అవకాశాలనిస్తూ.. ఎదుగుతున్నారు!

‘సొంతంగా ఏదైనా చేయాలి’ అని ఆలోచిస్తున్న యువతే ఎక్కువ. అది సమాజానికీ ఉపయోగపడాలన్నది కొందరి ఆలోచన. రుచిత, అశ్వతి.. ఆ కోవకి చెందినవారే. ఒకరు గ్రామాలకు అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేస్తోంటే.. మరొకరు పిల్లల ప్రతిభను వెలుగులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వాన్నీ మెప్పించారు.

Updated : 21 Nov 2022 07:24 IST

‘సొంతంగా ఏదైనా చేయాలి’ అని ఆలోచిస్తున్న యువతే ఎక్కువ. అది సమాజానికీ ఉపయోగపడాలన్నది కొందరి ఆలోచన. రుచిత, అశ్వతి.. ఆ కోవకి చెందినవారే. ఒకరు గ్రామాలకు అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేస్తోంటే.. మరొకరు పిల్లల ప్రతిభను వెలుగులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వాన్నీ మెప్పించారు. వాళ్ల సేవా ప్రయాణమేంటో చదివేయండి.

గ్రామాలకు మెరుగైన వైద్యం

రుచిత కస్లివల్‌

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం ఇప్పటికీ కష్టమే! వారికీ అత్యాధునిక వైద్య సదుపాయాల్ని ఎందుకు కల్పించకూడదన్న ఆలోచన రుచిత కస్లివల్‌ను ‘మెడిసేవ’ ప్రారంభించేలా చేసింది.

రుచితది ఇందౌర్‌. బీకాం ఆనర్స్‌, మార్కెటింగ్‌ & ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, లెక్చరర్‌గా అయిదేళ్ల అనుభవముంది. 2020 కరోనా సమయంలో ఎంతమంది ఇబ్బందులకు గురయ్యారో రుచిత కళ్లారా చూసింది. తన భర్త విశేష్‌ డాక్టర్‌. అందువల్ల ఆమె పెద్దగా భయపడలేదు. గ్రామాల్లో ఉన్న తన బంధువులు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేక ఎవరిని సంప్రదించాలో తెలియక చాలా ఇబ్బందులు పడటాన్ని గమనించింది. ఆక్సిజన్‌ అందక చనిపోయిన వారూ ఉన్నారు. ఆ సమయంలో వైద్యం, ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్‌ సరఫరా వంటి వాటిపై ఎన్నో యాప్‌లు రూపొందాయి. కానీ సాంకేతికతపై పరిచయం లేనివారికి అవి పెద్దగా ఉపయోగపడలేదు. గ్రామీణ ప్రాంతాల వారికి అత్యాధునిక వైద్యం అందేలా చేయాలనే ఉద్దేశంతో 2020 డిసెంబరులో భర్తతో కలిసి ‘మెడిసేవ’ ప్రారంభించింది. ‘ఇది కూడా సాంకేతికతతో ముడిపడిందే. అయితే గ్రామీణుల ప్రత్యేకంగా దీని గురించి నేర్చుకోవాల్సిన పనిలేదు. ఇదో టెలి మెడిసిన్‌ వ్యవస్థ. గ్రామాల్లో మెడిసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. రోగులు తమ సమస్యలను వీడియోకాలింగ్‌ ద్వారా వైద్యులతో పంచుకోవచ్చు. వాళ్లు లక్షణాల ఆధారంగా ప్రింటెడ్‌ ప్రిస్క్రిప్షన్‌ ఇస్తారు. వ్యాధి నిర్ధరణ పరీక్షలు వగైరా అవసరమైతే సిబ్బందే సేకరించి పరీక్షల నిమిత్తం పంపిస్తారు. ఆసుపత్రిలో తప్పక చేర్చాల్సివస్తే తరలిస్తారు. ఈ సేవలన్నీ నామమాత్రపు ఫీజుతోనే అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లోని 50కుపైగా గ్రామాల్లో మా సేవలందుతున్నాయి. 50 ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకున్నాం. మా కారణంగా నేరుగా 400కుపైగా మంది ఉపాధినీ పొందుతున్నారు’ అని చెబుతోంది 30 ఏళ్ల రుచిత. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారంతోపాటు రూ.కోటిన్నర పెట్టుబడినీ అందుకుంది. ఎంతోమంది ప్రముఖులు వీళ్ల స్టార్టప్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాల్ని గ్రామాలకూ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమంటున్న రుచిత ఇప్పుడా ప్రయత్నంలోనే ఉంది.


