టెస్ట్‌ట్యూబ్‌ పిల్లల భవిత కోసం..

పిల్లలు కలగకపోవడం.. ఈ తరం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అందుకే ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌)ను ఆశ్రయిస్తున్న వారెందరో! అయితే సరైన చికిత్సా విధానాలనే పాటిస్తున్నారా? దీనిపై సందేహాలెన్నో.

Updated : 23 Nov 2022 08:51 IST

పిల్లలు కలగకపోవడం.. ఈ తరం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అందుకే ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌)ను ఆశ్రయిస్తున్న వారెందరో! అయితే సరైన చికిత్సా విధానాలనే పాటిస్తున్నారా? దీనిపై సందేహాలెన్నో. అందుకే ‘యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ అండ్‌ ఎంబ్రియాలజీ’ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఈ బృందంలో తెలుగు ఆడపడుచు డాక్టర్‌ సుంకర శేష్‌ కమల్‌ ఒకరు. అంతేకాదు... ఆ పద్ధతిలో పుట్టిన పిల్లలు ఆరోగ్య వంతులుగా ఉండాలని విశేష కృషీ చేస్తున్నారు...

శేష్‌ కమల్‌ది విశాఖపట్నం. నాన్న ‘పద్మశ్రీ’ సుంకర ఆదినారాయణ, అమ్మ శశిప్రభ.. ఇద్దరూ వైద్యులే. పెదనాన్న, పెద్దమ్మ, మేన మామలు.. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేశారు. వాళ్లలా తనూ సమాజానికి సాయ పడాలని వైద్యవృత్తిని ఎంచుకున్నారు. ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, యూకేలో గైనకాలజీలో పీజీ చేశారు. అత్యుత్తమ ప్రతిభ చూపి ‘రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రీషియన్స్‌ అండ్‌ గైనకాలజిస్ట్స్‌’ ఫెలోషిప్‌ సాధించారు. ‘టెస్ట్‌ట్యూబ్‌ బేబీ’ అంశంపై పరిశోధనలకు ఉపక్రమించారు. కింగ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో ఐవీఎఫ్‌ చికిత్సపై పీహెచ్‌డీ, రీప్రొడక్టివ్‌ మెడిసిన్‌లో ఎండీ చేశారు. ఐవీఎఫ్‌ చికిత్స, ఆ పిల్లల భవిష్యత్తు, వారి ఆరోగ్యంలో మార్పులు.. తదితరాలపై కింగ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో పరిశోధనలు చేస్తున్నారు. ఐవీఎఫ్‌ చాలా మందిలో విఫలం అవ్వడం, దాంతో వారు తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక క్షోభకు లోనయ్యే వారు. వీటిని గమనించిన ఆవిడ ఒక అమ్మగా తోటి మహిళల వేదనను అర్థం చేసుకున్నా నంటారావిడ. అందుకే 12 లక్షల ఐవీఎఫ్‌ కేసులను విశ్లేషించారు. పరిష్కార మార్గాలనూ సూచించారు. ఎన్నో పరిశోధనా పత్రాల్ని సమర్పించడమే కాదు పలు అంతర్జాతీయ జర్నల్స్‌కు సంపాదకురాలిగా, బోర్డు సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో వందకుపైగా ప్రసంగాలిచ్చారు. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫెర్టిలిటీ సొసైటీస్‌లో బోధకురాలు కూడా.

అయిదేళ్లుగా స్థానం..

‘ఎక్స్‌పర్ట్‌స్కేప్‌’ సంస్థ ఏటా ప్రపంచ వ్యాప్తంగా రీప్రొడక్టివ్‌ టెక్నిక్స్‌, ఇన్‌ఫెర్టిలిటీ చికిత్సల్లో అత్యుత్తమ నిపుణుల జాబితాలను రూపొందిస్తుంది. రీప్రొడక్టివ్‌ టెక్నిక్స్‌లో గుర్తింపు పొందిన 100 మందిలోనే కాదు.. ఇన్‌ఫెర్టిలిటీకి చికిత్సనిచ్చే టాప్‌ 0.17 శాతం మందిలోనూ డా.శేష్‌కమల్‌ ఒకరు. వైద్య సేవలతోపాటు ఆ రంగంలో చేస్తున్న పరిశోధనలు, పాటిస్తున్న మార్గదర్శకాలు.. ఇలా బోలెడు అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించే ఈ జాబితాలో అయిదేళ్లుగా ఆవిడ నిలుస్తున్నారు. ‘ఆధునిక ప్రపంచంలో ఎన్నో అంశాలు సంతాన లేమికి దారి తీస్తున్నాయి. దీంతో ఐవీఎఫ్‌ను ఆశ్రయిస్తున్న వారూ పెరుగుతున్నారు. అయితే ఇదో వ్యాపారమవుతోంది. ఆ తీరు మార్చాలనే చికిత్సా విధానాలపై యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ అండ్‌ ఎంబ్రియాలజీ అన్ని దేశాలూ అనుసరించడం కోసం మార్గదర్శకాలను రూపొందించింది. ఐవీఎఫ్‌లో అనుసరించాల్సిన కచ్చిత విధానాలు, విఫలమవుతోంటే ఎప్పుడు ఏ చికిత్స చేయాలి? వంటి వాటిపై ఈ సూచనలుంటాయి. చాలా దేశాలు వీటినే అనుసరిస్తున్నాయి. వీటిని రూపొందించిన పది మంది సభ్యుల కమిటీలో నేనొకరినే భారతీయురాలిని. తెలుగు బిడ్డగా ఆ స్థానంలో నిలవడం గర్వంగా ఉంది. పిల్లలు క్యాన్సర్‌ వంటి వ్యాధులతో పుట్టకుండా చేయడం, తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, క్యాన్సర్‌ బాధితులకు ఆరోగ్యవంతులైన పిల్లలు కలిగేలా చికిత్సలు అందించగలగడం చాలా సంతృప్తినిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో అవరోధాలున్నా.. నిజాయతీ, పట్టుదలగా ముందుకు సాగే తత్వమే నన్నీ స్థాయిలో నిలబెట్టాయి. పేదరికం కారణంగా ఉన్నత విద్యకు దూరం అవుతున్న వారికి సాయపడే ఓ ప్రాజెక్టుకీ శ్రీకారం చుట్టబోతున్నా. మా వారు డా.రెడ్ల శ్రీధర్‌ రేడియాలజిస్టు. ఆయన బ్రిటిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రేడియాలజీకి మొదటి ఆంగ్లేతర అధ్యక్షుడిగా చేశారు. మా పాప అంకిత కూడా వైద్య విద్యనే ఎంచుకొంది’.

- సురేష్‌ రావివలస, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్