రాకెట్‌ని ప్రయోగించాక... పిల్లల్లా ఎదురుచూస్తాం

శాస్త్ర సాంకేతిక రంగాలు మగవాళ్లకే అన్న అభిప్రాయం ఉంటుంది చాలామందిలో! అందుకే అమ్మాయిలు ఆ రంగంలోకి ప్రవేశించడానికి వెనకాడుతుంటారు. కానీ కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు.. దీనిలోనూ రాణించొచ్చు అంటున్నారు తేన్మొళి సెల్వి.

Updated : 08 Dec 2022 04:29 IST

శాస్త్ర సాంకేతిక రంగాలు మగవాళ్లకే అన్న అభిప్రాయం ఉంటుంది చాలామందిలో! అందుకే అమ్మాయిలు ఆ రంగంలోకి ప్రవేశించడానికి వెనకాడుతుంటారు. కానీ కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు.. దీనిలోనూ రాణించొచ్చు అంటున్నారు తేన్మొళి సెల్వి. ఇస్రో తాజాగా ఒకే రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. వీటిలో మన దేశానికి చెందిన ఓషన్‌శాట్‌-3 ఒకటి. ఈ ఉపగ్రహ రూపకర్త ఈవిడే! వసుంధర పలకరించగా.. తన ప్రయాణాన్ని చెప్పుకొచ్చారిలా..

ఏదైనా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసి, దాన్నుంచి సత్ఫలితాలు సాధించినప్పుడు ఆ ఆనందమే వేరు. తమిళ నాడులోని కరిసెరి అనే పల్లెటూరు మాది. అమ్మ మీణమ్మాల్‌ రైతు. నాన్న కల్లిప్పన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో లైన్‌మెన్‌. ఆయన ఉద్యోగరీత్యా శివకాశిలో స్థిరపడ్డాం. చిన్నతనం నుంచీ తరగతిలో నేనే ఫస్ట్‌. నాన్నకి సాంకేతికత అన్నా, రాకెట్లు, శాటిలైట్లు అన్నా ఆసక్తి. పత్రికల్లో వాటి గురించి వార్తలొస్తే ఉత్సాహంగా చదివి వినిపించేవారు. ఆయన్ని చూసే నాకూ వీటిపై ఆసక్తి కలిగింది. అది పెరిగి పెద్దదై అంతరిక్ష పరిశోధనల్లోకి వెళ్లాలనేంతగా ఇష్టం పెరిగింది. అందుకే ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశా. అప్పుడే ఇస్రో నోటిఫికేషన్‌ విడుదలైంది. వెంటనే దరఖాస్తు చేశా. మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యా. బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో ఉద్యోగంలో చేరా. ఈ పాతికేళ్లలో ఎన్నో హోదాల్లో పనిచేశా. ఎన్నో ఉపగ్రహాలను డిజైన్‌ చేశా. హై రెజల్యూషన్‌ కార్టోగ్రాఫిక్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌కు అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. కార్టో-2ఇ, కార్టో-2ఎఫ్‌, కార్టో-3 వంటి ఎన్నింటినో విజయవంతంగా పూర్తి చేశాం. ప్రస్తుతం ఓషన్‌ శాట్‌-3, 3ఎలకు డైరెక్టర్‌ని.

కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేసి, వాటిని ఎన్నో దశల్లో పరీక్షించాకే ప్రయోగానికి సిద్ధమవుతాం. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాక, పరీక్ష తర్వాత ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థిలా ఉంటుంది మా పరిస్థితి. అది విజయవంతమైనట్లు సమాచారం మానిటర్‌ తెరపై కనిపిస్తే.. అదే మా జీవితాల్లో అత్యుత్తమ క్షణం. ఆ స్ఫూర్తితో మరిన్ని సవాళ్లకు సిద్ధమై పోతుంటాం. ఓషన్‌శాట్‌-3 తయారీకి రేయింబవళ్లు శ్రమించాం. అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపిన 17 నిమిషాల తర్వాత నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించినట్లు సంకేతాలు అందాయి. ఆ క్షణంలో నా ఆనందానికి అవధుల్లేవు. అందరి నుంచీ ఎన్నో ప్రశంసలు! ఇస్రో అధిపతి నన్ను పిలిచి ఆ ఉపగ్రహ తయారీ గురించి మాట్లాడమన్నారు. 25 ఏళ్ల వృత్తి జీవితంలో ఇదో కొత్త అనుభవం. మావారు యూఏ నటరాజన్‌. ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌లో చేసేవారు. 2001లో చనిపోయారు. ఆయన లేని బాధను దిగమింగుకుంటూ పనిలో నిమగ్నమయ్యా. పనినీ, కుటుంబ బాధ్యతల్ని సమన్వయం చేస్తూ వచ్చా. మాకో అమ్మాయి. స్వీడన్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. ఇల్లు, పని ఇవే నా వ్యాపకాలు. మొదట్నుంచీ ఇస్రోపై వల్లమాలిన అభిమానం. అందుకే ప్రతిరోజునీ ఆస్వాదిస్తా. బృందానికి ఎప్పుడూ అందుబాటులో ఉండటం, ముందుండి నడిపించడం, సమన్వయం చేయడంలో తెలియని ఆనందం, సంతృప్తి. పైగా ఇక్కడ ఆడా, మగా తేడా ఉండదు. వివక్షకు తావుండదు. ప్రతిభ ఉంటే చాలు.. కావాల్సినంత ప్రోత్సాహం ఉంటుంది.


అమ్మాయిలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు. కుటుంబాన్ని చూసుకుంటూనే ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే సాంకేతికత వైపు దృష్టిసారిస్తున్న వారి సంఖ్య ఇప్పటికీ తక్కువే. రాణించలేమేమో అన్న భయమే ఇందుకు కారణం. నా సలహా ఒక్కటే. శ్రమించే స్వభావం ఉంటే చాలు. దీనిలోనూ రాణించగలరు. కష్టమనుకోకుండా, ధైర్యం చేసి ప్రయత్నించి చూడండి చాలు.

- కల్లిపూడి దేవేంద్ర రెడ్డి, శ్రీహరికోట



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్