సానుభూతి కాదు... చేయూతనివ్వాలి

‘అమరయోధుల భార్యల పట్ల సానుభూతి మాత్రమే సరిపోదు. వాళ్లకి ఉద్యోగం లేదా ఉపాధి కల్పించండి.

Updated : 07 Dec 2022 04:17 IST

‘అమరయోధుల భార్యల పట్ల సానుభూతి మాత్రమే సరిపోదు. వాళ్లకి ఉద్యోగం లేదా ఉపాధి కల్పించండి. అదీ అసలైన దయ, అదే సైనిక సోదరులకిచ్చే నివాళి’ అంటారు విద్యా సనప్‌. ఆమెది 23 ఏళ్ల సంఘర్షణతో వచ్చిన ఆత్మవిశ్వాసం. జీవితపాఠాలతో రాటుతేలిన ఆలోచనాపటిమ. కంటకాలను దాటుకుంటూ సాగిన స్ఫూర్తి ప్రయాణం ఆమె మాటల్లోనే...

‘ఊహ తెలిసినప్పటి నుంచీ ఇటుక బట్టీల్లో, హోటళ్లలో పనిచేశాను. ఆ అనుభవాలు జీవితమంటే ఏమిటో నేర్పాయి. ధైర్యాన్ని నూరిపోశాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా తర్ఫీదిచ్చాయి. నా భర్త సుభాష్‌ సనప్‌ సైనికుడు. మా పాప మొదటి పుట్టిన రోజుకు కూడా రాలేని స్థితి నా భర్తది. కార్గిల్‌ యుద్ధం ముగిసి ఇంటికి వస్తాడని ఆశగా చూస్తోంటే వీరమరణం చెందినట్లు కబురందింది. ఆ వార్త వినగానే కాళ్ల కింద నేల కుంగిపోయిందనే చెప్పాలి.

ఇరవయ్యేళ్లకే భర్తను కోల్పోయి చంటిబిడ్డతో మిగలడం కంటే దయనీయ స్థితి ఉంటుందా? కానీ ఆ దుఃఖంలోనే ఉండి పోదలచుకోలేదు. ధైర్యాన్ని కూడదీసుకున్నాను. నిరాశా నిస్పృహలను తరిమికొట్టి, జీవన పోరాటం సాగించాను. ప్రభుత్వ సహకారంతో గ్యాస్‌ ఏజెన్సీ ఆరంభించాను. అదో కొత్త ప్రపంచం. అందులో ఓనమాలు తెలీవు. కానీ బెదరలేదు, చెదరలేదు. ఒక్కో అంశం నేర్చుకుంటున్న కొద్దీ నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. నేను నిలదొక్కుకుని మరికొందరికి అండ కాగలిగాను. ఆ తెగువతోనే ఇంకేదైనా చేయాలనిపించింది. సమీప బంధువుతో కలిసి నూనె మిల్లు ప్రారంభించాను. అది కూడా విజయవంతమైంది. రూ. కోట్ల టర్నోవర్‌తో ఉత్సాహం రెట్టింపైంది. 15 గేదెలు కొని పాలకేంద్రం కూడా మొదలుపెట్టాను. ఇవాళ 30 మందికి ఉపాధి ఇవ్వగలిగాను. అంతా సాఫీగా సాగితే ఇక లేనిదేముంది?! నా వ్యాపార భాగస్వామి నారాయణ్‌ ఘూజే కరోనాతో చనిపోయాడు. చాలా పెద్ద దెబ్బే.. అయినా తట్టుకున్నాను. ఆ బాధ్యతను మా అబ్బాయే చూసుకుంటున్నాడిప్పుడు. ఇదంతా చేస్తున్నానంటే నా గొప్పతనం కాదు. ఇందులో ఎందరిదో సహకారం ఉంది.

నా జీవితాన్ని నెమరేసుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే... యోధులు మరణించినప్పుడు అందరూ గౌరవం చూపిస్తారు, వాళ్ల భార్యల పట్ల సానుభూతి కురిపిస్తారు. కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది? దాంతో బతకలేరుగా! కనుక మన ఆలోచనా సరళి మారాలి. వాళ్లకి చేయూతనివ్వాలి. ఉపాధిమార్గం చూపాలి. ఆర్థిక స్వాతంత్య్రం కదా ముఖ్యం?! ప్రభుత్వ ఉద్యోగాల్లో సైనికులకు రిజర్వేషన్‌ ఉంది. అందులో ఒక్క శాతమైనా వాళ్ల భార్యలకు కల్పిస్తే వాళ్లకో భరోసా ఉంటుంది. అదీ అసలైన గౌరవం, సిసలైన సానుభూతి’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్