ఒక్క జిల్లాకీ మహిళ పేరు పెట్టలేరా?

సాహితీ రంగంలో మహిళల పాత్ర పెరగాలని ఆకాంక్షించే వారిలో రచయిత్రి, సామాజిక కార్యకర్త తేళ్ళ అరుణ ఒకరు.. అందుకోసం నవ్యాంధ్ర రచయిత్రుల సంఘాన్ని స్థాపించారావిడ. ఓ స్వచ్ఛంద సంస్థనూ ఏర్పాటు చేసి బాధిత మహిళల ఆర్థిక స్వాలంబన కోసమూ కృషి చేస్తున్నారు.

Updated : 25 Dec 2022 07:20 IST

సాహితీ రంగంలో మహిళల పాత్ర పెరగాలని ఆకాంక్షించే వారిలో రచయిత్రి, సామాజిక కార్యకర్త తేళ్ళ అరుణ ఒకరు.. అందుకోసం నవ్యాంధ్ర రచయిత్రుల సంఘాన్ని స్థాపించారావిడ. ఓ స్వచ్ఛంద సంస్థనూ ఏర్పాటు చేసి బాధిత మహిళల ఆర్థిక స్వాలంబన కోసమూ కృషి చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహా సభల్లో ‘ప్రభుత్వమే వివక్ష చూపితే ఎలా’ అంటూ నిలదీసిన అరుణతో ‘వసుంధర’ మాట్లాడింది.

‘స్టెమ్‌ రంగాల్లోనే కాదు... సాహిత్యంలోనూ పురుషాధిక్యతే. స్త్రీలు రచనలు చేయలేరనే చులకన భావం వేళ్లూనుకుపోయింది.  నిజానికి ఎవరైనా తొలి పలుకులు నేర్చుకునేది అమ్మ దగ్గరే అని మరిచిపోతున్నారు. ఈ వివక్ష తగ్గితేనే... తెలుగుకు వైభవం’ అంటారు అరుణ. ఆమెది ఒంగోలు. తల్లి నారాయణమ్మ. తండ్రి వెంకటేశ్వర్లు, వైద్యుడు. ఆయన భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ స్థాపకులు ఎంఎన్‌ రాయ్‌ శిష్యుడు. ప్రజావైద్యశాల నిర్వహిస్తూ పేదలకు ఉచిత వైద్యం అందించేవారు. అంటరానితనం నిర్మూలన, వితంతు పునర్వివాహాలు, కులాంతర వివాహాలను ప్రోత్సహించే వారు. రచయితలూ, కమ్యూనిస్టు నాయకులతో వారిల్లు కిటకిట లాడుతుండేదట. ఈ వాతావరణమే అరుణని సామాజిక సేవవైపు మళ్లించింది.

ఆడపిల్ల బాధలు చూసే...

అరుణది కులాంతర వివాహం. భర్త కొంపల్లి బాలకృష్ణ లెక్చరర్‌, రచయిత కూడా. ఆమెను పెళ్లి తరవాతా చదువుకునేలా ప్రోత్సహించారు. సామాజిక కార్యక్రమాల్లోనూ వెన్నుదన్నుగా నిలిచారు. ఇవన్నీ అరుణ ఆలోచనలనూ, ఆశయాలను మరింత బలంగా మార్చాయి. ‘1980ల్లో వరకట్న సమస్యలు ఎక్కువ. ఓ సారి మేఘన అనే అమ్మాయిని అత్తమామలు యాసిడ్‌ తాగించి హత్య చేశారు. ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. దీనిపై ‘కాల్చేసిన కోడిపిల్లకి... ఆడపిల్లకి తేడా లేకుండా చేశారే’’ అంటూ ఓ కవిత రాశా. అది పత్రికల్లో ప్రచురితమై విశేష ఆదరణ పొందింది. అలా మహిళా సమస్యలే ఇతివృత్తాలుగా రెండు పుస్తకాలు, 200 కవితలు, 150 వ్యాసాలు, 15 కథలు రాశాను. భాష పునరుజ్జీవనానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, జీవోలు తెలుగులోనే ఉండాలని చెబుతూ కోర్టులో పిటిషన్‌ వేశాం. ప్రభుత్వం ఒప్పుకున్నా... ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు వేయనున్నాం’ అంటారావిడ.

ఒక్కతాటిపై నడిపిస్తూ...

సాహితీ రంగంలో మహిళల్ని ప్రోత్సహించాలని కొందరు రచయిత్రులతో కలిసి 2016లో నవ్యాంధ్ర రచయిత్రుల సంఘాన్ని (నరసం) స్థాపించారామె. మహిళలపై అన్ని రంగాల్లోనూ వివక్షను నిరసిస్తూ సభలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు చేసిన ప్రభుత్వం ఒక్క జిల్లాకు కూడా మహిళ పేరూ పెట్టలేదన్నది వారి ఆవేదన. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ‘‘మేం అడగాలా’’ పేరుతో 70 మంది రచయిత్రుల కవితా సంకలనాన్ని ముద్రించి విస్తృతంగా పంపిణీ చేశారు.

వేలమందికి ఆశ్రయం...

క్రమంగా అరుణ... పోరాటాలతో పాటూ సేవా కార్యక్రమాల్లోనూ నిమగ్నయ్యారు. భర్త నుంచి విడిపోయిన మహిళలూ, కుటుంబ నిరాదరణకు గురైన, శారీరక, లైంగిక వేధింపులకు గురైన మహిళల్ని ఆదుకునేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తోడ్పాటుతో 1995లో ఒంగోలులో ‘స్వధార’ హోమ్‌ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆశ్రయం పొందిన వారికి కౌన్సెలింగ్‌తో మానసిక సాంత్వన అందిస్తారు. ఇష్టపడిన వారిని వారి కుటుంబాలతో కలుపుతారు. లేని వారికి... వారి ప్రతిభ, ఆసక్తి ఆధారంగా శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 1700 మందికి ఆశ్రయం కల్పించారు. నలుగురు పిల్లల్ని దత్తత తీసుకుని వారిని బాగోగులు చూస్తున్నారు. మరెంతో మందికి సేవలందించాలన్నదే తన లక్ష్యమంటారు అరుణ.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, విజయవాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్