పనికిరాని వస్తువులే.. బుజ్జి బొమ్మలాయె..

పాత తరం వాడిన వస్తువులు నేటి తరానికి తెలియజేయాలనే ఆరాటం ఆమెది.. అవి బొమ్మల రూపంలో ఉంటే బుజ్జాయిల మనసు దోచేస్తాయనుకున్నారు.

Published : 04 Dec 2022 00:03 IST

పాత తరం వాడిన వస్తువులు నేటి తరానికి తెలియజేయాలనే ఆరాటం ఆమెది.. అవి బొమ్మల రూపంలో ఉంటే బుజ్జాయిల మనసు దోచేస్తాయనుకున్నారు. అందుకే, అలనాటి సామగ్రి తయారీకి, సంఘటనలను తెలిపే ఘట్టాల నిర్మాణానికీ ‘వృథా’నే ముడి సరకుగా ఎంచుకున్నారు. అలా... చిత్తుకాగితం నుంచి చీపురుపుల్ల వరకూ వ్యర్థాలెన్నో ఆమె చేతిలో సూక్ష్మ కళారూపాలుగా మారిపోయాయి. విశాఖకు చెందిన రమాదేవి తన సృజన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

ట్టెల పొయ్యి, పందిరి మంచం, పూరిపాక, కోళ్ల గూడు.... వంటివి ఇప్పటి పిల్లలకు తెలుసా. గ్రామీణ వాతావరణంలో పెరగకపోయినా... అదెలా ఉంటుందో తెలుసా అంటే లేదనే చెప్పాలి. పండగలు ఒకప్పుడు ఎలా జరిగేవో కనీసం చెప్పే వారైనా ఉన్నారా.. అంటే ఆ పరిస్థితీ లేదు. అందుకే ఇవన్నీ మినియేచర్స్‌ ద్వారా చెప్పాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలంటే ఇష్టం. 12వ ఏట నుంచి బంక మట్టితో బొమ్మలు చేయడం అలవాటు. పెళ్లయ్యాక వాటి తయారీ నాకు గుర్తింపును ఇస్తుందని మాత్రం ఊహించలేదు. మాది కాకినాడ దగ్గర పిఠాపురం. డిగ్రీ చదువుతున్నప్పుడే పెళ్లయింది. మా వారిది ప్రభుత్వోద్యోగం. పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబ బాధ్యతలతోనే కాలం గడిచిపోయింది.

ఇతర రాష్ట్రాల నుంచీ...

వీటన్నింటి మధ్యా నాకో గుర్తింపు వచ్చేలా చేసింది ఈ కళే. 30 ఏళ్ల కిందటే ఆయన ఉద్యోగరీత్యా విశాఖకు వచ్చాం. అప్పట్లో మా బాబు కోసం చిన్న చిన్న ఆకృతుల్ని చేయడం మొదలు పెట్టా. పాతపత్రికలు, మట్టి, చీపురు పుల్లలు ఒకటేంటి... వృథావన్నీ వాడాను. వాటితో మంచాలు, టేబుళ్లు, పింగాణి గిన్నెలు, చెంచాలు, కత్తులు, కుర్చీలు, వీణ, తాజ్‌మహల్‌, కుట్టుమిషన్‌ వంటి వెన్నో తయారు చేశాను. ఆ ఫొటోల్ని ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో పెట్టేదాన్ని. వివాహాలు, పుట్టిన రోజు వేడుకల్లో బహుమతులుగానూ ఇచ్చేదాన్ని. అవి చూసి స్నేహితులూ, బంధువులూ మాకూ చేసిపెట్టమని అడిగే వారు. నేను చేసిన కళాకృతులు బాగున్నాయని ఆ నోటా ఈ నోటా పాకడంతో... ఐదేళ్లుగా దిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచీ ఆర్డర్లూ వస్తున్నాయి.

200 మంది పిల్లలకి నేర్పించా...

దీన్ని వ్యాపారం కంటే కళగా, కాలక్షేపంగా చేయడమే నాకిష్టం. దీన్ని పిల్లలకు పరిచయం చేయాలనేది నా లక్ష్యం. అందుకే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేదాన్ని. అక్కడ ఆసక్తి ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టా. అలా నాదగ్గర 200 మంది పిల్లలు నేర్చుకున్నారు.  కుట్లు, అల్లికలు ఫ్యాబ్రిక్‌, తంజావూర్‌ పెయింటింగ్స్‌ వంటివీ నేర్పిస్తా. కళాశాలల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తరగతులు నిర్వహించా. ఈ కళారూపాతో మినీ మ్యూజియం రూపొందించాలన్నది నా ఆకాంక్ష.

-కె.రాజు, అక్కయపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్