ఊడ్చిన చోటే...ఉన్నత స్థానానికి...

కొవిడ్‌ సమయంలో వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో ఆమె ముందుండేవారు. పారిశుద్ధ్య కార్మికురాలిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. సామాజిక సేవల్లోనూ పాలు పంచుకొనే వారు.

Updated : 06 Jan 2023 06:09 IST

కొవిడ్‌ సమయంలో వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో ఆమె ముందుండేవారు. పారిశుద్ధ్య కార్మికురాలిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. సామాజిక సేవల్లోనూ పాలు పంచుకొనే వారు. ఆ సేవాభావమే ఇప్పుడామెను డిప్యూటీ మేయర్‌ను చేసింది. ఏ కార్యాలయాన్ని ఆమె శుభ్రం చేసేవారో.. అక్కడే ఈ పదవిని అందుకున్నారీమె. 60 ఏళ్ల చింతాదేవి స్ఫూర్తి కథనమిది.

అక్షరం ముక్కరాని చింతాదేవికి భర్త తెచ్చే కూలి డబ్బులే కుటుంబానికి ఆధారం. వీరికి ముగ్గురు కొడుకులు. ఉన్నదాంట్లోనే సంసారాన్ని లాక్కొచ్చే వారీమె. ఆ డబ్బు ఏమూలకీ సరిపోయేది కాదు. దాంతో పిల్లలకు మూడుపూటలా తిండిపెట్టడం కోసం పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరారు. చింతాదేవిది బిహార్‌లోని గయ. వీధుల పరిశుభ్రతతోపాటు గయ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో స్వీపర్‌గానూ పని చేసేవారు. రెండేళ్ల క్రితం పదవీవిరమణ చేశారు. అదే సమయంలో భర్త చనిపోవడంతో కూరగాయలు అమ్ముతూ బతుకు బండి లాగిస్తున్నారు.

సేవాభావంతో..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో చింతాదేవి సేవాభావం స్థానికుల మన్ననలు అందుకునేవారు. సహోద్యోగుల్లోనూ స్ఫూర్తిని నింపుతూ వారూ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా చేసేవారీమె. లాక్‌డౌన్‌లో అంకితభావంతో ఈమె చేసిన సేవలు అక్కడివారి మనసులో ఆమెకు సుస్థిరస్థానాన్ని సంపాదించిపెట్టాయి. కరోనా వైరస్‌కు భయపడి ప్రజలు బయటికి రాని సమయంలోనూ అందరికీ చేదోడువాదోడుగా ఉన్నారీమె. వలంటీరుగా ప్రజలకు సేవలందించడానికి ఉత్సాహాన్ని చూపించారు. ఉద్యోగ విరమణ తర్వాత, మాజీ డిప్యూటీ మేయర్‌ మోహన్‌ శ్రీవాస్తవతో కలిసి సామాజికసేవలో మరింత ఉత్సాహంగా నిమగ్నమయ్యారు. కొవిడ్‌ బాధితులకు మందులు, ఆహారం అందించడం, వ్యాక్సిన్‌పై అందరిలో అవగాహన కలిగించడం వంటి వాటిలో చురుగ్గా పాలుపంచుకున్నారు.

ఊహించలేదు..

ప్రజలకు మరింత సేవచేసే అదృష్టం ఇలా డిప్యూటీ మేయర్‌ పదవి రూపంలో వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటారీమె. ‘మున్సిపల్‌ ఎన్నికల్లో నన్ను పోటీ చేయమని అందరూ చెప్పినప్పుడు నాకేం అర్హత ఉంది అని, నామినేషన్‌ వేయడానికి వెనుకాడా. పారిశుద్ధ్య కార్మిక సంఘం సహా స్థానికులంతా అందించిన ప్రోత్సాహం మరవలేనిది. ఈ ఎన్నికల్లో 11మంది అభ్యర్థులపై నేను 16వేల ఓట్ల ఆధిక్యంతో గెలవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఏ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని శుభ్రపరిచే దాన్నో.. అదే ఆఫీస్‌లో డిప్యూటీ మేయర్‌ని కావడం సంతోషంగా ఉంది. ఇక్కడి వారంతా నాపై ఉంచిన ప్రేమను గౌరవిస్తున్నా. ప్రజాసేవకురాలిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా’ అంటోన్న చింతాదేవి ముగ్గురు కొడుకులూ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికులు. గయ  పురపాలక సంఘానికి వైఎస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన తొలి మహిళా ఈవిడే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్