అత్తాకోడళ్ల ఆనందమే లక్షలుగా...

కోడల్ని రాచి రంపాన పెట్టే అత్త.. అత్తను సాధించే కోడలు.. ఇంటిని పట్టించుకోని ఇల్లాలు.. ఎప్పుడూ ఇవేనా! అత్తాకోడళ్లు స్నేహంగా ఉంటే ఎలా ఉంటుంది? గిల్లి కజ్జాల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు.. ఇలా ఇంటింటి కథలను సరదా సంభాషణలతో చిన్న వీడియోలుగా చూపిస్తున్నారు మాడిశెట్టి కవిత, సుగుణ, సుందరి.

Updated : 11 Dec 2022 04:12 IST

కోడల్ని రాచి రంపాన పెట్టే అత్త.. అత్తను సాధించే కోడలు.. ఇంటిని పట్టించుకోని ఇల్లాలు.. ఎప్పుడూ ఇవేనా! అత్తాకోడళ్లు స్నేహంగా ఉంటే ఎలా ఉంటుంది? గిల్లి కజ్జాల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు.. ఇలా ఇంటింటి కథలను సరదా సంభాషణలతో చిన్న వీడియోలుగా చూపిస్తున్నారు మాడిశెట్టి కవిత, సుగుణ, సుందరి. ‘కవిరాజ్‌ ఫ్యామిలీ వీడియోస్‌’తో లక్షల మంది మనసులు దోచిన మూడు తరాల అత్తాకోడళ్లని వసుంధర పలకరించింది. వాళ్ల ప్రయాణాన్ని కవిత వివరించారిలా...

మాది కాకినాడ జిల్లా పెద్దాపురం. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మావారు ఫణిరాజ్‌ మేనమామ కొడుకే! ఎం.కాం. చదివా.. నాన్న అనారోగ్యం, పిల్లల కోసమని ఉద్యోగావకాశాలు వచ్చినా చేయలేదు. అప్పట్లో వసుంధర ఆధ్వర్యంలో మగ్గం వర్క్‌, అల్లికలు, పెయింటింగ్‌ల్లో శిక్షణిస్తోంటే చేరా. మావాటికి నేనే వర్క్‌ చేస్తుంటా. లాక్‌డౌన్‌లో మావారు, పిల్లలు సరదాగా కామెడీ వీడియోలు చేసి, టిక్‌ టాక్‌లో పెట్టేవారు. నెల రోజుల్లోనే పదిలక్షల మంది అనుసరించారు. అదేమో బ్యాన్‌ అయ్యింది. తిరిగి ఆఫీసులు ప్రారంభం అవడంతో మా ఆయనిక వాటిని పట్టించుకోలేదు. ఓసారి పిల్లలు.. నాకు, మా అత్తగారికీ మధ్య జరిగే సరదా సంభాషణల్ని వీడియో తీసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. వారం రోజుల్లోనే మంచి స్పందన వచ్చింది. మావారికి చూపించా... కామెంట్స్‌ సానుకూలంగా ఉండటంతో ప్రోత్సహించారు. ఆయనే కాన్సెప్ట్‌, సంభాషణలు రాసిచ్చేవారు. ఆయన రాత్రి ఇంటి కొచ్చాక వీడియో చేస్తాం. ఎడిటింగ్‌, క్యాప్షన్‌ వంటివన్నీ నేనే చేసుకుంటా!


ఆపేద్దామనుకున్నాం..

అత్తగారి ఆరోగ్యరీత్యా అన్నీ ఇంట్లోనే చేస్తుంటాం. మావారితోనూ కొన్ని  సరదా రీల్స్‌ చేశాం. ఆయన చాలా బిజీ. పోనీ ఆపేద్దామా అనుకొన్నా. వీక్షకులు పెరుగుతోంటే మనస్కరించలేదు. అత్తాకోడళ్లను విరోధుల్లా చూపిస్తుంటారు. కానీ వాళ్లు కలిసుంటే ఇల్లెంత ఆనందంగా ఉంటుందో చూపించాలనుకున్నాం. అవి చాలామందికి చేరువయ్యాయి. అప్పుడే మా బామ్మ (అత్తగారికి అత్త) మా దగ్గరి కొచ్చారు. కోడళ్లను ఇబ్బంది పెట్టేవాళ్లకు ఒకప్పుడు మీరూ కోడలే అన్న సత్యం గుర్తు చేయాలనిపించింది. వాళ్లకు కనువిప్పు కలిగించే అంశాలపై దృష్టి పెట్టాం. వీటితో స్పందన పెరిగింది. 44కోట్లకు పైనే వీక్షణలొచ్చాయి. ఎంతో మంది అత్తాకోడళ్లు తమ ఆవేదనను కామెంట్లలో పంచుకుంటుంటారు. మావాళ్లకు కనువిప్పు కలిగేలా చేయడంటూ కోరుతుంటారు కూడా. ‘మీ వీడియోలు చూశాక మా అత్తగారు/ కోడలు మారింది. థాంక్స్‌’ అని పెడుతుంటారు. అవి చదివినప్పుడు కొందరిలోనైనా మార్పునకు కారణమైనందుకు ఆనందంగా ఉంటుంది.


కత్తిమీద సామే!

మావన్నీ తక్కువ నిడివి వీడియోలే! సెకన్ల వ్యవధిలో సందేశమంటే కత్తిమీద సాము లాంటిదే. చాలా కసరత్తు చేస్తాం. 9 నెలల్లోనే 4 లక్షల ఫాలోయర్లు వచ్చారు. ఎక్కడికెళ్లినా గుర్తుపట్టి అభినందిస్తున్నారు. సెల్ఫీలు అడుగుతోంటే ‘స్టార్‌’ భావన కలుగుతుంది. కాళేశ్వరం వెళ్లినప్పుడు ఏకధాటిగా 200 మందికి సెల్ఫీలిచ్చాం. అత్తయ్య, బామ్మ మొదట్లో కెమెరా ముందుకు రావడానికే భయపడ్డారు. మాకెందుకు ఇవన్నీ.. బంధువులు ఏమైనా అంటారేమో అన్నారు. రెండే వీడియోలు చేద్దాం..

నచ్చక పోతే వదిలేద్దామన్నా. అవి పెట్టాక బంధువులు ఫోన్లు చేసి మరీ మెచ్చుకున్నారు. ఆ ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు. కుటుంబమంతా ఆస్వాదించేలా ఉండాలన్నది మా కోరిక. పెద్దలతో పిల్లలు నడుచుకోవాల్సిన తీరుపై వీడియో చేస్తే ఎంత మంది ఉపాధ్యాయులు మెచ్చుకున్నారో. ఇతర మీడియా అవకాశాలొస్తున్నాయి.. కానీ ఒప్పుకోలేదు. వాణిజ్య ప్రకటనల కోసమూ సంప్రదించారు. ఇప్పటివరకూ నెగెటివ్‌ కామెంట్స్‌ ఎరుగం. అది గర్వంగా అనిపిస్తుంది. మావారు, పిల్లల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది.

- భూపతి సత్యనారాయణ, హైదరాబాద్‌


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్