వారి జీవితాల్లో రంగుల కళ

బృందస్ఫూర్తి... దీనికి సరైన ఉదాహరణ ఈ మహిళలు. చదువు లేదు. పొట్ట చేత పట్టుకొని పట్నానికి వచ్చారు. మగవాళ్లు మాత్రమే కనిపించే పెయింటింగ్‌ పనుల్లో పాతికేళ్లుగా రాణిస్తున్నారు. అదీ 30 మంది ఏళ్లుగా ఒకేమాట మీద సాగుతున్నారు.

Published : 26 Nov 2022 00:14 IST

కళమ్మ

బృందస్ఫూర్తి... దీనికి సరైన ఉదాహరణ ఈ మహిళలు. చదువు లేదు. పొట్ట చేత పట్టుకొని పట్నానికి వచ్చారు. మగవాళ్లు మాత్రమే కనిపించే పెయింటింగ్‌ పనుల్లో పాతికేళ్లుగా రాణిస్తున్నారు. అదీ 30 మంది ఏళ్లుగా ఒకేమాట మీద సాగుతున్నారు.

యాదాద్రి, గజ్వేల్‌, నల్గొండ, మెదక్‌.. నుంచి 1987లో బతుకుతెరువు కోసం నగర శివారులోని కుషాయిగూడకు చేరుకున్న 30 మంది మహిళల జీవన ప్రయాణమిది. ఆలు మగలు ఇద్దరూ పని చేస్తేనే కానీ గడవదు. మగవాళ్లు రిక్షా, ఆటో నడపడమో.. చర్లపల్లి పరిశ్రమల్లో పనులో చేసేవారు. చదువు లేదు. తమలా పిల్లలూ మిగలకూడదనుకున్నారు. ఆడ వాళ్లు సిమెంటు, తాపీ పనికి వెళ్లేవారు. కానీ జీతం తక్కువ, యజమాని ప్రవర్తనతో ఇబ్బంది.. ఇలా బోలెడు సమస్యలు. అలాగని ఖాళీగా కూర్చోలేరు. బాలయ్య అనే వ్యక్తి ఇళ్లకు సున్నాల కాంట్రాక్టులు చేసేవాడు. ఆయన దగ్గర చేరారు. చేతి నిండా పని, నెలకు కొంత డబ్బులు కనిపించేవి. వీళ్ల ఆసక్తి గమనించి, ఆయనా మెలకువలు నేర్పాడు. పనులూ అప్పజెప్పేవాడు. ఏడేళ్లు గడిచి పోయాయి. ఓ రోజు బాలయ్య హఠాత్తుగా చనిపోయాడు. మళ్లీ భవిష్యత్‌పై భయం. అప్పుడు నడిపించడానికి ముందుకొచ్చారు ఈ బృందంలోని కళమ్మ. మనమే జట్టుగా సాగుదామని ప్రోత్సహించారు. మనల్ని నమ్మేదెవరు? పనిచ్చేదెవరు.. మిగిలిన వారిలో ఎన్నో సందేహాలు. మనమే ప్రచారం చేసుకుందాం, మన పనేంటో చూపుదాం అనుకున్నారు.

చుట్టుపక్కల శుభకార్యాలు జరుగుతున్నాయంటే.. వెళ్లి అవకాశమివ్వ మనే వారు. పనులొచ్చినా అంతంత మాత్రమే! ఒకప్పటి ఆదాయం లేదు. అయినా నమ్మకం కోల్పోలేదు. అయితే ఒకసారి చేయించుకున్న వాళ్లు వేరే వాళ్లకు సిఫారసు చేస్తూ వచ్చారు. అలా మొదలైన వీరి ప్రయాణం ఇప్పటి వరకూ ఆగలేదు. వీరందరికీ ఐదు పదులు దాటినా కొనసాగిస్తున్నారు. ఈ పాతికేళ్లలో వచ్చిన మార్పులను అందుకుంటూ బహుళ అంతస్థుల నిర్మాణాలకూ రంగులేసే కాంట్రాక్టులను తీసుకుంటున్నారు. ‘ఆడవాళ్లైనా బాగా చేస్తారన్న పేరు తెచ్చుకున్నాం. ప్రభుత్వ బిల్డింగులకీ పని చేశాం. పనిని బట్టి, గ్రూపులుగా విడిపోతాం. శ్రమను బట్టి డబ్బులు విభజించుకుంటాం. పాతికేళ్లుగా కలిసి చేస్తున్నాం. ఒకే కుటుంబం మాది. చిన్న విభేదాన్నీ ఎరుగం. ఉన్నంతలో పిల్లలను చదివించుకున్నాం. చుట్టుపక్కల ఫ్యాక్టరీల్లో చిన్నపాటి ఉద్యోగాలూ చేసుకుంటున్నాం. ఓపిక ఉన్నంత వరకూ ఇలానే సాగుతాం’ అంటారు కళమ్మ. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్వశక్తితో సాగుతోన్న వీరి ప్రయాణం ఆదర్శనీయమే కదూ!

- పి.మహేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్