాకింగ్‌ వంటి విషయాలపై శిక్షణ ఇప్పించారు. వారితో ఏర్పాటు చేసిందే ‘లుక్మా కిచెన్‌’.  దీన్ని మొదట బహదూర్‌ పురాలో ఏర్పాటు చేయగా... ఇప్పుడు మరో ఆరు చోట్లకు విస్తరించాయి. అలానే మౌలానా ఆజాద్‌ యూనివర్సిటీలో లుక్మా కెఫెటేరియా కూడా ఏర్పాటైంది. వంట చేయడం, ఆర్డర్లు తీసుకోవడం, డోర్‌ డెలివరీ చేయడం వరకూ అన్నీ వీళ్లే చేస్తారు. మహిళలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకునేందుకు ‘లుక్మా స్టూడియోని’ ఏర్పాటు చేశారు. మొదట్లో రుబీనా సొంత డబ్బులూ, స్నేహితుల సాయంతో సఫా సంస్థను నడిపారు. ఆవిడ చిత్తశుద్ధి, సంస్థ సేవల ఫలితాలను చూసిన తర్వాత టాటా, అపోలో, హెచ్‌ఎస్‌బీసీ, అమెజాన్‌, మహీంద్రా బ్యాంక్‌ వంటి సంస్థలు అండగా నిలుస్తున్నాయి.వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోన్న సఫా సంస్థలో 75మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

- కాసాల ప్రశాంత్‌ గౌడ్‌, హైదరాబాద్‌


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్