ప్రధానిని కలిసి..

ఆవిడ ఒకప్పుడు సాధారణ గృహిణి. ఏదైనా చేయాలన్న తపన, ఓ సృజనాత్మక ఆలోచన, ఓ సదాశయం... ఆమెను వ్యాపారవేత్తను చేశాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాదు...

Published : 21 Nov 2022 00:21 IST

ఆవిడ ఒకప్పుడు సాధారణ గృహిణి. ఏదైనా చేయాలన్న తపన, ఓ సృజనాత్మక ఆలోచన, ఓ సదాశయం... ఆమెను వ్యాపారవేత్తను చేశాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాదు... దేశ ప్రధానిని కూడా కలిసే స్థాయికి ఎదిగారావిడ.... ఇదంతా తనకెంతో ఇష్టమైన పనస వల్లే అంటున్న జెయిమీ సాజీ స్ఫూర్తి కథనమిది.

జెయిమీకి చిన్నప్పటి నుంచి పనస కాయలంటే ఇష్టం. వీళ్లది కేరళలోని వయనాడు. అక్కడ వేసవి వచ్చిందంటే చాలు పనసకాయల దిగుబడి ఎక్కువ. ఆ తర్వాత ఎక్కడ చూసినా వాటి గింజలే కనిపించేవి. జెయిమీ పనస గింజలతో రకరకాల వంటకాలు చేసేవారు. వాటి రుచికి అంతా ఫిదా అయ్యే వారు. ఈ గింజల్ని వృథా కాకుండా చేయాలన్న ఆలోచనే తనను వ్యాపారవేత్తగా మార్చింది.

నేలపాలు కాకూడదని..

‘ఎమ్మే చదివినా ఉద్యోగం చేయాలనుకోలేదు. పిల్లల పెంపకంలో బిజీగా ఉండేదాన్ని. వాళ్లు పెద్దవాళ్లై స్థిరపడ్డాక ఏదైనా చేయాలనిపించింది. ఓసారి ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే వెళ్లా. అక్కడ పనసగింజల వల్ల ఆరోగ్య ప్రయోజనాల్ని తెలుసుకున్నా. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్రొటీన్లు, ఏ విటమిన్‌, ఐరన్‌ వంటి పోషకాలుంటాయి. ఇవి రక్తహీనతను దూరం చేస్తాయి. చర్మ అనారోగ్యాలకు, శిరోజాల సమస్యలకూ పరిష్కారాన్నిస్తాయి. గింజల్ని పారేయడం వల్ల ఈ పోషకాలన్నీ నేలపాలవుతున్నాయని ఉసూరుమని అనిపించేది. వీటి రుచిని అందరికీ చూపించాలని ‘జాక్‌ ఫ్రెష్‌’ బ్రాండ్‌ను ప్రారంభించా’ అని వివరించారు జెయిమీ.


ఉత్పత్తులు..

ఆవిడ మొదలుపెట్టిన జాక్‌ ఫ్రెష్‌ బ్రాండ్‌ ఏడాది తిరిగే సరికి ‘హోలీక్రాస్‌ ఇండస్ట్రీస్‌’గా ఎదిగింది. పసన గింజలతో కాఫీపొడి, ఇన్‌స్టెంట్‌ పాయసం, దోశమిక్స్‌, ఇడియాప్పం మిక్స్‌, స్టీం కేక్‌ మిక్స్‌... ఇంకా 15 రకాల ఉత్పత్తులు చేస్తున్నారు. ‘ఈ గింజల రుచి అందరికీ నచ్చుతుంది. కానీ వీటిని శుభ్రపరిచి, పొడి చేసి వంటకాలు చేయాలంటే కుదరకపోవచ్చు. అదే మా ఉత్పత్తులతో అయితే ఏవైనా క్షణాల్లో చేసుకోవచ్చు. సీజన్‌లో పనసపండుతో జామ్‌, ఆరబెట్టి చేసే పనస చిప్స్‌, హెల్త్‌డ్రింక్‌ మిక్స్‌ వంటివీ చేస్తున్నాం. ఈ ఉత్పత్తులన్నీ కనీసం ఓ ఏడాది నిల్వ ఉంటాయి. సామాజిక మాధ్యమాల ద్వారా మార్కెటింగ్‌ చేశాం. మాకు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినియోగదారులున్నారు. ఏటా 50 టన్నులకుపైగా పనస గింజలతో ఉత్పత్తులు చేస్తున్నాం. 100కిపైగా రైతులు మాకు పనస గింజలు విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. 20 మందికి పైగా మహిళలు మావద్ద ఉపాధి పొందుతున్నారు’ అంటోన్న జెయిమీ గత నెలలో ప్రధాని మోదీని కూడా కలిశారు. త్రిశుర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఎంపికయ్యారీమె. దీనిద్వారా రూ.25 లక్షల నిధులనూ అందుకున్నారు. అంతేకాదు... ప్రధానిని కలుసుకోవడానికి ఎంపికైన అయిదుగురిలో ఒకరిగా నిలిచారు. దేశవిదేశాల్లో తన ఉత్పత్తులను విస్తరించడమే లక్ష్యమంటున్న జెయిమీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం కదూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్