కలలకు రెక్కలు తొడుగుదాం

కొత్త ఏడాదిలో ప్రవేశించాం. ఎన్నో ఒడుదొడుకులను అధిగమించి వారి రంగాల్లో అగ్రగాములుగా ఎదిగిన స్ఫూర్తిప్రదాతలు వసుంధరతో శుభాకాంక్షలను పంచుకున్నారు. ఈ శుభవేళ... వారి అనుభవాల ఆసరాగా సానుకూల ఆలోచనల రెక్కలు తొడుక్కుందాం... కొత్త ఆశలు, సరికొత్త లక్ష్యాలతో ఉజ్వల భవిష్యత్తును స్వప్నిద్దాం... శ్రమించి సాధిద్దాం.

Updated : 01 Jan 2023 08:36 IST

2023

కొత్త ఏడాదిలో ప్రవేశించాం. ఎన్నో ఒడుదొడుకులను అధిగమించి వారి రంగాల్లో అగ్రగాములుగా ఎదిగిన స్ఫూర్తిప్రదాతలు వసుంధరతో శుభాకాంక్షలను పంచుకున్నారు. ఈ శుభవేళ... వారి అనుభవాల ఆసరాగా సానుకూల ఆలోచనల రెక్కలు తొడుక్కుందాం... కొత్త ఆశలు, సరికొత్త లక్ష్యాలతో ఉజ్వల భవిష్యత్తును స్వప్నిద్దాం... శ్రమించి సాధిద్దాం...


ఆత్మస్థైర్యంతోనే పురోగతి

మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. చివరికి దేశరక్షణలో ప్రమాదకర బాధ్యతల్లోకీ ప్రవేశిస్తున్నారు. ఇవన్నీ సంతోషం కలిగిస్తున్నా... మరోపక్క స్త్రీలపై అకృత్యాలు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా పిల్లలపై లైంగిక దాడులు చాలా కలవర పరుస్తున్నాయి. దీనికి కారణాలు... ఇంటర్నెట్‌ విచ్చలవిడి ఉపయోగం, తల్లిదండ్రులు పిల్లల పరిస్థితిని సమీక్షించలేకపోవడం, నైతిక విలువల విద్య లేకపోవడం. మద్యపానం, డ్రగ్స్‌ కూడా యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. వీటన్నింటి వల్లా లైంగిక నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అమ్మానాన్నలు పిల్లలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది వారికి చిన్నప్పటి నుంచి బోధించాలి. ఆడపిల్లలను ఆత్మస్థైర్యంతో పెంచాలి. అప్పుడే ఏ సమస్య ఎదురైనా దీటుగా ఎదుర్కొంటారు. అన్ని విషయాల్లోనూ పురోగతి సాధిస్తారు. ఈ కొత్త ఏడాదిలో నేరాలు తగ్గిపోవాలని, అంతా సానుకూలంగా ఉండాలని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అమ్మాయిలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

- జస్టిస్‌ చిల్లకూరు సుమలత, న్యాయమూర్తి, తెలంగాణ హైకోర్టు


సమన్వయంతోనే విజయం...

