కూలి చేసి... ఆశ్రమం నడిపిస్తూ!

నా అన్న వారందరినీ కోల్పోయిన ఆమె... అనాథలకి దహన సంస్కారాలు చేస్తుంటే పిచ్చిదనే ముద్రవేశారు.

Updated : 21 Dec 2022 10:01 IST

నా అన్న వారందరినీ కోల్పోయిన ఆమె... అనాథలకి దహన సంస్కారాలు చేస్తుంటే పిచ్చిదనే ముద్రవేశారు. విమర్శలకి భయపడకుండా ఆడపిల్లలకు చదువు చెప్పిస్తూ.. మహిళలకు అండగా ఉంటోన్న బుచ్చమ్మ కథ వింటే ఎవరికైనా గుండె బరువెక్కాల్సిందే...

పుట్టగానే తండ్రిని, చిన్నవయసులో భర్తను, ఆ వెంటనే బిడ్డను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన బుచ్చమ్మకు చదువు లేదు. పొట్టకూటికోసం కూలి పని తప్ప మరో దారి తెలియదు. అలాంటి నిరక్షరాస్యురాలు ఓ మహిళామండలి స్థాపించి ఆడవాళ్లకు అండగా ఉంటోందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. నల్గొండ జిల్లా పెద్దసూరారం బుచ్చమ్మ స్వగ్రామం. తండ్రి మరణించడంతో చిన్నవయసులోనే పెళ్లి చేశారు బంధువులు. కాపురమన్నా సజావుగా సాగిందా అంటే అదీ లేదు. భర్త చుక్కయ్య ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి చనిపోయాడు. అప్పటికి ఆరు నెలల గర్భవతామె. పురిట్లోనే ఆ బిడ్డా దూరమైంది. ఊరి జనమంతా సూటిపోటి మాటలతో హింసించడం మొదలుపెట్టారు. దీంతో మానసికంగా కుంగిపోయింది బుచ్చమ్మ. ఒకరోజు తనతోపాటు కూలికి వచ్చే భారతమ్మ అనే మహిళ అనారోగ్యం పాలైంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో బుచ్చమ్మే సపర్యలు చేసింది. ఎంత చేసినా ఆమె ప్రాణాలు దక్కకపోయేసరికి.. తనే దహన సంస్కారాలు కూడా చేసింది. ఇది తెలిసి బుచ్చమ్మను తల్లి ఇంట్లోకి రానివ్వలేదు. ‘నేను పుట్టింది ఇక్కడే.. మెట్టినిల్లూ ఇదే. చచ్చినా ఇక్కడే అనుకున్నా. అందుకే ఎవరికో భయపడి అవసరమున్న వారికి సాయమందించకుండా ఎలా ఉండగలను’ అనే బుచ్చమ్మ.. కూలి డబ్బుని కూడా దానధర్మాలు చేస్తుంటే అంతా ఆమెపై పిచ్చిదనే ముద్రవేశారు. వాళ్లంతా ఆమెని పిచ్చమ్మనే పిలుస్తారు. ఆమె మాత్రం... వయోవృద్ధులకు సాయపడుతూ వారికోసం ఒక ఆశ్రమం స్థాపించడానికి అధికారుల చుట్టూ తిరిగింది. ఆ క్రమంలోనే అప్పటి గ్రామీణాభివృద్ధి అధికారి శాంతి.. ఈ చదువురాని మహిళ ఆశయానికి ముచ్చటపడి ఆమెకు అండగా నిలబడ్డారు. ఆ కృతజ్ఞతతోనే తన ఆశ్రమానికి ‘శాంతి మహిళా మండలి’ అని పేరుపెట్టింది బుచ్చమ్మ. రోడ్లపై తిరిగే అనాథ పిల్లలకు నచ్చచెప్పి ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించడం ప్రారంభించింది. అలా ఇప్పటివరకూ 60 మందిని చేర్పించింది. తనలా ఒంటరి మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, వారికి అండగా ఉండాలని నిశ్చయించు కుంది.

వందలాది ఒంటరి, వితంతు మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించింది. ఇరవై ఏళ్ల కిందట ఏడుగురు మహిళలతో మొదలైన తన ఆశ్రమం.. ఇప్పుడు 35 మందికి ఆశ్రయం ఇస్తోంది. ఆశ్రమానికి సొంత స్థలమంటూ లేదు. ‘అద్దెకిచ్చిన వాళ్ల నుంచి మాటిమాటికీ ఒత్తిడి ఉండేది. సొంత స్థలం కోసం ఎంత ప్రయత్నించినా అవలేదు. ఒక దశలో చనిపోదామనిపించినా నన్ను నమ్ముకుని ఇంత మంది ఆధారపడ్డప్పుడు అలా చేయడం తప్పనిపించి, విరమించుకున్నా. ఎన్నో ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం చివరకు ఆశ్రమ భవన అద్దె చెల్లిస్తోంది. నాదగ్గర ఉన్న వాళ్లంతా అనాథ, ఒంటరి మహిళలే. బతికున్నన్ని రోజులూ వాళ్లను పోషిస్తా. ఎవరైనా కాలం చేస్తే నేనే అంత్యక్రియలు నిర్వహిస్తుంటా. ఇంతవరకూ 20 మందికి చేశాను. ఇక నిత్యావసరాలన్నీ దాతల నుంచే అందుతున్నాయి. నా ఊపిరున్నంత వరకూ ఇలానే సేవ చేస్తా’ అంటోన్న బుచ్చమ్మ మానవతకు నిలువెత్తు ప్రతిబింబంలా లేదూ.

- కట్ట సుధాకర్‌, నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్