తాజ్‌మహల్‌.. యమునా నది... పోటీలో నిలబెట్టాయి

వయసును తలచుకుని నిట్టూర్చలేదామె. విలువైన జీవితాన్ని... అందంగా, ఆనందంగా మలుచుకోవాలనుకున్నారు. భార్యగా, తల్లిగా, కోడలిగా, ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా... భిన్న పాత్రల్ని పోషిస్తూనే అభిరుచులకూ సాన పెట్టుకున్నారు. తాజాగా... అమెరికాలో ‘మిసెస్‌ ఆసియా యూఎస్‌ఏ’ పోటీల్లో 27 దేశాల అభ్యర్థులపై నెగ్గి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

Updated : 01 Dec 2022 07:48 IST

వయసును తలచుకుని నిట్టూర్చలేదామె. విలువైన జీవితాన్ని... అందంగా, ఆనందంగా మలుచుకోవాలనుకున్నారు. భార్యగా, తల్లిగా, కోడలిగా, ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా... భిన్న పాత్రల్ని పోషిస్తూనే అభిరుచులకూ సాన పెట్టుకున్నారు. తాజాగా... అమెరికాలో ‘మిసెస్‌ ఆసియా యూఎస్‌ఏ’ పోటీల్లో 27 దేశాల అభ్యర్థులపై నెగ్గి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ భారతీయురాలూ ఆవిడే. ఈ సందర్భంగా 39 ఏళ్ల అల్లూరి సరోజ వసుంధరతో మాట్లాడారు. ఆ వివరాలివీ...

‘ఆడపిల్లలు ఏదైనా సాధించగలరు. కావాల్సింది ఆత్మవిశ్వాసమే. ఏ పరిస్థితుల్లోనూ దాన్ని కోల్పోవద్దు’ అని నాన్న చెప్పే మాటలు నాలో స్ఫూర్తిని రగిలిస్తు ంటాయి. చిన్నప్పటి నుంచీ ఏదైనా భిన్నంగా... కాస్త వైవిధ్యంగా చేయాలనేది నా ఆలోచన.

మాది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి. నాన్న అల్లూరి రాంబాబు రాజు జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధించి విశాఖలో స్థిరపడ్డారు. అమ్మ పార్వతి. గీతమ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చేశా. న్యూయార్క్‌ వర్సిటీలో మాస్టర్స్‌ తర్వాత ఐటీలో  కెరియర్‌ ప్రారంభించా. ఇక్కడే స్థిరపడిన, హైదరాబాద్‌కి చెందిన హరిప్రసాద్‌తో పెళ్లయ్యింది. మాకిద్దరు పిల్లలు... ఏడేళ్ల బాబు అవ్యాన్‌వర్మ, రెండున్నరేళ్ల పాప దీత్యావర్మ. జీవితం హాయిగా గడిచిపోతోంది. అయినా సరే, కొత్తదనం కోసం ప్రయత్నించే దాన్ని. ఈలోగా ప్రముఖ కమ్యూనికేషన్‌ సంస్థ ఏటీఅండ్‌టీలో ఐటీ విభాగంలో టెక్నాలజీ లీడర్‌గా బాధ్యతలు తీసుకున్నా. ఫ్యాషన్‌, మోడలింగ్‌లపై ప్రేమ కొద్దీ ‘హంస డిజైనర్‌’ క్లాత్‌స్టోర్‌ తెరిచా. ఫ్యాషన్‌ షోల్లోనూ పాల్గొనే దాన్ని. ఇన్ని బాధ్యతల సమన్వయం కష్టమే... ఇష్టంతో చేస్తోన్నవి కాబట్టి ఆ భావన కలగదెప్పుడూ.

కాళ్లకి బొబ్బలు వచ్చినా...

‘మిసెస్‌ ఆసియా యూఎస్‌ఏ’లో హైహీల్స్‌ వేసుకుని ర్యాంప్‌ వాక్‌, గ్రూప్‌ డాన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఆరున్నర అంగుళాల హీల్స్‌తో డాన్స్‌ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డా. కాళ్లు మడత పడేవి. నొప్పితో విలవిల్లాడే దాన్ని. ప్రాక్టీసులో కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆపలేదు. తుది పోటీలకి చేరాక.... ఓ ఆలోచన వచ్చింది. తాజ్‌మహల్‌ నమూనాని భుజాలకెత్తుకుని, యమునని తలపించే నీలి దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేయాలని. తాజ్‌ సెట్‌ని మన దేశం నుంచి తెప్పించడం పెద్ద పనే. ఇక్కడే ఓ మెక్సికన్‌ కళాకారుడి సాయంతో చేయించా. తీరా అది 30 కిలోల బరువుంది. అయినా దాన్ని భుజంపై మోస్తూ నడిచా. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆ బరువు బాధ తెలియలేదు. నా మాట తీరు, చురుకుదనం, కష్టించేతత్వం నచ్చడంతో నేను పనిచేస్తున్న సంస్థతో పాటు ఇండియా, ఫిలిప్పీన్‌, యూరప్‌ దేశాల కంపెనీలు ఈ పోటీల్లో నాకు స్పాన్సర్‌షిప్‌ ఇచ్చాయి.

అందమే కాదు...

పోటీల్లో అందమే కాదు... ఉద్యోగ బాధ్యతలూ, కుటుంబం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత ఆసక్తులూ, ప్రవర్తన, సేవా తత్వం వంటివన్నీ పరిశీలిస్తారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖులెందరో వ్యవహరించారు. దేశవిదేశాలకు చెందిన రెండువేల మంది ప్రతినిధుల మధ్య వేదికపై రాణించడం చాలా తృప్తినిచ్చింది. మా వారు, అత్తయ్య విజయలక్ష్మిల సహకారం లేనిదే ఇవేవీ సాధ్యమయ్యేవి కాదు!


వయసుతో పనిలేదు

వయసు గురించి ఆలోచించి... మనల్ని మనమే వెనక్కిలాక్కుంటున్నాం. ఆలోచనలకు అడ్డంకులు లేనట్లే... లక్ష్యసాధనకీ వయసు అడ్డం కాదు. పనిపై ఏకాగ్రత, శ్రద్ధ, నమ్మకం వంటివే ముందుకు నడిపిస్తాయి.


- నాగరాజు లంకలపల్లి, రాజోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్