విజయాన్ని పండించి..

‘అందం ముఖ్యమే.. అలాగని ఆరోగ్యంతో రాజీపడలేం కదా’ అనుకొనేవారికి నాణ్యమైన ఉత్పత్తులని అందించేందుకు గోరింటాకు సాగు మొదలుపెట్టారు డోబిల సుజాత.

Updated : 30 Nov 2022 14:59 IST

‘అందం ముఖ్యమే.. అలాగని ఆరోగ్యంతో రాజీపడలేం కదా’ అనుకొనేవారికి నాణ్యమైన ఉత్పత్తులని అందించేందుకు గోరింటాకు సాగు మొదలుపెట్టారు డోబిల సుజాత. సౌందర్య ఉత్పత్తుల తయారీలో వ్యాపారవేత్తగా రాణిస్తున్న ఈ వరంగల్‌ ఆడపడుచు తన ప్రయాణంలో ఎదురయిన కష్టనష్టాలని మనతో పంచుకున్నారిలా...

వైఫల్యాలు, పొరపాట్లు జరగకుండా ఎవరికీ విజయం రాదేమో! నాక్కూడా అదే జరిగింది. మాది వరంగల్‌ జిల్లా సంగెం మండలం దగ్గరున్న ఆశాలపల్లి గ్రామం. పదో తరగతి  చదువుకున్నా. మావారు రమేష్‌. వ్యవసాయం చేసి.. వరి, పత్తి, మిర్చి పండించేవాళ్లం. వీటితోపాటు.. స్థానికంగా ఉండే బ్యూటీపార్లర్లకి కావాల్సిన సౌందర్య ఉత్పత్తులని మార్కెటింగ్‌ చేసేవారు. చాలామంది హెన్నా, క్రీం వంటివి నాణ్యత లేకపోతే వద్దని మొహంమీద చెప్పేసేవారు. ఆ క్రమంలోనే ఆయన ద్వారా నాకూ ఉత్పత్తుల్లో నాణ్యతలోపాల గురించి తెలిసింది. మరికాస్త లోతుగా తెలుసుకుందామని హైదరాబాద్‌లో రాజేంద్రనగర్‌లో ఉన్న ఎన్‌ఐఆర్‌డీలో హెన్నా తయారీ నేర్చుకున్నా. దీనికి అవసరం అయిన గోరింటాకుని బయట కొనడం కన్నా మా పొలంలో రసాయనాల్లేకుండా పండిస్తే బాగుండుననిపించింది. హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌వాళ్ల సాయంతో 2005లో నాణ్యమైన విత్తనాలు వేసి ఎకరంలో సాగు మొదలుపెట్టాం. పంట చేతికొచ్చినా.. మేం చేసిన హెన్నా విజయవంతం కాలేదు. తలకు పెడితే పొడిలా రాలిపోయేది. అలాకాకూడదు. మెత్తగా వెన్నలా ఉండాలి. అలా కావాలంటే ప్రత్యేకమైన పరికరాలు ఉండాలని తెలిసి రాజస్థాన్‌, జైపుర, దిల్లీ, మహారాష్ట్రలు తిరిగి ఆ యంత్రాల గురించి తెలుసుకుని శిక్షణ తీసుకుని వచ్చాను. కాస్త నమ్మకం రాగానే ఒక్కో ఏడాది సాగు విస్తీర్ణం పెంచుతూ వచ్చాను. అయితే గోరింటాకు చెట్లకు నీళ్లు పెట్టడం దగ్గర నుంచి ఏ సీజన్‌లో కోయాలనేది చాలా ముఖ్యం. ఓసారి మూడెకరాల పంటని కోసి... ఓ చోట కుప్పపోసాం. లోపల వేడికి ఆకు నల్లగా మారిపోయింది. అదంతా వృథానే. కాస్త నీళ్లు ఎక్కువైతే ఆకు రంగు తగ్గుతుంది. ఇవన్నీ అనుభవంతోనే తెలుసుకుని నాణ్యమైన ఉత్పత్తిని అందించడం మొదలుపెట్టా. మాకు కవలలు. వాళ్లను చూసుకుంటూ.. సమయానికి ఆర్డర్లని అందించడానికి పగలూ, రాత్రి పనిచేసేవాళ్లం. అలా ప్రస్తుతం నాలుగెకరాల్లో గోరింటాకు సాగు చేస్తున్నాం. యంత్రాల కొనుగోళ్ల కోసం రుణాన్ని తీసుకున్నాం. మా ‘జనతా’ ఉత్పత్తులని మొదట్లో ఉచితంగా శాంపిళ్లు ఇచ్చి నచ్చితేనే తీసుకొమ్మన్నా. నాణ్యత బాగుండటంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్‌, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, మంచిర్యాల, హైదరాబాద్‌లోని పలు బ్యూటీపార్లర్లు, సెలూన్లలో మేము తయారుచేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. ఆదాయం పెరిగింది. అంతా బాగానే ఉందనుకున్న సమయానికి కొవిడ్‌ ముంచుకొచ్చింది.


ఆన్‌లైన్‌లోకి ...

కొవిడ్‌ వేళ వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఆమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ఉత్పత్తులని అమ్మకానికి ఉంచాం. హెన్నాతోపాటు ప్రకృతి సిద్ధమైన, శరీరానికి హాని కలిగించని నూనెలు, సున్నిపిండి, క్రీంలు, ఫేస్‌ప్యాక్‌లు వంటి 20కు పైగా ఉత్పత్తులు తయారుచేస్తున్నా. డీఆర్‌డీఏ సహకారంతో పలు ప్రదర్శనల్లోనూ మా ఉత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేశాం. 2020లో చిన్నస్థాయిలో మొదలైన మేము .. ఇప్పుడు సీజన్ల వేళ నెలకు రూ. 3-4 లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి మా ఉత్పత్తుల తయారీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. వారికి హెర్బల్‌ ప్రొడక్ట్స్‌ తయారీ మీద అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి ఉంటే మేమే శిక్షణనిస్తాం. ఉపాధి కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఒక లక్ష్యం అంటూ ఉంటే దాన్ని చేరుకోవడానికి చదువూ, డబ్బూ రెండూ ఆటంకం కాదంటాన్నేను.

- గొడిశాల జీవన్‌కుమార్‌, సంగెం, వరంగల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్