మనకోసం.. బామ్మల పాఠం!

మూడు పదులు దాటితేనే అమ్మా.. అయ్యా అనేస్తున్నాం! ఒత్తిడి, ఆందోళనలతో సతమవుతున్నాం. ఈ బామ్మలను చూడండి.. వీళ్ల వయసులు 80, 115. ఇప్పటికీ ఆనందంగా గడిపేస్తున్నారు. ఆ తరం అని తోసిపారేయొద్దు.

Updated : 04 Mar 2023 19:19 IST

మూడు పదులు దాటితేనే అమ్మా.. అయ్యా అనేస్తున్నాం! ఒత్తిడి, ఆందోళనలతో సతమవుతున్నాం. ఈ బామ్మలను చూడండి.. వీళ్ల వయసులు 80, 115. ఇప్పటికీ ఆనందంగా గడిపేస్తున్నారు. ఆ తరం అని తోసిపారేయొద్దు. ఎన్నో అంశాల్లో మనతో సమానంగా పోటీపడుతున్నారు. అంతేనా.. జీవితాన్ని ఆస్వాదించడమెలాగో పాఠాలూ చెబుతున్నారు. అవేంటో చదివేయండి.


ఆ లోటు ఉంది..

115 ఏళ్ల బామ్మ..  మరియా బ్రన్యాస్‌, పుట్టింది అమెరికా. కానీ అసలు మాత్రం స్పెయిన్‌. తన జీవితకాలంలో స్పానిష్‌ యుద్ధం, రెండు ప్రపంచ యుద్ధాలు, స్పానిష్‌ ఫ్లూ, టైటానిక్‌.. వంటి ఎన్నో చారిత్రక సంఘటనలు చూశారు. 2020లో కొవిడ్‌తో తన వాళ్లందరూ ఇబ్బందిపడ్డా.. ఈ బామ్మ మాత్రం త్వరగా కోలుకున్నారు. ‘చిన్న తనం నుంచీ అనారోగ్య సమస్యలు ఎరుగను. ఆపరేషన్‌ అంటే ఏంటో తెలియదు. చాలామంది మీ డైట్‌ రహస్యమేంటని అడుగుతుంటారు. నేను అన్నీ తింటా... కానీ కొద్ది మొత్తంలోనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ పియానో వాయించడమంటే సరదా. 98 ఏళ్ల వరకూ వాయించా. తర్వాత చేతులు పట్టు తప్పి మానేశా. ఆ లోటు మాత్రం ఉంది’ అనే ఈ బామ్మ యువతతో పోటీ పడుతూ టెక్నాలజీపై పట్టు సాధించారు. ట్విటర్‌లో తన ఆరోగ్య సూత్రాలను పంచుకుంటూ ఉంటారు.

ఈ బామ్మ గారి సూచనలు...

పరిమిత ఆహారం, సానుకూల ఆలోచనా ధోరణి, అందరితో కలిసి మెలిసి ఉండటం, ప్రకృతిలో గడపడం, భావోద్వేగాలపై పట్టు, ప్రశాంత జీవనం. గతాన్ని తలచుకొని బాధపడొద్దు. దక్కని వాటికోసం ఆరాటం వద్దు. నెగెటివిటీని పంచేవాళ్లకు దూరంగా ఉండండి. బాధలనే మోసుకుంటూ వెళితే జీవితం భారంగా మారుతుంది.

సంస్కృతి చాటాలనీ..

టాటా ముంబయి మారథాన్‌.. యువతతో పోటీ పడుతూ 80 ఏళ్ల బామ్మ పరుగుతీశారు. దాదాపు గంటపాటు పాల్గొని 5 కి.మీ. పరిగెత్తారు. పేరు భారతి జితేంద్ర పాఠక్‌. మధ్యలో అలసి కాసేపు సేద తీరుదామనుకున్న వాళ్లూ ఆవిడ ఉత్సాహం చూసి ఆమె వెంట పరుగు ప్రారంభించారు. పైగా చీరలో చేతిలో జాతీయ జెండాతో పరుగు తీస్తున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయారు కూడా. ‘కేవలం ఈ మారథాన్‌లోనే అయిదుసార్లు పరిగెట్టా. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు నిర్వహించలేదు కానీ.. లేదంటే అప్పుడూ పాల్గొనేదాన్ని. సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నంగా చీరను ఎంచుకున్నా. నేను భారతీయురాలిని. దేశంపై నా అభిమానాన్ని తెలపడానికి చేతిలో జెండా’ అనే ఈ బామ్మ.. రోజూ ఉదయాన్నే పరుగు, నడక తప్పక చేస్తుందట. ఈ వయసులో ఇంత కష్టమెందుకు అంటే.. ‘కళ్లు, కాళ్లూ చేతులూ బాగా పని చేస్తున్నాయి. మరి ఊరికే కూర్చోవడమెందుకు’ అని ప్రశ్నిస్తున్నారు. అంతేనా.. ‘ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటూ రోజూ కొంత సమయం నచ్చిన వ్యాయామం చేయండి. నాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు’ అంటున్నారు.

ఇవండీ బామ్మల ఆనంద సలహాలు.. పాటిద్దామా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్