2022 అద్భుతంగా సాగిపోయింది. కొవిడ్‌ నుంచి కోలుకున్నాం. వ్యాపారాలు పుంజుకున్నాయి. 2023 కూడా మనందరికీ ఎన్నో విజయాలను తెచ్చిపెడుతుందని నమ్ముతున్నా. కొత్త ఏడాదిలో నన్ను నడిపించడానికి ‘షైన్‌’ అనే పదాన్ని ఎంచుకున్నా. ఇది ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా ఉంటుంది. దాన్ని ఉత్తేజపరచగలిగితే... వారు ప్రకాశించడమే కాదు.. మరికొందరినీ ప్రకాశింపచేయగలరు. 2023 సంవత్సరానికి ఇండియన్‌ జీ20 ప్రెసిడెన్సీ సహకారంతో ‘జీ20 ఎంపవర్‌ ఇండియా అలయెన్స్‌’ బాధ్యతలు తీసుకున్నా. దీని ద్వారా మహిళా సాధికారత, అన్ని రంగాల్లోనూ స్త్రీ సమానత్వం, ప్రోత్సాహం సాధించాలన్నది లక్ష్యం. అమ్మాయిలూ... మీ కలలకు రెక్కలివ్వండి. అడ్డంకులను అధిగమించాలంటే ముందు జీవితాన్నీ, పనినీ సమన్వయం చేసుకోండి. సానుకూల జీవనశైలి, పౌష్టికాహారం, పని మీద ఇష్టం కలిగి ఉండటం వంటి లక్షణాలను నేర్చుకోండి. అప్పుడు గాజు తెరల్ని బద్దలు కొట్టడానికి ఎక్కువ సమయం పట్టదు.

- డా.సంగీతా రెడ్డి, జేఎండీ, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌


కష్టాలకు వెరవద్దు...

ఏళ్ల కల.. టీటీ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచా. కామన్వెల్త్‌లో బంగారు పతకంతోపాటు అర్జున అవార్డునూ అందుకున్నా. అందుకే 2022 నాకు ఉత్తమ సంవత్సరం. స్పాన్సర్‌షిప్‌నీ అందుకున్నా. 2023నీ విజయవంతంగా మలచుకోవాలనుకుంటున్నా. ప్రపంచ టాప్‌ 50 ర్యాంకుల్లో స్థానం సాధించాలన్నది నా లక్ష్యం. పరిస్థితి ఒకప్పటిలా లేదు. అమ్మాయిలు అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్నారు. క్రీడలూ మినహాయింపు కాదు. ఈసారి ఒలింపిక్స్‌లోనూ దేశం నుంచి ఎక్కువ పతకాలు సాధించింది అమ్మాయిలే. ఆ సంఖ్య పెరగాలి. అయితే ఇప్పటికీ అమ్మాయిలను ఆటల్లోకి పంపడానికి ఆలోచించే వారున్నారు. ప్రభుత్వాలు క్రీడల్లో రాణిస్తున్న వారికి ఉద్యోగాలు.. ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడానికి ‘టాప్‌’, ‘ఖేలో ఇండియా’ వంటి పథకాలెన్నో తెస్తున్నాయి. ప్రోత్సాహం ఉంది. దాన్ని అందుకొనే, ఆసక్తిని అందరి ముందూ వ్యక్తం చేసే ధైర్యం చేయాల్సింది మాత్రం ‘అమ్మాయే’. ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోవద్దు.. ధైర్యంగా నచ్చిన దానిలోకి వెళ్లండి. ఏళ్ల కష్టం తర్వాతే నేనీ స్థాయికి చేరుకున్నా. మీరూ కష్టాలకు వెనకాడక శ్రమిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.

- ఆకుల శ్రీజ, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత


ఒకరికొకరం అండగా...

మన దేశంలో మహిళలని అడ్డుకునే గాజు తెర లేదని నేను చెప్పను.  కానీ... మీరొక్కసారి గమనించండి... అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలు మంచి చదువు కోసం, ఆస్తి హక్కు కోసం, సమాన వేతనాల కోసం ఎన్నో ఏళ్ళు పోరాడారు. సురక్షిత గర్భస్రావ చట్టాల కోసం ఇంకా పోరాడుతునే ఉన్నారు. ఆ లెక్కన చూస్తే మన దేశంలో ఆ మార్పులు త్వరగానే సాధించాం. ఇంకా సాధించగలం కూడా. మగవాళ్ళు మాత్రమే ఇంతవరకు అజమాయిషీ చేసిన రక్షణ, పోలీస్‌, న్యాయ రంగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగేళ్లలో పెద్ద పెద్ద కంపెనీల బోర్డుల్లో మహిళల సంఖ్య 64 శాతం పెరిగింది. ఇలా ఆయా రంగాల్లో మహిళల సంఖ్య పెరగడం మనకి మంచిదే. ఇన్నాళ్లూ గోప్యంగా ఉండిపోయిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. పరస్పర సహకారం దొరుకుతుంది. మహిళలు ఇంకా ముందుకు రావాలని... తోటి ఆడవాళ్లకు అండగా ఉండాలని ఆశిద్దాం.

