మధ్య తరగతి అమ్మాయి..30 కోట్ల వ్యాపారి!

‘బాగా పనిచేస్తే బాస్‌కి లాభాలు తెచ్చిపెట్టగలను కానీ.. నేనో ఉద్యోగిలానే ఉండిపోతా కదా’ అన్న ఆలోచనే ఆవిడని వ్యాపారవేత్తని చేసింది.

Updated : 23 Jan 2023 07:13 IST

‘బాగా పనిచేస్తే బాస్‌కి లాభాలు తెచ్చిపెట్టగలను కానీ.. నేనో ఉద్యోగిలానే ఉండిపోతా కదా’ అన్న ఆలోచనే ఆవిడని వ్యాపారవేత్తని చేసింది. అక్కడ విజయం సాధించడమే కాదు.. ఇండో కెనడా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అడ్వైజర్‌ స్థాయికి ఎదిగారు. ఒక మధ్యతరగతి అమ్మాయి తలచుకుంటే ఏదైనా సాధించగలదంటోన్న కన్మణి స్ఫూర్తిదాయక ప్రయాణమిది!

న్ని కష్టాలొచ్చినా పిల్లల్ని మాత్రం ఉన్నత చదువులు చదివించాలన్నది కన్మణి తల్లిదండ్రుల ఆశయం. ఇద్దరు అబ్బాయిలతో సమానంగా ఆవిడని చదివించారు. నాన్న రైల్వేలో చిన్న ఉద్యోగి. ఆరోగ్యం బాగోక ముందస్తు పదవీ విరమణ తీసుకొని వ్యాపారం చేశారు. అక్కడా నష్టపోయి చిన్నాచితకా పనులు చేసేవారు. భార్యాభర్తలిద్దరూ కష్టపడితేనే ముద్ద నోట్లోకెళ్లేది. అయినా పిల్లల చదువుకు మాత్రం ఆటంకం కలిగించలేదు. అందుకే అన్నింట్లో ముందుండాలని తాపత్రయపడేవారావిడ. ‘ముందుకెళ్లాలంటే చదువొక్కటే సరిపోదని తెలుసు. అందుకే చదువుతోపాటు ఆటలు, నాటకాలు అన్నింటిలోనూ ముందుండేదాన్ని. జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొన్నా. అమ్మ తన నగలమ్మి ఫీజులు కట్టింది’ అని గుర్తుచేసుకుంటారు కన్మణి. వీళ్లది చెన్నై. ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో డిగ్రీ రెండో సంవత్సరంలో ‘చదువు కొనసాగించనివ్వా’లన్న ఒప్పందంతో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ధనశేఖర్‌ బాలకృష్ణన్‌కిచ్చి పెళ్లిచేశారు. ఆయన ప్రోత్సాహంతో పొలిటికల్‌ ఫిలాసఫీ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌లో పీజీ పూర్తి చేశారామె. 1994లో నెలకు రూ.2వేల జీతానికి కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరినావిడ ఎనిమిదేళ్లలో రూ.80వేల జీతంతో బిజినెస్‌ హెడ్‌ స్థాయికి ఎదిగారు. కెరియర్‌ ఉన్నత స్థితిలో 2010లో కెనడాకు వెళ్లారు. ‘తొలినాళ్లలో మావారు నాకు తోడు నిలిచారు. ఇప్పుడు నావంతు అనుకున్నా. ఇద్దరు పిల్లలు. మళ్లీ ఆర్థిక కష్టాలు. ఓ కాఫీ షాపులో చేరా. తర్వాత కొన్ని నెలల్లోనే స్టార్‌బక్స్‌కి మారి.. సంస్థలో మేనేజర్‌ స్థాయికి ఎదిగా. 2015లో ఎడ్యుకేషనల్‌ కౌన్సెలింగ్‌ సంస్థకి మారా. ఏడాదిన్నర పనిచేశాక స్టూడెంట్‌ సర్వీసెస్‌కి ఉన్న గిరాకీ అర్థమైంది. నేనెంత కష్టపడ్డా యజమానికి లాభాలు తేవడమే కానీ.. నేను ఎదగలేను కదా అనిపించింది. రాజీనామా చేసి 2016లో రూ.2 లక్షలతో ఇండో కెనడా స్టూడెంట్‌ సర్వీసెస్‌ ప్రారంభించా’ అంటారామె.

తన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతో త్వరలోనే క్లయింట్లను ఆకర్షించారు. భారత విద్యార్థులు తిండి విషయంలో ఇబ్బంది పడటం గమనించి ‘మిస్టర్‌ ఇడ్లీ, మిసెస్‌ సాంబార్‌’ అనే టేక్‌అవే సంస్థనీ ప్రారంభించారు. ఆ రెండింటి టర్నోవర్‌ రూ.30 కోట్లకు పైమాటే! వివిధ దేశాల నుంచి ఆవిడకు క్లయింట్లున్నారు. ఆమె పనితనాన్ని గమనించిన అక్కడి ప్రభుత్వం ఇండో కెనడా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కి అడ్వయిజరీగా నియమించింది. భారత్‌లో నిర్వహించిన ఓ అంతర్జాతీయ సదస్సుకీ నాయకత్వం వహించారు కన్మణి. ‘ఎన్ని చేసినా కుటుంబానికీ సమ ప్రాధాన్యమిస్తా. వారాంతాల్లో ఫోన్‌ పట్టుకోను’ అనే ఆవిడ.. ‘20ల్లోనే వ్యాపారాన్ని ప్రారంభించండి. విఫలమైనా ఆ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. అలాగే నచ్చిన రంగం గురించి తెలుసుకోవడం, నిజాయతీగా ఉండటం, లోపాల్ని అంగీకరించడం వంటి లక్షణాలు అలవరచుకుంటే విజయం, ఆదాయం రెండూ వస్తా’యని సలహానీ ఇస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్