ఎప్పుడూ ఆ కోర్సులేనా అనుకున్నా...

అమ్మాయిలకు ఉపాధి అనగానే బ్యూటీ, టైలరింగ్‌ వంటి కోర్సులేనా? కొత్త టెక్నాలజీల రూపకల్పన, బృందాన్ని నడిపే నాయకురాలు, ఒక సీఈఓ ఎందుకు కాకూడదు? ఇదే ఆలోచన తట్టింది పూర్వీ షాకి. కాటలిస్ట్‌ సీఈఓగా వేలమంది అమ్మాయిలను అభివృద్ధిలో నడిపిస్తున్నారు. ఇంతకీ ఆవిడెవరు? చదివేయండి.

Published : 26 Nov 2022 00:14 IST

అమ్మాయిలకు ఉపాధి అనగానే బ్యూటీ, టైలరింగ్‌ వంటి కోర్సులేనా? కొత్త టెక్నాలజీల రూపకల్పన, బృందాన్ని నడిపే నాయకురాలు, ఒక సీఈఓ ఎందుకు కాకూడదు? ఇదే ఆలోచన తట్టింది పూర్వీ షాకి. కాటలిస్ట్‌ సీఈఓగా వేలమంది అమ్మాయిలను అభివృద్ధిలో నడిపిస్తున్నారు. ఇంతకీ ఆవిడెవరు? చదివేయండి.

‘ఒకప్పుడు సేవ అంటే నాకు తెలిసినంత వరకూ చెక్‌ మీద సంతకం పెట్టడమే! నా దృష్టి ఎప్పుడూ విద్యాలయాలపైనే ఉండేది. వ్యాపారంలా కాకుండా దాన్నో బాధ్యతగా తీసుకునే ఏ పాఠశాలకైనా సాయపడేదాన్ని. సమయం దొరికితే పిల్లలకు ఏదైనా బోధించే దాన్ని. విద్యపైనే ఆసక్తి ఎందుకంటే కారణం నాన్న’ంటారు పూర్వీ. చదువుకు లింగభేదం ఉండకూడదన్నది వాళ్ల నాన్న అభిప్రాయం. నలుగురు అమ్మాయిల్లో ఈమె ఒకరు. అందరినీ కోరుకున్నది చదివించారు.. ఏం చేయాలనుకున్నా ప్రోత్సహించారు. వీళ్లది ముంబయి. మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ల్లో పీజీ చేశాక పలు కార్పొరేట్‌ సంస్థలకు ఆడిటింగ్‌, ఫండ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా సేవలందించారు. పెళ్లయ్యి పిల్లలు పుట్టాక కానీ చదువు చాలామందికి ఎంత ప్రియమో అర్థం కాలేదు పూర్వీకి. కొంతమంది చదువుకుంటున్నా నచ్చింది ఎంచుకునే వీల్లేకపోవడం గమనించారు. తనకి, తన పిల్లలకు దక్కిన అవకాశం అందరికీ దొరకడం లేదని తెలిశాక ఆలోచనలో పడ్డారు.

ఉద్యోగానికి విరామమిచ్చి..

‘నేను మొదట చేసిన పని ఉద్యోగం నుంచి విరామం తీసుకోవడం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. 2004లో ఆకాంక్ష ఫౌండేషన్‌లో చేరి, పేద పిల్లలకు స్పాన్సర్లను వెతకడం, చదువు చెప్పడం, పాఠశాలల్లో లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు, లైఫ్‌స్కిల్స్‌ నేర్పడం వంటివెన్నో చేశా. చిన్నప్లిలలతో  కదా... చాలా సరదాగా ఉండేది. విద్యార్థుల్ని ఎంపికచేసి దేశ విదేశీ పోటీలకు పంపేవాళ్లం. ఒక అంతర్జాతీయ సంస్థతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఈ ఎన్‌జీఓలో పని చేసే వారిలో ఆడవాళ్లే ఎక్కువ. వీళ్లు చేయగలరా అన్న సందేహించిన వాళ్లందరికీ సమాధానం మేం సాధించిన విజయాలే’ అని చెబుతారీమె.

అమ్మాయిల కోసం.. ఓ కార్యక్రమంలో భాగంగా ఉన్నతవిద్య చదువుతున్న అమ్మాయిలతో పనిచేశారు. కొందరికేమో ఇంటర్‌ కాగానే పెళ్లి. పోనీ కొనసాగినా నైపుణ్య లోపం. ఉపాధి కోర్సులున్నా బ్యూటీ, టైలరింగ్‌ వంటివే! దీన్ని మార్చాలనుకొని 2015లో కాటలిస్ట్‌లో చేరారావిడ. ఇదో స్వచ్ఛంద సంస్థ. అమ్మాయిలను స్టెమ్‌ కోర్సుల దిశగా ప్రోత్సహించడం నుంచి ధైర్యంగా మాట్లాడటం, పెద్ద సంస్థలో ఉద్యోగాలు పొందేవరకూ తర్ఫీదు, స్కాలర్‌ షిప్‌లు, మెంటారింగ్‌ వంటి సేవలన్నీ అందిస్తుంది. కెరియర్‌లో ముందుకెళ్లేలా చూస్తుంది. దీనికి పూర్వీ సీఈఓ. ‘సంస్థ ఉద్దేశం గొప్పదే. కానీ సరైన దిశలో నడిపే వారు లేరు. నేను పగ్గాలు అందుకున్నాక ముందు ఎలా సాగాలన్న దానిపై పనిచేశా. మా ఉద్దేశమొకటే. అమ్మాయిలనగానే కొన్ని కెరియర్లే గుర్తు రావొద్దు. వాళ్లను ఆపేది శారీరకంగా, మానసికంగా బలహీనులమన్న భావనే. వాళ్లలో ఆ భావన పోగొట్టి, నాయకత్వ దిశగా నడిపిస్తున్నాం. ఇప్పటి వరకూ 2 వేలకుపైగా మంది అమ్మాయిలు కెరియర్‌లో స్థిరపడేలా చేశాం. దాదాపు వెయ్యి మంది శిక్షణ పొందుతున్నారు. దిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరులకు మాత్రమే కాక మా సేవలు దేశవ్యాప్తం చేయానున్నా’మనే పూర్వీ దేశ భవితలో అమ్మాయిలదీ ప్రధాన పాత్రేనంటారు. కెరియర్‌తోపాటు ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం కొనసాగించాలా వద్దా అన్న నిర్ణయాలన్నీ అమ్మాయిల చేతుల్లో ఉండాలంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్