- స్వాతి లక్రా, అడిషనల్‌ డీజీపీ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, తెలంగాణ


ఆరోగ్యంగా ఉంటేనే...

ఎంత అభివృద్ధి చెందుతున్నా వివక్ష మాత్రం పోవడం లేదు. దీన్ని అధిగమించడానికి టెక్నాలజీ సాయం కూడా తీసుకోవాలి. స్కూలు, కళాశాల స్థాయి నుంచి లైంగిక వివక్షకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలి. ఇదే కాదు సామాజికంగా అన్ని స్థాయిల్లోనూ వివక్షను గుర్తించి, తగ్గించేందుకు కృషి జరగాలి. గత రెండేళ్లుగా మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. 2022 కొంత ఊరట నిస్తే... 2023 మరింత ఆశాజనకంగా ఉంటుందని నమ్ముతున్నా. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నా... వాటిని అందుకునే దిశగా అడుగులు వేస్తోన్న అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇందుకు కారణమవుతోన్న అవాంతరాలను అధిగమించడానికి కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రణాళికలు వేసుకోండి. కచ్చితంగా మీరనుకున్న లక్ష్యం చేరుకుంటారు. అయితే, ఇవన్నీ చేయాలంటే ముందు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం ఈ నూతన సంవత్సరంలో మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే సంతోషంగానూ ఉండగలుగుతారు. కోరుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు.

- అనూ ఆచార్య, ఫౌండర్‌, సి.ఇ.ఒ., మాప్‌మైజీనోమ్‌


ఆనందానికి ప్రణాళికలు...

‘నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చెత్తపా...’ అంటూ నేను గతేడాది పాడిన పాట మంచి జోష్‌ ఇచ్చింది. ఆ ఉత్సాహంతో ఈ సంవత్సరం మరింత గొప్పగా నిలబడాలనుకుంటున్నా. ఏదైనా అనుకోవడం కంటే... ఆచరణలో పెట్టడమే కష్టం. లక్ష్యసాధన నల్లేరుపై నడక కాదు. జయాపజయాలను సమానంగా తీసుకోగలిగినప్పుడే ముందడుగు వేయగలం. కరోనా తరవాత చాలామంది అమ్మాయిలు... ఉద్యోగాల్నీ, ఉపాధినీ కోల్పోయారు. వారందరికీ ఒక్కటే చెబుతా. అవకాశాలు వెతుక్కుంటూ రావు. మనమే వెతకాలి.. అవసరమైతే సృష్టించుకోవాలి. అప్పుడే నిలబడగలం. అందుకు నేనే ఉదాహరణ. అమ్మ సంగీతం వింటూ పెరిగా. నాతో పాటే... పాటంటే మక్కువా పెరిగింది. గాయనిగా నిరూపించుకోవాలనుకున్నా. ఎన్ని ఆడిషన్లకి హాజరయ్యానో లెక్కలేదు. దాదాపు అన్ని చోట్లా విఫలమయ్యా. కానీ ఎప్పుడూ వెనక్కి వెళ్లాలనుకోలేదు. ఆ ప్రయత్నమే నన్నీ రోజు ఇలా నిలబెట్టింది. మారిన జీవనశైలి... ఒత్తిడి నుంచి పీసీఓడీ వరకూ మహిళల్లో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతోంది. అందుకే 2023లో ఆరోగ్యంగా, అనందంగా ఉండటానికి ప్రణాళికలు వేసుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఆలోచించాలి.

- మోహన భోగరాజు, నేపథ్య గాయని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్