హింసను...కలిసి అడ్డుకుందాం!

అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి కాటికెళ్లే వరకూ... చూపులతో, మాటలతో, చేతలతో... పద్ధతులనీ, సంప్రదాయాలనీ... భౌతికంగా, మానసికంగా... చిన్నగానో పెద్దగానో.. ఏదో ఒక రూపంలో.. మనపై అడుగడుగునా హింస సాగుతూనే ఉంటుంది.

Updated : 25 Nov 2022 03:25 IST

అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి కాటికెళ్లే వరకూ... చూపులతో, మాటలతో, చేతలతో... పద్ధతులనీ, సంప్రదాయాలనీ... భౌతికంగా, మానసికంగా... చిన్నగానో పెద్దగానో.. ఏదో ఒక రూపంలో.. మనపై అడుగడుగునా హింస సాగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్నాళ్లు? ‘మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం’ సందర్భంగా... వసుంధర కొందరితో మాట్లాడింది...


 

నిర్భయ, దిశ, హథ్రాస్‌ చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతుండగానే ఇప్పుడు శ్రద్ధావాకర్‌ ఘటన. ఇవి మాత్రమేనా? పసిపిల్లలపై అఘాయిత్యాలూ, అత్తింటి ఆరళ్లు, లైంగిక వేధింపులు ఇలా ఒక్కటేమిటి మన చుట్టూ లెక్కలేనన్ని సంఘటనలు. అందుకే ‘మహిళలపై జరుగుతోన్న హింస ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తున సాగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘన’ అంటోంది ఐక్యరాజ్య సమితి. ప్రతి పదకొండు నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక మరణం ఆమె సన్నిహితుల చేతుల్లోనే జరుగుతోందంటున్నాయి ఐరాస నివేదికలు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన ఆరేళ్లతో పోలిస్తే 2021లో అత్యధికంగా వేధింపులు జరిగాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 26.35 శాతం ఎక్కువ.


ట్రోలింగ్‌ పట్టించుకోవద్దు...

- పూజా హెగ్డే, నటి

మహిళలపై భౌతికంగానే కాదు.. ఆన్‌లైన్‌లోనూ వేధింపులు పెరుగుతున్నాయి. కట్టూ, బొట్టూ, నడత... అన్నింటినీ జడ్జ్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ తరహా వేధింపులు స్త్రీలను మానసికంగా కుంగదీస్తూ, కొన్నిసార్లు చావు అంచుల వరకూ తీసుకెళ్తున్నాయి. దీనికి అడ్డుకట్ట పడాలంటే ట్రోలర్స్‌, ఫేక్‌ ఖాతాదారుల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. నేను వీటిని పట్టించుకోను. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటా.


గొంతు విప్పితేనే న్యాయం!
- మమతా రఘువీర్‌, తరుణి సంస్థ

కరోనా కాలంలో ఎన్నో బాల్యవివాహాలని అడ్డుకున్నాం. ఈ క్రమంలో మాపైనా దాడులు జరిగాయి. ఇక నిత్యం గృహహింసకు గురవుతోన్న మహిళలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. చాలా కేసుల్లో బాధితులు బయటకి రారు. నోరు విప్పరు. తమకేది కావాలో తాము నిర్ణయించుకోలేరు. అందుకే మహిళ పరిస్థితిలో మార్పు రావడం లేదు. విద్య, ఉద్యోగాల్లో ముందుకు వెళ్తూ, నైపుణ్యాలను పెంచుకుంటే ప్రశ్నించే స్థైర్యం అలవడుతుంది. మహిళలందరూ తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే స్థైర్యం పెరుగుతుంది.


చూసీ చూడనట్లు వదిలేయొద్దు...
- అర్చన నండూరి, సైకాలజిస్ట్‌

ఇంటా, బయటా వేధింపులను అడ్డుకోవాలంటే ముందు మనమే మారాలి. మనకోసం మనం నిలబడాలి. ఎవరో ఏదో అంటారని న్యూనతకి లోనవ్వకూడదు. ఇంట్లో భర్తలు చేసే బాడీషేమింగ్‌, సూటిపోటి మాటలు పైకి కనిపించవు. వాటిని మొదట్లోనే అడ్డుకోవాలి. ఆత్మాభిమానానికి ఇబ్బంది ఎదురైనప్పుడు చూసీ చూడనట్లు వదిలేయడం మొదలుపెడితే అలుసుగా తీసుకుంటారు. మౌనంగా ఆ హింసను భరించటమో, ఆత్మహత్యో పరిష్కారం కాదు. కౌన్సెలర్ల సాయం తీసుకోండి. కొంత తేలికపడగలరు.


భయపడితే బలవుతారు...
- శిరీష రాఘవేంద్ర, అడిషనల్‌ డీసీపీ, షీటీమ్స్‌

పరువు కోసమో, బయటకి చెబితే హాని కలుగుతుందనో భయపడి బయటకు చెప్పలేని మహిళల్నే నిందితులు టార్గెట్‌ చేసుకుంటారు. అందుకే ఏ సందర్భంలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కఠినమైన చట్టాలున్నాయి. తప్పుచేస్తే కచ్చితంగా దొరికిపోతారు. ఫిర్యాదు చేయడానికి వెనుకాడొద్దు. ఇంట్లో వాళ్ల నుంచే ఇబ్బందులు ఎదురైతే దగ్గరి వాళ్లకి చెప్పండి. లేదా డయల్‌ 100కి ఫిర్యాదు చేయండి.


అవగాహన పెంచుకుంటేనే...
- జి.వరలక్ష్మి, న్యాయవాది

మహిళల రక్షణకోసం ఎన్నో చట్టాలున్నాయి. వాటి సాయంతో ధైర్యంగా పోరాడొచ్చు. కుటుంబ సభ్యులూ, పోలీసుల అండ ఉంటే మహిళలకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. లైంగిక దాడులు, వేధింపులు, కిడ్నాప్‌, హింస, ఆమ్లదాడులు వంటి నేరాలకు పాల్పడిన వారి నుంచి నేర సంబంధిత న్యాయ సవరణ చట్టం -2013 (నిర్భయ చట్టం) రక్షణ కల్పించడంతో పాటు నిందితులకు శిక్షలు పడేలా చేస్తుంది. కట్నం వేధింపులు, వివాహేతర సంబంధాల వల్ల బాధితులుగా మారిన వారికి గృహహింస చట్టం-2005 రక్షణ కల్పిస్తుంది. ఇవి కాకుండా పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్త్రీల అసభ్య చిత్ర నిషేధ చట్టం- 1986 వంటివెన్నో స్త్రీలకు అండగా ఉన్నాయి.


గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌ వాట్సప్‌ నెంబర్‌: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాధితులెవరైనా 181, 1091, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేస్తే తక్షణం పోలీస్‌ సాయం అందుతుంది. రెండు రాష్ట్రాల్లోని స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి.


కన్నీటిని కన్నీటితోనే తుడవలేం. కార్యాచరణ కావాలి. ఆచరణ వైపు వేగంగా అడుగులు పడాలి. ఇందుకు అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపు నిచ్చింది ఐక్యరాజ్య సమితి. అందుకే ఈ ఏడాది ‘యునైట్‌’ అనే అంశాన్ని గ్లోబల్‌ థీమ్‌గా ప్రకటించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్