పులుల కోసం.. అడవిని పెంచుతున్నారు!

సరోజినీ మోండల్‌కి తన పిల్లల గురించే బెంగ. మూడేళ్ల క్రితం ఆమె భర్త శంభు సుందర్‌బన్‌ మడ అడవులకు వెళ్లాడు.

Published : 12 Dec 2022 00:01 IST

* సరోజినీ మోండల్‌కి తన పిల్లల గురించే బెంగ. మూడేళ్ల క్రితం ఆమె భర్త శంభు సుందర్‌బన్‌ మడ అడవులకు వెళ్లాడు. అక్కడ బెంగాల్‌ టైగర్ల సంచారం పెరిగింది. పీతల కోసం వెళ్లిన శంభు పులి నోటికి చిక్కాడు. గాయాలతో బయటపడ్డా కొద్దిసేపటికే చనిపోయాడు.


* సరోజినీ పరిస్థితీ అంతే! పనిమీద అటవీ ప్రాంతానికి వెళ్లిన తన భర్తపై పులి దాడి చేసింది. శవం కూడా దొరకలేదు.


2016 నుంచి ఆ ప్రాంతంలో పులుల దాడుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య దాదాపు 750. ఇది అధికారిక సంఖ్యే! ఆ లెక్కలోకి రానివారు ఇంకెంతమందో!

పశ్చిమ్‌ బంగాలోని సుందర్‌బన్‌ డెల్టా ప్రాంతం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా నీటిశాతం తగ్గి నేల పొడిబారుతోంది. దీంతో పీతలు పట్టడానికని చాలామంది మగవారు వెళుతుంటారు. వాళ్లకది ప్రధాన ఆదాయ వనరు కూడా. ఈ క్రమంలోనే పులిబారిన పడుతున్నారు. ఇలా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షలు పరిహారం అందిస్తోంది. అయితే వాళ్లు చనిపోయినట్లుగా ధ్రువీకరించే ఆధారాలు చూపించడమే కష్టమవుతోంది. కారణం.. ఇన్ని వందల మంది చనిపోయినా మృతదేహాలు దొరికింది ముగ్గురివే! పైగా ఆ ఇచ్చే మొత్తం వాళ్లకు సరిపోవు కూడా. కుటుంబంలో మరొకరిని అలా ఎక్కడ పోగొట్టుకుంటామో అన్నది వాళ్ల భయం. అలాగని పులులను మాత్రం వారు నిందించరు వాళ్లు. ఎందుకంటే.. ఏళ్ల క్రితం వంట చెరకు, కలప కోసమని మడ అడవుల్ని విపరీతంగా నరికేశారు. వరుస సైక్లోన్‌లు కూడా ఇక్కడి వృక్ష, జంతుజాలాలు తగ్గిపోవడానికి కారణమయ్యాయి. అందుకే ఆహారం దొరక్క పులులు మానవాళిపై దాడిచేస్తున్నాయి. కాబట్టి, వాటిని నిందించి ఫలితం లేదనుకున్నారు అక్కడి మహిళలు. బదులుగా పరిష్కారం చూపాలనుకున్నారు.

ఇంతకీ ఏం చేస్తున్నారు?

‘అడవుల్ని పునరుద్ధరించడం’.. వీరికి దొరికిన పరిష్కారం. కొన్ని ఎన్‌జీఓలూ వీరికి తోడయ్యాయి. అయిదు కోట్ల మొక్కల్ని నాటాలని సంకల్పించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వమూ దీన్నో ప్రాజెక్టుగా తీసుకొచ్చింది. ‘మా శక్తికొద్దీ మొక్కలు పెంచుకుంటూ వెళితే పులులూ అడవుల్లోనే ఉండిపోతాయి. అప్పుడు మా మగవాళ్లకు ప్రాణహాని ఉండదు’ అని ఆనందంగా చెబుతున్నారు అక్కడి మహిళలు. విత్తనాలను కుండీల్లో విత్తి, మొక్కలు కాస్త పెద్దయ్యాక నాటుతున్నారు. ఇప్పటికే నాటే ప్రక్రియ మొదలైంది. త్వరలోనే ఇవి పెరిగి, తమ జీవితాలకు రక్షగా మారతాయన్నది వాళ్ల ఆశ. అది నెరవేరాలని మనమూ కోరుకుందామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్