వేశ్యావాటిక నుంచి... మానవహక్కుల సలహాదారుగా!

పుట్టుక ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ ఏ స్థాయికి ఎదగాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. నసీమా ఖాతూన్‌ దీనికి చక్కని ఉదాహరణ.

Updated : 13 Nov 2022 07:51 IST

పుట్టుక ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ ఏ స్థాయికి ఎదగాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. నసీమా ఖాతూన్‌ దీనికి చక్కని ఉదాహరణ. వేశ్యావాటికలో పుట్టి, పెరిగినా తన తలరాతను మార్చుకొని.. ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలోని రెడ్‌లైట్‌ ఏరియా.. నసీమాది. 3500కుపైగా వేశ్యా గృహాలుంటాయక్కడ. ఈమె తండ్రిని ఓ వేశ్య దత్తత తీసుకుంది. తనక్కడే పుట్టింది. ‘బద్‌నామ్‌ గలీ’గా పిలిచే ఆ ప్రాంతపు ప్రతి అమ్మాయి, మహిళను వేశ్యగానే లెక్కేస్తారు. దీన్ని మార్చాలని చిన్నతనం నుంచే ప్రయత్నిస్తోంది నసీమా. 1995లో ఐఏఎస్‌ అధికారిణి రాజ్‌బాల వర్మ.. ఇక్కడి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించారు. నసీమా అక్కడ కుట్లు, అల్లికలు నేర్చుకొని సొంత సంపాదన మొదలుపెట్టింది. చదువుకుంది కూడా.

పోలీసు రైడ్‌ల నడుమ..

‘చదువుకోవడం మాకంత సులువు కాదు. ఆ రొంపి నుంచి బయటపడ్డానికీ పెద్ద యుద్ధమే చేయాలి. నిత్యం పోలీసు రైడ్‌లు. పోలీసు సైరన్‌ వినగానే నానమ్మ నా చేతిలో పుస్తకాలు పెట్టి చదవమనేది. అప్పుడు కానీ నేను విద్యార్థినని నమ్మరని ఆమె భయం. నేను నచ్చింది చేయడాన్ని మా ఇంట్లో ప్రోత్సహించారు. చుట్టుపక్కల వాళ్లు మాత్రం ‘చదివేం చేస్తావ్‌? పెళ్లయినా ఈ వృత్తిలోకి రావాల్సిందే’ అనేవారు. నేనిందులోకి చచ్చినా రానని చిన్నప్పట్నుంచే చాలా గట్టిగా చెప్పేదాన్ని. ఆ పట్టుదలే నాకో ప్రత్యేకతను తెచ్చింది. అయితే వాళ్లంటే నాకెప్పుడూ కోపముండేది కాద’ని చెబుతుంది నసీమా. అందుకే పర్చామ్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి వారికి పునరావాస సేవలు అందిస్తోంది.

అలా గుర్తింపు...

2004లో జుగ్నూ పేరుతో వార్తాపత్రికను ప్రారంభించింది. 5 పేజీల ఆ పత్రికను తనే చేత్తో రాసి, ఇచ్చేది. వీధి నాటకాలూ వేసేది. వేశ్యల కష్టాలు, జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, రుణాలు పొందడం, ఉపాధి మార్గాలు... లాంటివన్నీ వాటిల్లో వివరించేది. ఇప్పుడా పత్రిక 32 పేజీలకు చేరింది. అమ్మాయిల వెతలు, ఎలా బయటపడాలన్న దానిపై కథనాలుంటాయి. తన స్ఫూర్తితో ఆ ప్రాంతంలో చదువుకుంటున్న అమ్మాయిలెందరో! తన సేవలకుగాను నీతా అంబానీ, సచిన్‌ చేతుల మీదుగా పురస్కారాల్నీ అందుకుంది. తాజాగా ఆమెకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌ఎచ్‌ఆర్‌సీ) తన సలహా బృందంలో స్థానం కల్పించింది. ‘ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఇదంతా మా వాళ్ల ఆశీస్సుల ఫలితమే! వాళ్లకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా, వాళ్ల గొంతుకను వినిపిస్తా. న్యాయం జరిగేలా చూస్తా’నని చెబుతోంది నసీమా. తను టెడెక్స్‌ స్పీకర్‌ కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్