లక్క బొమ్మలే జీవితాన్నిచ్చాయి

ప్రేమ, పెళ్లి... ముత్యాల్యాంటి ముగ్గురు పిల్లలు జీవితం సంతోషంగా సాగిపోతుం దనుకునేలోగా... కట్టుకున్నవాడి మోసం కళ్లకు కట్టింది.

Updated : 26 Dec 2022 06:32 IST

ప్రేమ, పెళ్లి... ముత్యాల్యాంటి ముగ్గురు పిల్లలు జీవితం సంతోషంగా సాగిపోతుం దనుకునేలోగా... కట్టుకున్నవాడి మోసం కళ్లకు కట్టింది. పుట్టెడు దుఖఃలోనూ పుట్టింటివారికి భారం కాకూడదనుకున్న ఆమె లక్కబొమ్మల తయారీతో జీవితాన్ని నిలబెట్టుకుంది. మరికొందరికి శిక్షణనిచ్చి ఉపాధీ కల్పిస్తోంది. ఆమే షేక్‌ సలీమ.

‘మనకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం బాధపడుతూ కూర్చోవడం మూర్ఖత్వం అవుతుందని త్వరగానే అర్థం చేసుకున్నా. మాది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెం. నాన్న లక్కబొమ్మలు తయారు చేస్తారు. అమ్మ తనకు సాయం చేసేది. అక్క హరియాణాలో స్థిరపడింది. ఓసారి తనని చూడటానికి వెళ్లినప్పుడే అతడితో పరిచయం. ప్రేమించానన్నాడు. పెళ్లీ చేసుకున్నాడు. ఒకరితర్వాత ఒకరుగా ముగ్గురు పిల్లలు. హాయిగానే సాగింది మా జీవితం. మరి ఏమైందో ఏమో ఓ రోజు పుట్టింటికి వెళ్లి రమ్మంటూ పిల్లలతో సహా నన్ను రైలెక్కించాడు. ఇక్కడికి వచ్చాక ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. అతడి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించినా జాడ లేదు. ఆ తర్వాతే అర్థమైంది అతడు నన్ను మోసం చేశాడని. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయేదాన్ని. ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియక...వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. చివరికి నాకు నేనే సర్దిచెప్పుకున్నా... నా ముగ్గురు పిల్లల్ని పెంచి...ఉన్నతస్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఉద్యోగం చేసి సంపాదిద్దామంటే చదువుకోలేదు. కూలికి వెళ్తే వచ్చే డబ్బులు పోషణకు సరిపోయేవి కావు.  నాన్న మీద ఆధారపడలేను. అందుకే లక్కబొమ్మలు తయారు చేసి అమ్మాలనుకున్నా. నాన్న దగ్గరే మొదట నేర్చుకున్నా. కొన్ని ఆధునిక మెలకువలూ, మార్కెటింగ్‌ నైపుణ్యాలూ అలవరుచుకోవడానికి వీరన్నగూడెంలో ప్రభుత్వ హ్యాండీ క్రాఫ్ట్స్‌ సంస్థలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా.

యాభైవేల రుణంతో...

నేర్చుకున్నంత కాలం కొత్త ప్రయోగాలెన్నో చేసేదాన్ని. వాటిని చూసి వారంతా అబ్బురపడేవారు. శిక్షణ పూర్తయ్యాక మొదట ఇంట్లోనే చేతి పనిముట్లతో బొమ్మలు తయారీ మొదలుపెట్టా. మంచి ఆదరణే లభించేది. స్వయం సహాయక సంఘంలో చేరడంతో అక్కడ రూ. 50వేల రుణం అందింది. ఆ డబ్బుతో వీటి తయారీకి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేశా. నా పనితనం చూసిన హ్యాండీ క్రాఫ్ట్స్‌ సంస్థ ఎక్కడ ప్రదర్శనలు జరిగినా ఓ స్టాల్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. నేను తయారు చేసిన వాటిల్లో గృహలంకరణ వస్తువులూ, ఆటవస్తువుల వంటివి ఇట్టే అమ్ముడుపోయేవి. నోటిద్వారా ప్రచారం జరిగి... ఇతర ప్రాంతాల నుంచీ ఆర్డర్లు మొదలయ్యాయి. దాంతో మరికొంతమంది మహిళలకు కూడా ఉపాధి కల్పించాలని భావించి శిక్షణ ఇవ్వడం ప్రారంభించా.

ఈ విషయం తెలుసుకున్న ఐకేపీ అధికారులు ఇతర గ్రామాల స్త్రీలకూ సైతం శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. అలా ఇప్పటివరకు సుమారు వందమంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోగలిగా. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నా. ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్లకు నా వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటా. ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది చెప్పండి.

- రవీందర్‌రావు కులకర్ణి, సంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్