పవర్‌ చూపించారు

పవర్‌ లిఫ్టింగ్‌ అంటే... కండలు తిరిగిన మగవాళ్ల వ్యవహారంగానే ఇప్పటికీ చూస్తాం. ‘ఇలాంటివి ఆడపిల్లలకు సరిపడవు’ అనే మాటలే వింటాం.

Updated : 07 Dec 2022 07:50 IST

పవర్‌ లిఫ్టింగ్‌ అంటే... కండలు తిరిగిన మగవాళ్ల వ్యవహారంగానే ఇప్పటికీ చూస్తాం. ‘ఇలాంటివి ఆడపిల్లలకు సరిపడవు’ అనే మాటలే వింటాం. ఆ వివక్షనీ, వ్యతిరేకతని తోసిరాజని నిరూపించుకుంటున్నారీ అమ్మాయిలు. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి స్ట్రాంగ్‌ ఉమెన్‌గా నిలిచారు విజయవాడకు చెందిన నీలం మణిశ్రావణి, తిరుపతి అక్కాచెల్లెళ్లు మౌనిక, రష్మితలు..


మా అమ్మా పవర్‌ లిఫ్టరే!

అమ్మ ప్రోత్సాహంతో ఇందులో అడుగుపెట్టిన 18 ఏళ్ల మణిశ్రావణి న్యూజిలాండ్‌లో కామన్వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌’ని గెలుచుకుంది.

‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న వెంకట మోహనరావు పూజా సామగ్రి విక్రేత. అమ్మ నీలం భవాని ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత. తమ్ముడు దేవగణేష్‌ ఈతలో నేషనల్‌ మెడలిస్ట్‌. నా పట్టుదలని గమనించిన అమ్మ పవర్‌ లిఫ్టింగ్‌లో రాణిస్తానని ప్రోత్సహించింది. మంచి గురువుల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించింది. ఇప్పుడు కోచ్‌ సందీప్‌ శిక్షణ ఇస్తున్నారు. అమ్మకోసమే ఇందులోకి వచ్చినా సీనియర్‌ క్రీడాకారులు సాధించిన పతకాలు నాలో స్ఫూర్తి రగిలించాయి. రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌ షిప్‌లో రజతాన్ని గెలిచాక సాధించగలననే నమ్మకం వచ్చింది. హైదరాబాద్‌లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో స్వ్కాడ్‌, బెంచ్‌ ప్రెస్‌, డెడ్‌ లిఫ్ట్‌లో మొత్తం 392.5కేజీల బరువెత్తి ఓవరాల్‌ పసిడి పతకాన్ని గెలిచా. దాంతో కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించా. న్యూజిలాండ్‌లో జరిగిన కామన్వెల్త్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌ పసిడి పతకంతో పాటు ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌’ టైటిల్‌నూ సాధించగలిగా. ప్రస్తుతం మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఎస్‌సీ రెండో సంవత్సరం చదువుతున్నాను. క్రీడల్లో నా తపనని గుర్తించిన మా కళాశాల ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించింది. మరో వైపు విమర్శలూ ఉండేవి. అమ్మాయిలకు ఇలాంటి క్రీడలు ఎందుకనే వారు. వాటిని నేనెప్పుడూ లక్ష్య పెట్టను. ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీలకు అర్హత సాధించడమే ప్రస్తుతం నా లక్ష్యం’ అంటోంది మణిశ్రావణి.

- తాతినేని పూర్ణిమ శ్రీనివాసరావు, విజయవాడ


ఎంబీబీఎస్‌ చదువుతూ..

ఇంట్లో క్రీడాకారులెవరూ లేరు! చిన్నప్పటి నుంచీ ఆటల్లో రాణించిన అనుభవమూ లేదు. గురువు ప్రోత్సాహంతో ఎంబీబీఎస్‌ చదువుతూ పవర్‌లిఫ్టింగ్‌లో అడుగు పెట్టింది తిరుపతి అమ్మాయి కృష్ణాపురం మౌనిక..

‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న తితిదేలో డ్రైవర్‌. పద్మావతి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మూడో ఏడాదిలో ఉన్నా. చెల్లి రష్మిత పదో తరగతి. కొన్నాళ్ల క్రితం ఇద్దరం జిమ్‌కెళ్లడం మొదలుపెట్టాం. మేం చేస్తున్న పద్ధతి చూసిన కోచ్‌ పవర్‌ లిఫ్టింగ్‌లోకి వెళ్తే బాగా రాణిస్తారని సలహా ఇచ్చారు. చిన్నప్పుడు క్రికెట్ ఆడాలని ఉండేది. కానీ నెరవేరలేదు. అందుకే వెంటనే కోచ్‌ సలహా మేరకు నేను, చెల్లి పవర్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టాం. పొద్దునే కాలేజీకి వెళ్లే వరకూ, సాయంత్రం సాధన చేస్తా. చెల్లి ఉదయం మాత్రమే సాధన చేస్తుంది. అమ్మా నాన్నలతోపాటు కాలేజీ వాళ్లూ ప్రోత్సహిస్తున్నారు.  సాధన మొదలు పెట్టిన కొద్ది కాలంలోనే రాజ మహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో నేను బంగారు పతకాన్ని... చెల్లి సబ్‌ జూనియర్స్‌లో రజతాన్ని గెలిచాం. దీంతో జాతీయ స్థాయిలో డబ్ల్యుపీసీ ఆధ్వర్యంలో నోయిడాలో జరిగిన ‘రా నేషన్స్‌’ పోటీలకు అవకాశం వచ్చింది. ఇందులో నేను డెడ్‌ లిఫ్ట్‌, బెంచ్‌ ప్రెస్‌ విభాగాల్లో బంగారు పతకాలు సాధించా. వైద్య రంగంలో కొనసాగుతూనే పవర్‌ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది నా లక్ష్యం. వైద్య విద్య అంటే క్షణం తీరిక ఉండదు, మరి పవర్‌లిఫ్టింగ్‌లో రాణించడం కష్టం కదా అంటుంటారు చాలామంది. అదీ నిజమే. నేను రెంటినీ ఇష్టపడతాను. ఇష్ట పడితే ఏదీ కష్టం కాదుగా!’... అంటోంది మౌనిక.

- మహంకాళి కిరణ్‌, తిరుపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్