పిల్లల కోసం మొదలుపెడితే...

తమ పిల్లలకు సహజ రుచులతో ఉండే ఆరోగ్యకరమైన చిరుతిళ్ల కోసం ఈ స్నేహితులిద్దరూ తిరగని దుకాణం లేదు. గింజధాన్యాలతో చేసే స్నాక్స్‌ చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని వీరిద్దరికీ వచ్చిన ఆలోచనే.. ఇప్పుడు వేలమంది తల్లుల మనసు దోచుకుంది.

Updated : 11 Dec 2022 04:44 IST

తమ పిల్లలకు సహజ రుచులతో ఉండే ఆరోగ్యకరమైన చిరుతిళ్ల కోసం ఈ స్నేహితులిద్దరూ తిరగని దుకాణం లేదు. గింజధాన్యాలతో చేసే స్నాక్స్‌ చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని వీరిద్దరికీ వచ్చిన ఆలోచనే.. ఇప్పుడు వేలమంది తల్లుల మనసు దోచుకుంది. స్నాక్స్‌ తయారీని చిరువ్యాపారంగా ప్రారంభించి, రూ.లక్షల్లో వార్షికాదాయాన్ని అందుకొంటున్న ఆంచల్‌ అబ్రోల్‌, ప్రియా పూరిల స్ఫూర్తి కథనమిది.

సహజసిద్ధమైన పదార్థాలతో చేసే చిరుతిళ్లు రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయని నమ్ముతారు ఆంచల్‌, ప్రియా పూరి. మార్కెట్‌లో దొరికేవి తీసుకున్నప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రభావితం కావడం వీరిద్దరూ గమనించారు. దీంతో తమ పిల్లల కోసం స్నాక్స్‌ సొంతంగా తయారు చేసేవారు. వాటిని తెలిసిన వారికీ ఇవ్వడం మొదలుపెట్టారు. వాటి రుచికి చిన్నారులతో పాటు పెద్దలూ ఫిదా అయ్యేవారు. స్నేహితుల ప్రశంసలతో దీన్నే వ్యాపార మార్గంగా ఎందుకు మార్చుకోకూడదూ అని ఆలోచించారీ స్నేహితులు. తర్వాత ఈ తరహా వంటకాలు చేయడంలో అనుభవం ఉన్నవారిని కలిసి మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. దుకాణాల్లో ఇవి ఎలా అమ్ముడవుతాయో అధ్యయనం చేశారు. ఏయే ప్రాంతాల్లో ఎటువంటివి ఎక్కువగా సేల్‌ అవుతాయో కూడా పరిశీలించి, ఆ తర్వాత 2019లో ‘స్నాకరీ’ బ్రాండ్‌ని ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా..

సమోసా లేదా కచోరీ.. ఏది చేసినా అందులో ఆరోగ్యకరమైన గింజధాన్యాలు లేదా ఆకుకూరలు వంటివి కలిపి చేయాలంటారీ మిత్రద్వయం. ‘చిన్నప్పుడు నానమ్మ, అమ్మమ్మ చేసే వంటకాలు నిండైన ఆరోగ్యాన్ని అందించేవి. అప్పట్లో ఏది వండినా రకరకాల పప్పులనూ కలిపే వారు. పైగా అవి సేంద్రియపద్ధతిలో పండించేవి కావడంతో ఏ అనారోగ్యాలూ వచ్చేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. నూనె నుంచి పిండి వరకూ అన్ని పదార్థాల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. దీంతో చిన్నాపెద్దా తేడాలేకుండా అందరికీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతోంది. ఈ సమస్యల్లేకుండా చేయాలనే ‘స్నాకరీ’ ప్రారంభించాం. మొదట రెండుమూడు రకాల స్నాక్స్‌ తో మొదలుపెట్టాం. వాటిని మార్కెట్లో అలవాటు చేయడానికి దాదాపు ఏడాది పట్టింది. కొత్త బ్రాండ్‌ కావడంతో ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. రుచి చూపించి నచ్చితేనే తీసుకోమనే వాళ్లం. మేం వాడే ఆర్గానిక్‌ పదార్థాల గురించి వివరించే వాళ్లం. మైదా స్థానంలో గోధుమ పిండి వినియోగించడం, నూనెలో వేయించకుండా దాదాపు అన్నింటినీ బేక్‌ చేసే విధానాలను చెప్పాం.  అలా మెల్లగా, వీటి రుచి, నాణ్యతలను వినియోగదారులకు చేర్చగలిగాం. రెండేళ్లలోనే మా వంటకాలు 35కు పెరిగాయి. మేం చేస్తున్న క్లాసిక్‌, బేక్డ్‌ స్నాక్స్‌, రోస్టెడ్‌ స్నాక్స్‌, సాస్‌లు, డిప్స్‌ వంటివి అన్ని వయసుల వారికీ నచ్చుతున్నాయి. ఇవన్నీ ఆరు నెలలు నిల్వ ఉంటాయి. ఇందుకు ఎలాంటి రసాయనాలూ వాడం. దుకాణాలకు పంపిణీతోపాటు ఆన్‌లైన్‌ ఆర్డర్లకూ సరఫరా చేయగలుగుతున్నాం. ఇప్పుడు మాకు దేశవ్యాప్తంగా 50వేల మందికిపైగా వినియోగదారులున్నారు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాం’ అని చెప్పుకొస్తున్నారీ ముంబయి మామ్స్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్