ఈ నానమ్మ అభిమానులు 32 లక్షలు!

వీధి కన్నెరగని ఇల్లాలావిడ. ఓ వ్యాపకంగా.. ఈ తరానికి కొన్ని విలువలు పరిచయం చేద్దామని యూట్యూబ్‌లోకి వచ్చారు. తన అనుభవాలనే వీడియోలుగా మలిచారు.

Updated : 18 Dec 2022 07:44 IST

వీధి కన్నెరగని ఇల్లాలావిడ. ఓ వ్యాపకంగా.. ఈ తరానికి కొన్ని విలువలు పరిచయం చేద్దామని యూట్యూబ్‌లోకి వచ్చారు. తన అనుభవాలనే వీడియోలుగా మలిచారు. అవి ఆవిడను 30 లక్షల మందికి చేరువ చేసింది. ఆవిడే.. చిన్నూ ఆంటీ వురఫ్‌ భ్రమరాంబ ఆంటీ. వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకున్నారిలా..

ల్లు, కుక్క పిల్లలు, మొక్కల పెంపకం.. ఇదే నాలోకం. ఏ సందేహమొచ్చినా యూట్యూబ్‌లో వెదికేస్తా. అలా దానికి చేరువయ్యా. నా అసలు పేరు విజయ లక్ష్మి. మాది అనంతపురం. మావారు జీఏ రామచంద్ర కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేశారు. ఆయనది ఉమ్మడి కుటుంబం. నేనే పెద్ద కోడల్ని. బాధ్యతలతో తీరికుండేది కాదు. కనీసం టీవీ ఎరుగనంటే నమ్ముతారా? ఇంటి పని, కాలక్షేపానికి ఫోన్‌లో పాటలు.. ఇదే నాలోకం. మావారు 2018లో చనిపోయారు. అది నాకో పెద్ద దెబ్బ. పిల్లలు మౌనిక, రఘు వినోద్‌.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలతో బిజీ. యూట్యూబ్‌లో వంటలు, మొక్కల పెంపకం చూడటం, వాటిని ప్రయత్నించడం చూసి.. పిల్లలు ‘నువ్వే ఛానెల్‌ పెట్టొచ్చుగా’ అన్నారు. నిజానికి 2015లోనే ఖాతా తెరిచా. నా వంటల వీడియోలనూ పెట్టేదాన్ని. అయితే అవి నాకు మాత్రమే కనిపించేలా పోస్ట్‌ చేశా. పిల్లల ప్రోత్సాహంతో కొన్ని రాయలసీమ రుచుల వీడియోలు చేశా. ఎడిటింగ్‌, క్యాప్షన్‌ పెట్టడం వంటివన్నీ మా అమ్మాయి చూసుకుంటుంది.

నా అనుభవాలే..

‘వంటలే కాదు, నీ అనుభవాలనీ పంచుకోవచ్చు’ అంది మౌనిక ఓసారి. ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మల దగ్గర పిల్లలు పెరగడం అరుదు. వాళ్లకి కుటుంబ ప్రేమలు, విలువలు నేర్పాలనుకున్నా. ఉదాహరణలతో చెప్పొచ్చని అమ్మా-కొడుకు, నానమ్మ- మనవడు, మనవరాలు.. సిరీస్‌లు ప్రారంభించా. ఇవన్నీ నా జీవితానుభవాలు, ఎదుర్కొన్న ఇబ్బందులే.. కాకపోతే సందేశాన్నీ జోడిస్తున్నా. కొద్దిరోజుల్లోనే మంచి స్పందన వచ్చింది. రెండు నెలల్లోనే 10 లక్షల మంది అనుసరించారు. అందరూ పెద్దమ్మ, అమ్మ, ఆంటీ, అమ్మమ్మ.. అంటూ బోలెడు మెసేజ్‌లు పెట్టేవారు. మొదటిరోజు కెమెరా ముందుకు రావడానికే భయపడ్డా. అలాంటిది లక్షలమంది ఇంట్లోని వ్యక్తిలా చూస్తోంటే చాలా సంతోషమేసింది. బయటికి వెళితే గుర్తుపట్టడం, సెల్ఫీలు అడగడం చేసేవారు.. ఇది ఒకవైపే! ‘హాయిగా ఇంట్లో ఉండొచ్చుగా.. ఈ వయసులో ఇవన్నీ అవసరమా’ అని చాలామంది చాలా మాటలనేవారు. ‘నీ బాధను ఎవరూ పంచుకోలేరు. దాన్నుంచి బయటపడటానికి నువ్వే ప్రయత్నించాలి. అందుకు ఇదో మార్గం! కాబట్టి, నీకు నచ్చింది చేయ’మన్న పిల్లలు, ఆప్తుల ప్రోత్సాహంతో కోలుకున్నా.

సాయం కూడా..

అంశాల ఎంపికలో మా అమ్మాయి సలహా తీసుకుంటా. సంభాషణలు, ఎంతమంది ఉండాలి అన్నవన్నీ నేనే చూసుకుంటా. ఒకసారి బాగుంది అనుకున్నాకే రికార్డు మొదలుపెడతాం. వీడియో అమ్మాయి తీస్తుంది. తను లేనప్పుడు వీడియోగ్రాఫర్‌ తీస్తాడు. ఇప్పటివరకూ 400 వీడియోలు చేశా. 32 లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. వీక్షణలు 260 కోట్లకు పైమాటే! సిల్వర్‌, గోల్డ్‌ ప్లే బటన్‌లూ అందుకున్నా. మావారికి సేవా గుణమెక్కువ. ఎవరికి సాయం కావాలన్నా ముందుండేవారు. ఏటా ఒక పేద విద్యార్థికైనా ఫీజు కట్టేవారు. అలా చదివి, ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లెందరో. ఈ వీడియోలు నాదైన శైలిలో నేను చేస్తున్న సేవ అనుకుంటా. ఇంకా అనాథ, వృద్ధాశ్రమాలు, అంధుల పాఠశాలలకూ ఆర్థికసాయం చేయడం ప్రారంభించా. నా ఛానెల్‌ పేరు ‘చిన్నూ6542’ రహస్యమేంటని చాలామంది అడుగుతుంటారు. అది నా ప్రపంచం. చిన్నూ నా కుక్కపిల్ల, ఆ సంఖ్య మావారి ఫోన్‌నంబరు చివరి అంకెలు, పిల్లల పుట్టినరోజులు. చాలా మంది ఆడవాళ్ల జీవితం ఇంట్లోనే గడిచిపోతుంది. కాస్త విశ్రాంతి దొరికాక ఏదైనా ప్రయత్నిద్దామంటే వెనక్కిలాగే వారే ఎక్కువ. మీకు ఏదైనా చేయాలనిపించిందా.. ‘వయసు’ పేరుతో ఆగిపోవద్దు. అదొక సంఖ్యే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్