ఆ రిస్క్‌ వందల మందికి ఉపాధి!

జీవితంలో ఏదైనా సాధించాలంటే రిస్క్‌ తప్పనిసరి! ఆ అమ్మాయిని చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. వ్యాపారం కోసమని విదేశీ ఉద్యోగాన్ని వదిలేసింది. ఇలా చెబితే ఫర్లేదులే అనిపించొచ్చేమో! చేతివృత్తుల కోసం ఇలా చేసిందంటే.. అదీ ఎనిమిదేళ్ల క్రితం.

Published : 06 Nov 2022 00:53 IST

జీవితంలో ఏదైనా సాధించాలంటే రిస్క్‌ తప్పనిసరి! ఆ అమ్మాయిని చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. వ్యాపారం కోసమని విదేశీ ఉద్యోగాన్ని వదిలేసింది. ఇలా చెబితే ఫర్లేదులే అనిపించొచ్చేమో! చేతివృత్తుల కోసం ఇలా చేసిందంటే.. అదీ ఎనిమిదేళ్ల క్రితం. పెద్ద రిస్క్‌ అనిపిస్తోంది కదూ! ఇంతకీ ఇది తనని ఎక్కడివరకూ తీసుకెళ్లింది.. చదివేయండి.

ఉద్యోగం.. ఏమాత్రం ఖాళీ దొరికినా పర్యటనలు.. ఇవే డేసీ తన్వానీ లోకం. మాస్‌ మీడియాలో డిగ్రీ చదివింది. విదేశాల్లో పదేళ్లు వివిధ విభాగాల్లో పని చేసింది. ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతానికి గుర్తుగా ఏదోకటి కొనుక్కొచ్చేది. ఓసారి స్నేహితులతో సరదా మాటల్లో ఉద్యోగం, వ్యాపారం మీద చర్చ వచ్చింది. ఎన్నో ఆలోచనలు పంచుకుని చివరికి ఇవన్నీ అయినప్పుడు కదా అన్నారంతా. ప్రయత్నిస్తే ఎందుకవ్వవనేది డేసీ ఆలోచన. ఉద్యోగాన్ని పక్కన పెట్టి రిస్క్‌ చేయాలి అన్నారంతా. సరే దీని సంగతేంటో చూద్దామని రంగంలోకి దిగింది. అలా మొదలైందే ‘పింక్‌లే’. ‘ఎప్పటికైనా సొంతంగా ఏదైనా చేయాలి. దానికి ‘పింక్‌ క్లే’ పేరు పెట్టాలన్నది నాకల. పుట్టింది పింక్‌ సిటీ జయపుర. మట్టి అని తేలిగ్గా తీసేస్తాం కానీ.. ఓపికుంటే దాంతో అద్భుతాలు సృష్టించొచ్చు. ఈ రెంటినీ కలుపుతూ ఆ పేరు పెట్టా. ఏం చేయాలాని ఆలోచిస్తున్నప్పుడు నా వార్డ్‌రోబ్‌లో ఎక్కువగా చేనేత వస్త్రాలే ఉండటం గమనించా. వీటిలో ఎక్కువగా కొన్నది విదేశాల్లోనే. భారత్‌లో మాత్రం పెద్ద దుకాణాల్లో ఇవి దొరకవేం అనిపించింది. అప్పుడు నాకెంతో ఇష్టమైన చేనేత, చేతివృత్తులపైనే పని చేయాలనుకున్నా. సాంకేతిక ఇబ్బందుల కారణంగా పింక్‌ క్లే కాస్తా ‘పింక్‌ లే’ అయ్యింద’ని చెప్పుకొచ్చింది డేసి.

గౌరవప్రదమైన జీవిక...

మార్కెట్‌, పంపిణీలపై పరిశోధించి రూ.15 లక్షల సొంత పెట్టుబడితో 2015లో వ్యాపారం మొదలుపెట్టింది. దుస్తులు, ఫర్నిచర్‌, గృహాలంకరణ వస్తువులు, రాతిపాత్రలు, బొమ్మలు ఇలా వివిధ వస్తువులను అందుబాటులోకి తెచ్చింది. ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో మొదలుపెట్టి క్రమంగా సొంత స్టోర్‌, వెబ్‌సైట్‌నూ ఏర్పాటు చేసుకుంది. ‘ఆలోచన చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూసినవారే. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా చేతివృత్తులకు ఆదరణ ఉంటుంది. వాటి తయారీదారులపై మాత్రం చిన్నచూపు. వాళ్లు గౌరవంగా జీవించేలా చేయాలనుకున్నా. అందుకే రాజస్థాన్‌తోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన 400 మందితో ఒప్పందాలు చేసుకున్నా. వారిలో 200 మంది ఆడవాళ్లే’ అని చెప్పే డేసి ఉత్పత్తులు 30 దేశాలకు ఎగుమతవుతున్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో స్టోర్లూ ఉన్నాయి. కేవలం వెబ్‌సైట్‌ ద్వారానే నెలకు కనీసం 3 వేలకుపైగా ఆర్డర్లు వస్తున్నాయి. భారతీయ హస్తకళలకు ఆదరణ, అవి అంతరించకుండా చూడటమే తన లక్ష్యమనే 35 ఏళ్ల డేసీ.. నమ్మకముంటే ఎంతమంది రిస్క్‌ అని వారించినా దూసుకెళ్లమంటోంది. అప్పుడే విజయం దక్కుతుందట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్