టీచరమ్మలు..ట్రాఫిక్‌ సేవల్లో!

పిల్లల్ని తీర్చిదిద్ది, మంచి సమాజాన్ని తయారు చేయడంలో ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర! మహిళలకయితే మరి కాస్త ఓపిక ఎక్కువ.

Updated : 18 Dec 2022 05:37 IST

పిల్లల్ని తీర్చిదిద్ది, మంచి సమాజాన్ని తయారు చేయడంలో ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర! మహిళలకయితే మరి కాస్త ఓపిక ఎక్కువ. అలాంటి వాళ్లు పెద్దవాళ్లలో మార్పు తేలేరా? ప్రమాదాలపై అవగాహన కల్పించలేరా.. అని ఆలోచించారు ఆవడి పోలీస్‌ అధికారులు. ఆరుగురు ఉపాధ్యాయినులకు శిక్షణిచ్చి విధుల్లోకి పంపారు. వారిప్పుడు ఖాకీ దుస్తులు ధరించి కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారితో ‘వసుంధర’ మాట్లాడింది.
చెన్నై, చుట్టుపక్క కమిషనరేట్లలో ఈమధ్య కాలంలో ప్రమాదాలు పెరిగాయి. వీటిని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా తమిళనాడు ట్రాఫిక్‌ ఆర్గనైజేషన్‌ స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారిని ‘ట్రాఫిక్‌ వార్డెన్లు’గా తీర్చిదిద్దుతోంది. ఈ సంస్థ ప్రారంభించాక 22 ఏళ్లలో తొలిసారిగా మహిళల్నీ ఎంచుకున్నారు. అలా ఆవడి పరిధిలోని టీచర్లు.. రేఖా నాయక్‌, ఎ.సుశీలాదేవి, టి.రమ్య, ఎ.శాలి, ఎం.మలర్విళి, కాశీ కృష్ణకల్యాణి తొలిబ్యాచ్‌లో ఎంపికయ్యారు. వీళ్లంతా 38- 50ఏళ్ల మధ్య వారే. శిక్షణ పూర్తయ్యి 3నెలలుగా జీతం ఆశించకుండా సేవలందిస్తున్నారు. వారానికి 2గం. కేటయించాలన్నది నిబంధన. కానీ వీళ్లు ఏమాత్రం సమయం దొరికినా ట్రాఫిక్‌ చక్కదిద్దడంలో, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం 6.15గం.- 7.15గం., సాయంత్రం 6.30- రాత్రి 8.30గం. మధ్య షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

మార్పే.. గౌరవం

‘ట్రాఫిక్‌ పోలీసుల పని సులువయ్యేలా, ప్రజల్లో మార్పొచ్చేలా చేయడం మా విధి. యువతలో ప్రమాదాలపై అవగాహన తేవడానికి పాఠశాలల్లో, కాలేజీల్లో పలు కార్యక్రమాల్ని డిజైన్‌ చేశా’మంటారు 49ఏళ్ల మలర్విళి. ‘విధుల్లో ఉన్నప్పుడు వాహనదారులు మా సూచనలను పాటిస్తున్నారు. వాళ్ల క్రమశిక్షణ మాకో గౌరవమే! మా వల్ల కొంతమందిలో మార్పొచ్చినా సంతోషమే’ అంటారు 45 ఏళ్ల రేఖానాయక్‌. తమకు కుటుంబ సభ్యుల నుంచీ ప్రోత్సాహం ఉందంటారు కృష్ణకల్యాణి, రమ్య, శాలి. పోలీసు కొలువు చేయాలన్న కలను సుశీలా దేవి ఇలా నెరవేర్చుకుంటున్నారట. ఎంతో ఇష్టంగా అందరం ట్రాఫిక్‌ వార్డెన్లుగా వచ్చామనీ, దీన్నో బాధ్యతగా నిర్వర్తిస్తున్నామంటున్నారు.

వీరి స్ఫూర్తితో ఆవడిలో రెండో బ్యాచ్‌లో మరో ముగ్గురు ఉపాధ్యాయినులు చేరారు. ‘తమ వృత్తి నైపుణ్యాలను ఈ మహిళలు ఖాకీ దుస్తుల్లో ప్రదర్శిస్తున్నారు. వీరి పని తీరు మరింతమంది మహిళలకు ట్రాఫిక్‌ వార్డెన్‌లుగా అవకాశమిచ్చేలా ప్రేరేపించిందం’టారు ఆవడి డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ వార్డెన్‌ (అడ్మిన్‌) శ్రీఅయ్యప్పన్‌. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వీరందిస్తోన్న సేవలు స్ఫూర్తిదాయకమే కదూ!

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్