ఓటమే వ్యాపారాన్ని చూపించింది...!

జీవితంలో అనుకున్నవి సాధించలేకపోయామని కుంగిపోయే వారే ఎక్కువ. లేదంటే సర్దుకుపోతారు.

Updated : 12 Dec 2022 07:13 IST

జీవితంలో అనుకున్నవి సాధించలేకపోయామని కుంగిపోయే వారే ఎక్కువ. లేదంటే సర్దుకుపోతారు. కానీ, వైఫల్యాలనే పాఠాలుగా మలుచుకుని అవకాశాల్ని సృష్టించుకునే వారు తక్కువే. అలాంటి వ్యక్తుల కోవలోకే చెందుతారు తిరుపతికి చెందిన డాక్టర్‌ ఎ.శ్రీదేవి. సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడిగా... ప్రకృతే ముడిసరకుగా... తన ఇంటినే ప్రయోగశాలగా మలుచుకుని వినూత్న వ్యాపారంలో దూసుకుపోతున్నారు. ఆమె వసుంధరతో చెప్పిన సంగతులివి.

వకాశాలు రావడం లేదని బాధపడుతూ కూర్చున్నా, వచ్చిన అవకాశం అనుకూలంగా లేదని కుంగిపోయినా... జీవితం అక్కడే ఆగిపోతుంది. అందుకే ఓటమి నుంచి కలిగే బాధనే పంతంగా మార్చుకున్నా. మాది గుంటూరు. మధ్యతరగతి కుటుంబం. నాన్న రైల్వేలో పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. అమ్మ గృహిణి. అధ్యాపక వృత్తిలో స్థిరపడాలన్నది నా చిన్ననాటి కోరిక. 2007లో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో మైక్రోబయాలజీలో ‘బయో ఇథనాల్‌ తయారీలో ఎంజైమ్స్‌ పాత్ర’పై పీహెచ్‌డీ చేశా. మరుసటి ఏడాది తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నెలకు రూ.18 వేల వేతనానికి టీచింగ్‌ అసిస్టెంట్‌గా చేరా. 2013లో దాన్ని రూ.15 వేలకు కుదించారు. బాధ్యతలు పెరిగే కొద్దీ ఆ మొత్తం సరిపోయేది కాదు. దాంతో డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేశా. ఇంటర్వ్యూలో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదంతా మొదట్లో కాస్త బాధ కలిగించినా... ఏదో సాధించాలన్న పంతాన్ని మాత్రం పెంచింది.

అదే నా తొలి విజయం...

ఉద్యోగానికి రాజీనామా చేశా. రాత్రింబవళ్లూ కష్టపడి చదివి అదే విశ్వవిద్యాలయంలో అయిదేళ్లకు గాను రూ.33 లక్షల ఉపకారవేతనంతో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ సాధించా. ఈ మొత్తాన్నీ నెలకు రూ.55 వేల చొప్పున ఇస్తారు. అప్పుడే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నా. నా భర్త కూడా ప్రోత్సహించారు. అలా 2019లో వ్యాపారంలోకి అడుగుపెట్టా. ఇది చేపలు, రొయ్యలకు ఉపయోగపడే పోషకాలు, చేపల చెరువుల్లోని వ్యర్థాలను శుద్ధి చేసే బ్యాసిల్లస్‌ అనే బ్యాక్టీరియాను అభివృద్ధి చేసే ప్రాజెక్టు. దీన్ని కేంద్ర పరిశోధన సంస్థ డీఎస్‌టీ స్వనిధి ప్రయాస్‌ ద్వారా సంపాదించా. నేను చదివిన మైక్రోబయాలజీకి సంబంధించిన సబ్జెక్టు కావడంతో చొరవగా ముందడుగు వేశా. నెల్లూరు జిల్లాలో ఈ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించింది. ఇది నా తొలి విజయం.

వ్యర్థాల నిర్వహణతో...

నెల్లూరు నుంచి తిరుపతికి తరచూ వెళ్లొస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో రహదారికి ఇరువైపులా ఉన్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కర్మాగారాల దగ్గర దుర్వాసన వచ్చేది. ఎందుకిలా జరుగుతోందా అని ఓ మామిడి జ్యూస్‌ కర్మాగారానికి వెళ్లి పరిశీలించా. రసం తీసిన మామిడి టెంకలు, తొక్కలను ఒక్కచోటే నిల్వ చేయడం వల్ల వచ్చిన సమస్య అని గుర్తించి... అలా రాకుండా వారికి సూచనలు చేశా. టెంకలు, తొక్కల నుంచి కారుతున్న ద్రావణంపై పరిశోధనలు చేశా. ఆ దుర్వాసనను అరికట్టి టెంకలను శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువుగా మార్చగలిగా.

20 లక్షల ప్రాజెక్టు...

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25కు పైగా మామిడి కర్మాగారాలున్నాయి. వీటి నుంచి సీజన్‌కు 400 టన్నుల వరకు వ్యర్థాలు వస్తుంటాయి. టొమాటో, బొప్పాయి, కర్బూజ, అరటి వంటివీ ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. వాటి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో ట్రీట్మెంట్‌ చేస్తే ఆ కర్మాగారాల దగ్గర వాతావరణ, జల కాలుష్యాన్ని నియంత్రించొచ్చు. మంచి పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువులను తయారు చేయచ్చనే ఆలోచన వచ్చింది. కేంద్ర వ్యవసాయశాఖ వ్యవసాయాధారిత అంకుర సంస్థల ఏర్పాటు, అభివృద్ధికి గ్రాంటు రూపంలో ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిసింది. వెంటనే తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలను సంప్రదించా. వారు కొద్దిపాటి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత అంకుర సంస్థల ప్రతిపాదన పోటీలో నెగ్గి రూ.20 లక్షల గ్రాంటు అందుకున్నా. ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే.. వ్యవసాయ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కర్మాగార వ్యర్థాల ట్రీట్మెంట్‌ ద్వారా ఏడుగురికి ఉపాధి కల్పిస్తూ, పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నా. మా వారు డాక్టర్‌ జి. నరసింహ. ఎస్వీయూ వైరాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. మాకు ఒక పాప లక్ష్మీహారిక. పదో తరగతి చదవుతోంది.

పసుపులేటి వేణుగోపాల్‌, తిరుపతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్