చెప్పండి... వింటా!

యవ్వనం ఎంతో అందమైన సమయం. జాగ్రత్తగా కనిపెట్టాల్సిన వయసు కూడా. శరీరంలో, మానసికంగా వచ్చే మార్పులు ఎన్నో! ప్లిలలు వాటిని పంచుకోలేరు.

Updated : 15 Dec 2022 02:55 IST

యవ్వనం ఎంతో అందమైన సమయం. జాగ్రత్తగా కనిపెట్టాల్సిన వయసు కూడా. శరీరంలో, మానసికంగా వచ్చే మార్పులు ఎన్నో! ప్లిలలు వాటిని పంచుకోలేరు.. చెబుదామన్నా వినేవారుండరు. ఫలితమే మానసిక సమస్యలు. వారి సమస్యలను విని, సరైన మార్గంలో నడిపిస్తున్నారు ఉలగమ్మాల్‌.

మెకు పదినెలల వయసులో పోలియో సోకింది. ఒక చేయి, కాలు పడిపోయాయి. చుట్టూ ఉన్నవారి జాలి చూపులు, తోటివారి హేళనల మధ్యే పెరిగారు. కానీ తల్లిదండ్రులు ఆవిడని ప్రోత్సహించారు. చికిత్స ఇప్పించడంతో పాటు పెద్ద చదువులు చదివేలా ప్రోత్సహించారు. నెమ్మదిగా నడవడం మొదలుపెట్టారు. పూర్తిగా చదువుపై దృష్టిపెట్టారు. వీళ్లది తమిళనాడులోని తిరునెల్‌వెలి. నాన్నకి ప్రైమరీ స్కూలుండేది. తనకు 20 ఏళ్లు వచ్చేనాటికే పేదపిల్లలకు ఉచితంగా చదువు చెప్పేవారు. ఆ సమయంలోనే ఎదుటివాళ్ల కష్టాలు ఓపిగ్గా వినడం, ఆవిడకు తోచిన సాయం చేసేవారు. దీంతో స్నేహితుల్లో, చుట్టుపక్కల వారిలో మంచి పేరొచ్చింది.

ఎంకాం, ఎంఫిల్‌, కౌన్సెలింగ్‌ అండ్‌ సైకోథెరపీలో ఎంఎస్‌సీ చేసి, చెన్నైలో ప్రముఖ ఐఏఎస్‌/ ఐపీఎస్‌ అకాడమీలో బోధకురాలయ్యారు. 14 ఏళ్లు పనిచేశాక యువతరం ఇబ్బందుల్ని చూసి, వారికి సాయపడాలనుకున్నారు. ‘టీనేజీలోకి రాగానే వాళ్లని పెద్ద పిల్లలుగా భావించేస్తాం. వాళ్లకి అన్నీ తెలుసన్న భావనలో ఉంటాం. కానీ వాళ్లేమో శరీరక, మానసిక పరంగా వచ్చే మార్పులతో గజిబిజిలో పడిపోతారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే నలిగి పోతుంటారు. తమకంటూ ఎవరూ లేరన్న ధోరణిలోకి వెళ్లిపోయి ఒత్తిడికి గురవుతారు. మానసిక సమస్యల బారినా పడతారు. వాళ్ల సమస్యలు వింటూనే భావోద్వేగాలపై పట్టు, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతో పాటు సమస్యా పరిష్కారం, ఇతరులతో ప్రవర్తించే తీరు వంటి వాటిపై శిక్షణిస్తుంటా. వాళ్లకి ఇది చేయమని చెప్పడం కాదు. వాళ్లకేం కావాలో తెలుసుకొని దాని ప్రకారం పరిష్కారం సూచిస్తా. మొత్తంగా స్వీయ బాధ్యతను తెలిసేలా చేస్తా’నంటారు 56 ఏళ్ల ఉలగమ్మాల్‌. ఇప్పటివరకూ 200 పాఠశాలల్లో 30 వేలకుపైగా మందికి శిక్షణిచ్చారావిడ. యవ్వనంలోకి అడుగు పెట్టిన పిల్లలపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకీ సమాన బాధ్యత ఉంటుంది. వాళ్లని కనిపెట్టుకొని ఉంటూనే అవసరమైన సాయం చేయగలిగితే వాళ్లని విజయపథాన నడిపించొచ్చు అంటారీవిడ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్