‘నేను మంచి అమ్మాయిని కాదు’

భారత సంతతి వ్యక్తులు గ్లోబల్‌ సీఈఓ అవ్వడం మనకు కొత్తేం కాదు. ఆ స్థాయికి ఓ మహిళ చేరడం అరుదే! అక్కడిదాకా రావడానికి ‘ఆమె’ ఎన్నో అడ్డంకులు దాటాలి మరి! చిన్నతనం నుంచే ఎన్నో అవరోధాల్ని దాటుతూ వచ్చారు దేవిక.

Updated : 04 Nov 2022 15:46 IST

భారత సంతతి వ్యక్తులు గ్లోబల్‌ సీఈఓ అవ్వడం మనకు కొత్తేం కాదు. ఆ స్థాయికి ఓ మహిళ చేరడం అరుదే! అక్కడిదాకా రావడానికి ‘ఆమె’ ఎన్నో అడ్డంకులు దాటాలి మరి! చిన్నతనం నుంచే ఎన్నో అవరోధాల్ని దాటుతూ వచ్చారు దేవిక. ‘అమ్మాయినే.. అయితేనేం’ అన్న ఆవిడ తీరే ప్రఖ్యాత అడ్వర్టైజింగ్‌, మార్కెటింగ్‌ సంస్థ ‘ఓగిల్వీ’ అంతర్జాతీయ పగ్గాలు అందుకొనే స్థాయికి తీసుకెళ్లింది. ఆవిడ స్ఫూర్తి ప్రయాణమిదీ...

‘న్యూయార్క్‌ వీధుల్లో నడుస్తున్నప్పుడు ఓ అమ్మాయి వచ్చి ‘మీరు దేవిక కదా’ అనడిగింది. అవునంటే ‘భారతీయ అమ్మాయిలందరి తరఫునా చెబుతున్నా మీరు మాకు స్ఫూర్తి’ అంది. ఇంకొకరు ‘మా అమ్మానాన్న... చూడు మనమ్మాయి అంతర్జాతీయ సంస్థకు సీఈఓ అయ్యిందని గర్వపడుతుంటార’ంది. నా స్థానం ఎంత ప్రభావవంతమైందో అప్పుడే అర్థమైంది. కానీ నా పోరాటం అయిదేళ్ల వయసులోనే ప్రారంభమైంది. ‘అబ్బాయిలేదైనా చేయొచ్చు. అమ్మాయిలు మాత్రం బుద్ధిగా ఉండాల’నే ఉమ్మడి కుటుంబం నుంచొచ్చా. మాది పంజాబ్‌. అమ్మాయి అయితే.. సంకెళ్లు వేసుకొని ఉండాలా? అలాగైతే నేను ‘మంచి పిల్ల’ కాకూడదని తీర్మానించుకున్నా. ఎవరెన్ని చెప్పినా నాకు నచ్చిందే చేస్తూ వచ్చా’ అని నవ్వేస్తారు దేవిక.

అనుకోకుండా..

ముంబయిలో ఇంగ్లిష్‌, సైకాలజీల్లో డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలో కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చదివారావిడ. వ్యాపారి అశ్విన్‌ బుల్చందానీని పెళ్లాడి అమెరికాలో స్థిరపడ్డారు. 1993లో ఓ ఫొటోకాపీ సెంటర్‌లో ఉద్యోగంలో చేరినప్పుడు అడ్వర్టైజింగ్‌పై ఆసక్తి కలిగింది. ఓ సంస్థలో ప్లానర్‌గా చేరారు. రెండేళ్లు చేశాక మెక్‌కాన్‌కి మారారు. 26 ఏళ్లు అక్కడే... ఎన్నో హోదాల్నీ అందుకున్నారు. వ్యాపార ప్రకటన ఆ ఉత్పత్తి గురించి చెప్పడమే కాక మనసుల్ని హత్తుకోవాలన్నది ఆమె నమ్మే సూత్రం. వాటిలో అమ్మాయిల బలమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేలానూ చూసుకుంటారు. ఎన్నో కొత్త పరిణామాలకీ నాంది పలికారు. మాస్టర్‌ కార్డ్‌ కోసం ‘ప్రైస్‌లెస్‌’, ట్రాన్స్‌జెండర్లకు మద్దతుగా ‘ట్రూనేమ్‌’, ఫియర్‌లెస్‌ గర్ల్‌ వంటి ఎన్నో కాంపెయిన్లు ఆమెకో గుర్తింపు తెచ్చాయి. ‘అడ్వర్టైజింగ్‌పై ఏమాత్రం అవగాహన లేదు. మొదట్లో ఏ ప్రకటనా అర్థమయ్యేది కాదు. అప్పుడే నా ఆలోచనలు భారతీయ సంప్రదాయంలోనే చిక్కుకొని ఉన్నాయని అర్థమైంది. ఇక్కడి ప్రజలు, సంస్కృతిని తెలుసుకొని, అదీ నా సొంతం అనుకున్నాకే అవగాహన వచ్చిం’దంటారు 53 ఏళ్ల దేవిక.

సవాళ్లున్నాయ్‌..!

‘ఆడవాళ్లం ఒంటి చేత్తో ఇల్లు, కెరియర్‌ రెండూ నిర్వహించగలం. కానీ చేయగలమా అన్న సంకోచమే వెనక్కి నెడుతుంది. సినిమా, ప్రకటనలు ఏవైనా అమ్మాయిల్ని అందం, ఇంటి పనులకే పరిమితం చేస్తాయి. వాటికి భిన్నంగా అమ్మాయిల బలాన్ని చూపించాలనుకునే దాన్ని. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌కి ముందు ‘బుల్‌’కి బదులు మార్కెట్‌ హెచ్చుతగ్గుల్ని గమనిస్తూ నిల్చున్న అమ్మాయిని ఉంచి ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’ క్యాంపెయిన్‌ నిర్వహించా. ఎలక్ట్రానిక్‌ స్మార్ట్‌ వాచ్‌ను పెట్టుకుని ఓ అమ్మాయి రాత్రి 2గం.లకు వీధుల్లో జాగింగ్‌ చేస్తున్నట్లుగా యాడ్‌ రూపొందించా. ఇంకా ఇలాంటి ప్రయోగాలెన్నో. ఎంత వ్యతిరేకతొచ్చిందో! తగ్గట్టే ప్రశంసలూ, అవార్డులూ. కాబట్టి, మనమెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామన్నదే ప్రధానం. చెప్పాగా నేనెప్పుడూ మంచి అమ్మాయిని అనిపించుకోవాలనుకోలేదు. చేసేదేదైనా సరే కొందరిలోనైనా మార్పు తెస్తే చాలని ధైర్యంగా ప్రయత్నిస్తా. మీరైనా అంతే. నిరూపించుకోవాలా.. నచ్చిన దారిలో ధైర్యంగా నడవండి. నేర్చుకోవడానికి వెనకాడొద్దు. 18 నెలల్లోనే ఓగిల్వీ గ్లోబల్‌ సీఈఓ అవ్వడానికీ అదే కారణం. నేర్చుకునే కొద్దీ హోదా, దాంతోపాటు బాధ్యతా పెరుగుతాయి. ఇప్పుడు 80 దేశాల్లోని 131 ఆఫీసులకు అధిపతిని. నేర్చుకోవాల్సిన సంస్కృతులు పెరిగాయి. ఇప్పుడా పనిలోనే ఉన్నా’నని చెబుతున్నారు దేవిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్