సామాన్యురాలి.. విజయమిదీ!

ఏమీ తెలియని వయసులో పెళ్లి. ఆ జీవితానికి అలవాటు పడుతోన్న సమయంలో విడాకులు! తననే నమ్ముకున్న ముగ్గురు పిల్లలు. నా పరిస్థితేంటని భయపడలేదు మితా బెనర్జీ.

Updated : 19 Nov 2022 04:15 IST

ఏమీ తెలియని వయసులో పెళ్లి. ఆ జీవితానికి అలవాటు పడుతోన్న సమయంలో విడాకులు! తననే నమ్ముకున్న ముగ్గురు పిల్లలు. నా పరిస్థితేంటని భయపడలేదు మితా బెనర్జీ. పిల్లలకు మంచి భవిష్యత్తు అందివ్వడమే కాదు.. వాళ్లు గర్వించే స్థాయికి ఎదిగారు. ఈ సామాన్యురాలి కథేంటో చదివేయండి!

అమ్మానాన్నా ఇద్దరూ కష్టపడితేగానీ అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్లని పరిస్థితి. దీంతో తోబుట్టువుల సంరక్షణనీ చిన్నారి మితా బెనర్జీకి అప్పగించి వెళ్లేవారు. వీళ్లది కోల్‌కతా పక్కన చిన్న ఊరు. పెద్దవుతున్న కొద్దీ మగవాళ్ల చూపులు, వ్యాఖ్యలు ఆమెను బాధించేవి. వీటన్నింటి నుంచీ కూతుర్ని తప్పించాలని అమ్మా నాన్నా తనకు 13 ఏళ్లకే పెళ్లి చేశారు. దీంతో ఏడో తరగతితో చదువు ఆపేసి అత్తారింటికి చేరారు. 16 ఏళ్లకే పాప. 19 ఏళ్లకి ముగ్గురు పిల్లలు. అప్పుడు నచ్చలేదంటూ భర్త విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని భారమనుకోలేదు తను. కడుపు నింపితే చాలనీ భావించలేదు. వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. పాచిపని, కూలీ, చిన్న వస్తువులను అమ్మడం వరకూ ఏ పని దొరికితే అది చేశారు.

‘ఆరోజుకు పూట గడిస్తే చాలన్నది కాదు నా ఆలోచన. గౌరవ ప్రదంగా బతకాలి. పిల్లలు నన్ను గర్వంగా భావించాలి. ఆ స్థాయికి ఎదగాలనుకునేదాన్ని. దగ్గర్లో ఒక పార్లర్‌లో సహాయకురాలిగా చేరా. బ్యుటీషియన్స్‌ చేసేవి శ్రద్ధగా గమనించేదాన్ని. నా ఆసక్తి చూసి నేర్పించడం మొదలుపెట్టారు. మిగతావాళ్ల కంటే రెట్టింపు కష్టపడే దాన్ని. అయినా పిల్లలకు ఫీజులు, సౌకర్యవంతమైన ఇంటిని సమకూర్చుకోవడానికి ఇబ్బందులే. కానీ ఎప్పటికైనా ఈ పరిస్థితిని మార్చుకోగలనన్న నమ్మకం. ఓరోజు నా సహోద్యోగి ఈ-కామర్స్‌ ఏజెన్సీ గురించి చెప్పింది. అది ఉద్యోగస్థులను ఎంచుకొని క్లయింట్లనీ సమకూరుస్తుంది. ఆలోచన నచ్చి వివరాలు తెలుసుకున్నా. ఇంటర్వ్యూ పిలుపొచ్చింది. జీవితంలో మొదటి సారి.. ఎంపికైన ఆనందం మాటల్లో చెప్పలేను. కొద్దిరోజుల శిక్షణ తర్వాత ప్రొఫెషనల్‌ బ్యుటీషియనయ్యా. మొదటి సంపాదన రూ.400. తక్కువ మొత్తమే.. కానీ నా జీవితంలో దాని విలువ చాలా ఎక్కువ. క్లయింట్‌ చూపులో గౌరవాన్ని చూసిన రోజది. తర్వాత చుట్టు పక్కల వాళ్ల నుంచీ మొదలైంది. ఇప్పుడు నా సంపాదనెంతో తెలుసా? నెలకు రూ.50,000. ఇక్కడి వరకూ చేరుకోవడం, చిన్నతనంలో నేను పడ్డ ఇబ్బందులు పిల్లలకు తెలియకుండా పెంచడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. నా కూతురు ఎయిర్‌ హోస్టెస్‌ శిక్షణ తీసుకుంటోంది. మరో ఇద్దరు బాగా చదువుకుంటున్నారు. సొంత ఇల్లుంది. ‘ఒంటరిగా ఎలా చేస్తుంది? పిల్లలకేం పెడుతుంది?’ అన్న ప్రశ్నలకు ఇప్పుడు మా జీవితమే సమాధానం’ అంటారు మితా. ఆవిడ లక్ష్యం ఒక్కటే! తన జీవితం ఆమెలాంటి ఒంటరి మహిళకు ఒక్కరికైనా ధైర్యాన్నిస్తే చాలని. తన జీవితం స్ఫూర్తినిచ్చేలా లేదూ?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్