చంటి పిల్లాడితో... కూలికెళ్లా!

పస్తుల బాధ తట్టుకోలేక చంటిబిడ్డను చంకనేసుకుని కూలిపనికి వెళ్లింది చంద్రకళ. ఎన్నాళ్లలా? ఎవరికోసమో చూడకుండా తన జీవితంలో తానే వెలుగులు నింపుకోవాలనుకుంది.

Published : 23 Jan 2023 00:24 IST

పస్తుల బాధ తట్టుకోలేక చంటిబిడ్డను చంకనేసుకుని కూలిపనికి వెళ్లింది చంద్రకళ. ఎన్నాళ్లలా? ఎవరికోసమో చూడకుండా తన జీవితంలో తానే వెలుగులు నింపుకోవాలనుకుంది. అందమైన తమ ఊరిని చూడ్డానికొచ్చే అతిథులకు రుచికరమైన వంటకాలని వడ్డించి దాన్నే ఉపాధిగా మలుచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రదర్శనలో వసుంధరని కలిసినప్పుడు 37 ఏళ్ల చంద్రకళ తన స్ఫూర్తి కథను పంచుకుందిలా...

చ్చని పర్వతశ్రేణుల్లో పొందిగ్గా ఒదిగిన చిన్న గ్రామం మాది. సిక్కింలోని రోరాథంగ్‌కు దగ్గరగా ఉండే మా ఊర్లో ఎటుచూసినా ప్రకృతి కనువిందు చేస్తుంది. కాబట్టే పట్టుమని 200 గడపల్లేని అక్కడికి ఎంతోమంది పర్యటకులు వచ్చేవారు. అమ్మా, నాన్న కూలీకెళ్లినా.. నాకే లోటూ తెలియకుండా పెంచారు. పదోతరగతి అవగానే ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే పూర్ణారాయ్‌తో నాకు పెళ్లైంది. ఆ తర్వాతే కష్టాలంటే ఏంటో తెలియడం మొదలైంది. మా ఆయన తన సంపాదనలో నయాపైసా కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. అంతలో మా బాబు ప్రసన్న కడుపులో పడ్డాడు. వాడి రాకతో అయినా అతను మారతాడని ఆశపడ్డా. తనలో కొంచెం కూడా మార్పు రాలేదు. నన్నెంతో గారాబంగా పెంచిన అమ్మానాన్నలతో ఇవన్నీ చెప్పాలనిపించేది కాదు.

అతను కుటుంబాన్ని ఆదుకుంటాడనే ఆశ పోయింది. చంటి పిల్లాడితో పస్తులున్న  రోజులు నన్ను ఉపాధికోసం వెతికేలా చేశాయి. కడుపు మాడ్చుకోవడంకన్నా, ఏదైనా పనిలోకి వెళ్తే మంచిదనే ఆలోచన వచ్చింది. కానీ ఉద్యోగం వచ్చేంత చదువు లేదు. దాంతో భవన నిర్మాణ పనుల్లో కూలికి చేరా. బాబునువెంటపెట్టుకొని నిప్పులుచెరిగే ఎండలో పనిచేసేదాన్ని.

పర్యటకుల కోసం...

కూలి చేసిన రోజు కడుపు నిండేది. లేని రోజు పస్తులే! అందుకే మా ఊరినీ, చుట్టుపక్కల ప్రాంతాలనూ చూడటానికి వచ్చే పర్యటకులకు మా ప్రాంతపు ప్రత్యేక ఆహారాలను అందించగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా చేయాలన్నా కొంత పెట్టుబడి కావాలి. తెలిసినవాళ్లకు నా కష్టం చెబితే స్వయం సహాయక బృందంలో చేరమన్నారు. అలాగే చేశా. కొంత కాలానికి రూ.10వేలు రుణమిచ్చారు. ఆ డబ్బుతో ఆవిరిమీద ఉడికించి చేసే మోమో వంటకం తయారీ మొదలుపెట్టా. అమ్మ దగ్గర నేర్చుకున్న మోమోల తయారీ అలా ఉపయోగపడింది. వీటితోపాటు రకరకాల థాయ్‌ కాఫీ, టీ వంటివీ అందించేదాన్ని. సీజన్‌ లేనప్పుడు కూలిపనికి వెళ్లిపోయేదాన్ని. ఒక్కోసారి ఆ పనీ ఉండేది కాదు. పిల్లాడి పెంపకం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. మనకొచ్చిన కష్టంపై మనమే ధైర్యంగా నిలబడి పోరాడాలి అనేది అమ్మ. నేను చేసే మోమోల రుచికి పర్యటకుల నుంచి ప్రశంసలు అందుకొన్నప్పుడల్లా సంతోషంగా అనిపించేది. మొత్తానికి రుణం తీర్చడానికి రెండేళ్లు పట్టింది. బాబుని స్కూల్‌లో చేర్చా. నాన్న చనిపోతే, అమ్మ సంరక్షణ కూడా నేనే తీసుకొన్నా. ఆమె కూడా వంటల్లో నాకు సాయం చేసేది. 

మరో మెట్టు..

మొదటి రుణం తీర్చాక స్వయంసహాయక బృందం నుంచి రూ.50వేలు రుణం దొరికింది. ఆ డబ్బుతో మోమోల వ్యాపారాన్ని విస్తరించి ఆ రుణం కూడా తీర్చేశా. దాంతో మరోసారి పెద్ద మొత్తంలో రుణం దొరకడంతో రోరాథంగ్‌లో చంద్ర పేరుతో రెస్టారెంట్‌ ప్రారంభించా. ‘మోమోల తయారీలో నిన్ను మించిన వాళ్లు ఈ ఊళ్లోనే లేరు’ అనే అమ్మ ప్రశంస నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేది. ఆమె దూరమైనా ఆమె ఇచ్చిన ధైర్యంతో వ్యాపారాన్ని విస్తరించి వివిధ రుచుల్లో మోమోలు, సంప్రదాయ వంటకాలు చేసేదాన్ని. ఇవి పర్యటకులను బాగా ఆకర్షించాయి. నా పట్టుదలని చూసి నా భర్తా అండగా నిలిచాడు. బాబు పదోతరగతి పాసై వాడూ చేయూతగా ఉంటున్నాడు. స్థానికంగా జరిగే మేళాల్లో స్టాల్‌ పెడుతూ.. వేల మోమోలు విక్రయిస్తుంటా. అది తెలిసి అధికారులు స్వయంసహాయక బృందం తరఫున ఎగ్జిబిషన్లకు పంపేవారు. అలా మా సిక్కిం మోమోల రుచిని మిగతా రాష్ట్రాలవారికీ చూపించే అవకాశాన్ని అందుకున్నా. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రదర్శనలో రోజుకి 10 నుంచి 14వేల మోమోలు అమ్మా. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. నాలాంటి మహిళలు 10మందికి ఉపాధి కల్పిస్తున్నా. మేళాల సమయంలో అయితే మరింత ఎక్కువమందికి పని ఉంటుంది. కష్టాలెన్ని వచ్చినా ఆత్మవిశ్వాసంతో నిలబడి పోరాడటమే అసలైన గెలుపు సూత్రం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్