అమ్మలకు అమ్మలా...

పాతికేళ్లు కూడా లేవు.. భర్తను కోల్పోయారు. జీవితమే ముగిసిందన్న స్థితిలో సాయంలో ఆనందాన్ని వెతుక్కున్నారామె! పేద పిల్లల కోసం స్కూలు, మహిళలకి ఉపాధి, వృద్ధులకు ఆశ్రమం, కళాకారుల కోసం సాహిత్య పోటీలు.

Published : 24 Jan 2023 00:55 IST

పాతికేళ్లు కూడా లేవు.. భర్తను కోల్పోయారు. జీవితమే ముగిసిందన్న స్థితిలో సాయంలో ఆనందాన్ని వెతుక్కున్నారామె! పేద పిల్లల కోసం స్కూలు, మహిళలకి ఉపాధి, వృద్ధులకు ఆశ్రమం, కళాకారుల కోసం సాహిత్య పోటీలు.. నాలుగు దశాబ్దాలకుపైగా సేవలో ఆవిడ రూపొందించిన కార్యక్రమాలెన్నో! 66 ఏళ్ల వయసులోనూ ఇంకా ఏం చేద్దామా అన్న తపనే! భారతీదేవిని వసుంధర పలకరించగా ఆ ప్రయాణాన్ని పంచుకున్నారిలా!

మాది కృష్ణాజిల్లా కప్తానుపాలెం. ఆడపిల్లను బయటికి పంపేవారు కాదు.  మేం తొమ్మిదిమందిమి. దీంతో అయిదు వరకే చదివా. మేనత్త కొడుకు కమలాకర్‌ రావుకిచ్చి పెళ్లి చేశారు. ఆయన మెకానికల్‌ ఇంజినీర్‌. పెళ్లైన కొద్దిరోజులకే ఆక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పటికి నాకు 22 ఏళ్లే! పిల్లల్లేరు. ఆ బాధ నుంచి తేరుకోలేకపోయా. తిరిగి పుట్టింటికి వెళ్లలేను.. అత్తింట్లోనూ నా బాధతో వాళ్లని మరింత బాధించొద్దు అనుకున్నా. ఇంట్లో ఒప్పించి ఏదైనా అనాథాశ్రమంలో చేరదామని హైదరాబాద్‌కు వచ్చా. నా స్నేహితురాలికి మనసొప్పక వర్కింగ్‌ విమెన్‌ హాస్టల్‌లో చేర్చి.. టైప్‌రైటింగ్‌ నేర్చుకోమంది. చిన్నప్పటి నుంచీ ఎవరికి సాయం కావాలన్నా ముందుండేదాన్ని. నాతో గదిలో ఉండే ఆవిడ కథ విని 1979లో నేనే ‘టైప్‌ రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ ప్రారంభించా. పెళ్లయినప్పుడు నాకిచ్చిన పొలమ్మీద రాబడే పెట్టుబడి.

టీచర్లను పెట్టి పేదవాళ్లకు నేర్పిస్తూనే నేనూ నేర్చుకున్నా. కొన్నాళ్లకి కంప్యూటర్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటంతో 5 కంప్యూటర్లతో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లూ ఇప్పించేదాన్ని. ఆటో డ్రైవర్లు, కూలీల పిల్లలు, పేదవారికి ఉచితంగా నేర్పించడమే కాదు.. టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌కి అప్లికేషన్లు టైప్‌ చేయించుకోవడానికి వచ్చిన సంస్థల వాళ్లనడిగి ఉద్యోగాలూ ఇప్పించేదాన్ని. ఓసారి ఒకావిడతో మాట్లాడుతోంటే ‘ఇద్దరం ఉద్యోగాలు చేస్తే కానీ.. ఇల్లు గడవని పరిస్థితి. పిల్లలను చూసుకోవడానికేమో ఎవరూ లేర’ంది. ఆ పరిస్థితి ఉన్న చాలామందిని చూశాక.. డేకేర్‌ సెంటర్‌ మొదలుపెట్టా. మహిళలకు ఉపాధి కల్పించడానికి టైలరింగ్‌ వంటివీ ఏర్పాటు చేశా. ఇవన్నీ గమనించిన కొందరు ట్రస్ట్‌ ఏర్పాటు చేయమని సలహానిచ్చారు. దీంతో 1990లో ‘కమలాకర్‌ మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ప్రారంభించి.. సేవా కార్యక్రమాలు కొనసాగించాం. ఎక్కడ విపత్తులెదురైనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం.

పండగలు, ప్రత్యేక పర్వదినాలప్పుడు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఆహారం, దుస్తులు పంచేదాన్ని. అప్పుడే వృద్ధుల కోసం ఏదైనా చేయాలనిపించి 1999లో ‘మమత వృద్ధాశ్రమం’ ప్రారంభించా. ఇంతవరకూ 1000 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించాం. ట్రస్ట్‌ ప్రతి వార్షికోత్సవానికి పోటీలు నిర్వహించి, బహుమతులూ ఇచ్చేదాన్ని. అమ్మానాన్నా తోడున్నవారు చక్కగా చదువుకోగలరు. ఆ అవకాశం లేనివాళ్ల పరిస్థితేంటని.. 2001లో బండ్లగూడలో ‘వికాస భారతి’ స్కూల్‌ ప్రారంభించా. 150కిపైగా విద్యార్థులున్నారు. కళలకూ ప్రాధాన్యమివ్వాలని ‘లలిత కళాభారతి’ పేరుతో సాహిత్య పోటీలు, కళాకారులను సత్కరిస్తున్నా. సంగీత, నృత్యాల్లో శిక్షణా ఇప్పిస్తున్నా. ఏవి మొదలుపెట్టినా ఎవరైనా ఫీజు ఇస్తే సరే.. లేదంటే ఉచితమే. తొలిరోజుల్లో పెట్టుబడంతా నాదే. ఇప్పుడు స్నేహితులు, తోబుట్టువుల పిల్లలు సాయం చేస్తున్నారు.


ఏటా వివిధ రంగాలవారికి ‘రత్న’ పేరిట అవార్డులిస్తున్నాం. పిల్లలకోసం మహనీయుల చరిత్రలు, మనోవికాస పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నా. ఎవరైనా డబ్బులు తీసుకోమన్నా.. సమాజం కోసం త్యాగాలు చేసినవారి కథలకు లెక్కగట్టనని చెబుతుంటా. పిల్లలని ప్రోత్సహించాలన్నదే నా తపన. స్కూలు, ఆశ్రమం, ట్రస్ట్‌ అన్నీ అద్దె భవనాల్లోనే సాగుతున్నాయి. సొంతంగా ఏర్పాటు చేసుకోలేకపోయాననే లోటుంది. నా సాయం పొందినవారికీ ఎదగడమే కాదు.. నలుగురికీ సాయపడమంటా. మేం మీ కేర్‌ సెంటర్‌లో పెరిగాం. మీ స్కూల్లో చదివామంటూ పలకరిస్తోంటే చాలా ఆనందమేస్తుంది.

- ఫోతేదార్‌ రామకృష్ణాచారి, ఘట్‌కేసర్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా  పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్