మెరికల్లా తీర్చిదిద్దుతూ..

అశ్వతి వేణుగోపాల్‌

ఎప్పుడూ చదువేనా? సృజనాత్మక కార్యకలాపాలకీ ప్రాధాన్యముండాలి. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ! దాన్ని బయటికి తీయాలి. ఇవన్నీ సాధ్యం చేసేందుకో వేదిక ఉంటే? అన్న ఆలోచనకు రూపమే అశ్వతి స్టార్టప్‌.. ‘అవసరశాల’.

కేరళ అమ్మాయి.. అశ్వతి వేణుగోపాల్‌. ఇంజినీరింగ్‌, ఎంబీఏ చేసి అమెజాన్‌లో ఉద్యోగం సంపాదించింది. అంతర్జాతీయ ఫెలోషిప్‌ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అట్లాంటాకు చెందిన ‘కెక్టిల్‌’ అనే యూత్‌ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ గురించి తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 17-26 ఏళ్ల వయసు వారు ఎవరైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు. వాటి నుంచి ఎంపిక చేసిన 27 మందిలో అశ్వతి ఒకరు. ‘ఆ 27 మందీ.. ఆంత్రప్రెన్యూర్‌లు, సామాజిక కార్యకర్తలు, కళాకారులు... ఇలా ఏదోక ప్రత్యేకత ఉన్నవారే. వాళ్లని చూశాక నాకూ ఏదో ఒకటి చేయాలనిపించింది. మన దేశానికి తిరిగొచ్చాక చాలా ఆలోచించా. నన్ను ఆలోచింపజేసిందేంటి? ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారి ప్రతిభ కదా! మరి మన దగ్గర అలాంటి వారు లేరా? అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తేవాలన్న ఆలోచన వచ్చాక ఉద్యోగం మానేశా. పరిశోధిస్తే.. సరైన వేదికలు లేవనిపించింది. అందుకే 2019లో ‘అవసరశాల’ ప్రారంభించా. వయసుల వారీగా.. డ్యాన్స్‌, కోడింగ్‌, స్పేస్‌ కాంటెస్ట్‌, లీడర్‌షిప్‌, ఇన్నోవేషన్‌, ఒలింపియాడ్స్‌.. ఇలా పోటీల వివరాలన్నింటినీ మా వేదిక ద్వారా తెలియ జేస్తాం. లాక్‌డౌన్‌లో ‘విజ్‌ కిడ్స్‌ ఛాలెంజ్‌’ పేరుతో ఆర్ట్స్‌, సైన్స్‌, లైఫ్‌స్కిల్స్‌, కుకింగ్‌, ఫైనాన్స్‌ మొదలైన వాటిల్లో శిక్షణలనూ చేర్చాం. మా సంస్థ ద్వారా వేలమంది పిల్లలు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు సాధించి స్టార్‌ కిడ్‌లుగా పేరు తెచ్చుకున్నార’ని ఆనందంగా చెబుతోంది అశ్వతి. తన సేవలకు గుర్తింపుగా ఐకానిక్‌ విమెన్‌ ఆఫ్‌ 2020, బెస్ట్‌ సోషల్‌ ఇన్నవేటర్‌ వంటి పురస్కారాల్నీ అందుకొంది. దిగ్రా, గ్లోబల్‌ షేపర్స్‌ కమ్యూనిటీ, వెడూ రైజింగ్‌ స్టార్‌ వంటి అంతర్జాతీయ ప్రోగ్రామ్‌లకు మన దేశం తరఫున ప్రచారకర్త కూడా. ‘కెక్టిల్‌లో పాల్గొన్నప్పుడు నలుగురికైనా స్ఫూర్తిగా నిలవాలనుకున్నా. ఇప్పుడు వేల మందికి ప్రేరణగా నిలిచా. మనవాళ్ల ప్రతిభ ప్రపంచదేశాల ముందుంచడమే నా లక్ష్య’మంటోంది 28 ఏళ్ల అశ్వతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్