ఆ స్ఫూర్తికి.. లక్షల మంది ఫిదా!

కెరియర్‌ని చూసుకుంటూనే కుటుంబ బాధ్యతల్నీ సమర్థంగా నిర్వహించే మహిళలెందరో! అలాంటి అమ్మే ఈ నందిని. అయితే ఈమె కథ తన సంస్థ అధిపతితోపాటు లక్షలమంది నెటిజన్లనీ మెప్పించింది.

Published : 03 Nov 2022 00:34 IST

కెరియర్‌ని చూసుకుంటూనే కుటుంబ బాధ్యతల్నీ సమర్థంగా నిర్వహించే మహిళలెందరో! అలాంటి అమ్మే ఈ నందిని. అయితే ఈమె కథ తన సంస్థ అధిపతితోపాటు లక్షలమంది నెటిజన్లనీ మెప్పించింది. అంతగా ఏముందామె జీవితంలో.. చదివేయండి.

ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి సాధించాలనే కల ఉంటుంది. దానిలో వైఫల్యం ఎదురైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? తిరిగి పుంజుకోవడానికి చాలా కాలం పడుతుంది. కొందరైతే తిరిగి ఆ మార్గంలో ప్రయాణించడానికే వెనకాడతారు. కానీ బెంగళూరుకు చెందిన నందిని మూడో రకం. ‘ఓడిపోతేనేం? తిరిగి ప్రయత్నిస్తే సరి’ అనేది తన తీరు. నందినికి వ్యాపారవేత్త అవ్వాలని కల. తను కూడబెట్టిన డబ్బులతో ఫుడ్‌ ట్రక్‌ ప్రారంభించింది. కల నెరవేరుతోందనుకున్న తరుణంలో కొవిడ్‌ వచ్చింది. నష్టాల రూపంలో ఆమె ఆశలపై నీళ్లు జల్లింది. దీంతో ఫుడ్‌ ట్రక్‌ మూసేయక తప్పలేదు. ఇలా అయ్యిందేం అని చింతిస్తూ కూర్చోలేదు తను. పెట్టుబడికి కావాల్సిన మొత్తాన్ని తిరిగి సంపాదించుకోవాలనుకుంది. ‘ఉబర్‌’లో డ్రైవర్‌గా చేరింది. రోజూ 12 గంటలు పనిచేస్తుంది. ఇటీవల తన కూతురి పాఠశాలకు సెలవులొచ్చాయి. అమ్మగా తన బాధ్యతల్నీ చూసుకోవాలిగా! దీంతో తననీ వెంటబెట్టుకొని డ్రైవింగ్‌ చేయడం మొదలుపెట్టింది. ఇటీవల ఒక వినియోగదారుడిని ఎక్కించుకోవడానికి నందిని వెళ్లింది. ‘మహిళా డ్రైవర్‌’ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. డ్రైవర్‌ పక్క సీటులో నిద్ర పోతున్న పాపని చూశాక ఆయనకి కుతూహలం పెరిగింది. దీంతో తన వివరాలను అడిగాడట. అప్పుడు నందిని తన కథంతా చెప్పుకొచ్చింది. ‘ప్రస్తుతం 12 గంటలు చేస్తున్నా. వచ్చిన మొత్తాన్ని కూడబెట్టి మళ్లీ వ్యాపారం మొదలుపెట్టాలి. నేను నష్టపోయింది తిరిగి సాధిస్తా’ అన్న ఆమె మాటలు ఆయనలో స్ఫూర్తిని నింపాయి. ఒకవైపు లక్ష్యాన్ని ఛేదిస్తూనే అమ్మగా తన బాధ్యతల్నీ నిర్వహిస్తోన్న ఆమె కథను అందరితోనూ పంచుకోవాలనుకున్నాడు. ఈ అనుభవాన్నంతా తన లింక్‌డిన్‌ ఖాతాలో రాస్తే రెండున్నర లక్షల లైకులు, రీషేర్‌లొచ్చాయి. మిమ్మల్ని చూసి స్ఫూర్తి చెందాం, నిరాశలో ఉన్న మాకు ఓ దారి చూపారంటూ కామెంట్లూ వచ్చాయి. భారత్‌లో ఉబర్‌ హెడ్‌ ప్రభ్‌జీత్‌ సింగ్‌ ఆమెకు తగిన సాయమందిస్తానన్నారు. ఇంకెంతోమంది సాయానికి ముందుకొస్తున్నారు. ఈ స్పందన చూసిన నందిని మాత్రం సంతోషిస్తూనే.. తన కలను నెరవేర్చుకోవడానికి మరింత కష్టపడతానంటోంది. మరి.. తన కథ మీకెలా అనిపించింది?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్