ఈ అమ్మల స్పందన...వందలాది పిల్లలకు సాంత్వన

అనాథ చిన్నారుల, ప్రత్యేక అవసరాల పిల్లల వెతలను చూసి వారి మనసు కరిగిపోయింది... ఆ పసి కందులకు తోడుగా నిలబడాలనుకున్నారు.

Updated : 06 Dec 2022 05:43 IST

అనాథ చిన్నారుల, ప్రత్యేక అవసరాల పిల్లల వెతలను చూసి వారి మనసు కరిగిపోయింది... ఆ పసి కందులకు తోడుగా నిలబడాలనుకున్నారు. అమ్మలా ఆత్మీయ స్పర్శని అందిస్తూ... వారి ఆరోగ్య పరిరక్షణ కోసం... అలుపెరగని కృషి చేస్తోన్న హైదరాబాదుకు చెందిన ఎనిమిది మంది స్నేహితురాళ్ల సేవా పయనమిది. ఆ విషయాలను వారిలో ఒకరైన రాధికారెడ్డి వసుంధరతో పంచుకున్నారు...

పాపాయికి అమ్మ పొత్తిళ్లలో ఉంటే ఎంత హాయి. వెచ్చగా తల్లిపాలు తాగుతుంటే... ఎంత భద్రంగా ఉంటుంది. అందరికీ ఆ అదృష్టం ఉండదు. ఈ ఊహే మమ్మల్ని అనాథ చిన్నారుల సేవకు పురికొల్పింది. మొదట... దుస్తులూ, డబ్బులూ, బొమ్మలు ఇవ్వాలని అనుకున్నాం. ఇందుకు లిండే ఫోర్డ్‌ అనే అమెరికన్‌ స్నేహితురాలి చొరవే కారణం.  ఉండేది హైదరాబాదులోనే, ఇక్కడే ఓ ఎన్జీవోకి వెళ్లి మేం సేకరించినవి ఇచ్చాం. అప్పుడే అక్కడ పిల్లల ఆరోగ్య పరిస్థితి, చూసుకోవడానికి ఉన్న పరిమిత సిబ్బంది... ఇతరత్రా ఇబ్బందులనూ గమనించాం. ముఖ్యంగా.. నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు తల్లిప్రేమ ఎంత అవసరమో తెలుసుకున్నాం. అది మొదలు... వారానికి 2,3 సార్లు వెళ్లి వారితో గడపాలనే నిర్ణయానికి వచ్చాం. ఆ సమయంలోనే ఓ చిన్నారికి అత్యవసర శస్త్రచికిత్స విషయం మా దృష్టికి వచ్చింది. లిండే... ఆ బాధ్యత తీసుకుంది. సర్జరీ తేదీ దగ్గర పడ్డాక... తను అనుకోకుండా స్వదేశానికి వెళ్తూ ఆ బాధ్యతను నాకప్పగించింది. అప్పుడే (2014లో) ‘అడ్వొకేట్స్‌ ఫర్‌ బేబీస్‌ ఇన్‌ క్రైసిస్‌ (ఏబీసీ)’ స్వచ్ఛంద సంస్థని నమోదు చేయించాం. అనాథపిల్లలకు ప్రేమతో పాటు మంచి ఆరోగ్యాన్నీ ఇవ్వాలనుకున్నాం.

స్పర్శ, శ్రద్ధ కీలకం...

మేం దత్తత తీసుకున్న ఆశ్రమాల్లో ఆరునెల్లకోసారి వైద్యపరీక్షలు, ఆరోగ్య సమస్యలున్న వారికి చికిత్సలు చేయిస్తున్నాం. మేమందించే స్పర్శ, శ్రద్ధ వారిని చురుగ్గా మారుస్తున్నాయి. ఆహారం, డైపర్లు, దుప్పట్లు, మందులూ వంటివి ఇస్తూనే... వారానికి రెండు మూడు సార్లు వెళ్లి పిల్లలతో గడపడం మొదలుపెట్టాం. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం సిబ్బందిని నియమించాం. వారానికోసారి పిల్లల వైద్యులూ సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఐసీయూ కేసులూ, ఖరీదైన టీకాలూ... వంటివన్నీ  మేం చూసుకుంటున్నాం. డెర్మటాలజీ, డెంటల్‌ క్యాంపులూ ఏర్పాటు చేస్తున్నాం. పదేళ్ల క్రితం ఒక దాంతో మొదలుపెట్టిన ఈ సేవలు ఎనిమిది ఆశ్రమాలకు విస్తరించాయి.

కళ్లు చెమరుస్తాయి...

బాధ్యతలు పెరిగే కొద్దీ మేమూ విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలతో సమయం గడిపే కడ్లింగ్‌ గ్రూపు ఒకటి... ఆరోగ్య సంరక్షణ బృందం మరొకటి. కొందరిని నెలల తరబడి ఆసుపత్రుల్లోనే ఉంచాలి. చికిత్స ఎంత ముఖ్యమో అనంతర సంరక్షణా అంతే అవసరం. అందుకే పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రుల్లోనే ఉంచుతాం. వారికోసం ప్రత్యేకంగా ఆయాలను నియమిస్తాం. ఒక్కో చిన్నారిదీ ఒక్కో రకమైన కేసు. ఓ పాపకి అత్యవసరంగా గుండె ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. అప్పుడు తను చాలా బలహీనంగా ఉంది. సర్జరీకి సిద్ధం చేయడానికే నెల పడితే... తర్వాత  కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది. రూ.లక్షల్లో ఖర్చయ్యింది. ఇప్పుడు తను చక్కగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు 350 మంది పసిపిల్లలకు వైద్య సాయం అందించగలిగాం. వీటన్నింటికీ డబ్బులో అంటారా? మొదట్లో సొంతంగా సమకూర్చుకునే వాళ్లం. ఇప్పుడు కొంత సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ అందుతున్నాయి. ముఖ్యంగా యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌... మాకోసం నిధుల్ని అందిస్తుంది. బ్లూ డెలిజియన్‌, శ్రీరామ్‌ లైఫ్‌ సంస్థలు మొదటి నుంచీ తోడుగా ఉన్నాయి. ఇప్పటివరకూ రూ.50 లక్షలకు పైగానే ఖర్చు చేశాం. ఈ కార్యక్రమాల్లో ఎనిమిది మంది బోర్డు మెంబర్లం కలిసి పని చేస్తున్నాం. ఆరోగ్యంగా, సంతోషంగా తిరుగుతున్న పిల్లలను చూస్తోంటే మా కష్టాన్ని మర్చిపోతుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్