చిరుధాన్యాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా...

అక్షరం ముక్కరాదీమెకు. అయితేనేం పోషకాహార ప్రాధాన్యతపై అందరికీ అవగాహన కలిగించాల నుకుంటున్నారు. సొంతంగా చిరుధాన్యాలను పండిస్తూ.. 150 రకాల విత్తనాలను భద్రపరచారీమె. సొంతింట్లోనే బీజ్‌ బ్యాంకును నిర్వహిస్తున్న లహరీబాయ్‌ స్ఫూర్తి కథనమిది. 

Published : 05 Feb 2023 00:07 IST

అక్షరం ముక్కరాదీమెకు. అయితేనేం పోషకాహార ప్రాధాన్యతపై అందరికీ అవగాహన కలిగించాల నుకుంటున్నారు. సొంతంగా చిరుధాన్యాలను పండిస్తూ.. 150 రకాల విత్తనాలను భద్రపరచారీమె. సొంతింట్లోనే బీజ్‌ బ్యాంకును నిర్వహిస్తున్న లహరీబాయ్‌ స్ఫూర్తి కథనమిది. 

బైగా గిరిజన జాతికి చెందిన లహరీబాయ్‌ది మధ్యప్రదేశ్‌లోని సిల్పాదీ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం. ఇందిరా ఆవాస్‌ గృహంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారీమె. రెండు గదుల ఇంట్లో ఒక గదిని వంట, పడకకు వినియోగిస్తూ, రెండో గదిని బీజ్‌బ్యాంకుగా మార్చారీమె. ముడి ధాన్యాల 150 రకాల అరుదైన విత్తనాలను ఇందులో భద్రపరుస్తున్నారు. తన పొలంలో సొంతంగా చిరుధాన్యాలను పండించి ఆ విత్తనాలను బ్యాంకులో భద్రపరుస్తున్నారు. 

రైతులకూ..

చుట్టుపక్కల గ్రామాల రైతులకూ తాను భద్రపరుస్తున్న విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు లహరి. ‘మా చుట్టుపక్కల దాదాపు 54 గ్రామాల్లో బైగా గిరిజనజాతికి చెందినవారమే నివసిస్తున్నాం. అందరిదీ వ్యవసాయమే జీవనాధారం. చిరుధాన్యాల్లో పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయని చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య చెప్పేవారు. ప్రస్తుతం ఆ పంటలు కనుమరుగవుతున్నాయనేవారు. అందుకే వీటిని పండించాలని బాల్యం నుంచే ఆశయంగా పెట్టుకొన్నా. పొలంలో సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలను పండించి వాటి విత్తనాలను భద్రపరచడం నేర్చుకున్నా. మొదట్లో విత్తనాల బ్యాంకు గురించి అందరూ అవహేళన చేసేవారు. అయినా నేను పట్టించుకోలేదు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయివి. అందుకే.. గత కొన్నేళ్లగా విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నా. నావద్ద దాదాపు 150 రకాల విత్తనాలున్నాయి. వీటిని భద్రపరచడంతోపాటు చుట్టుపక్కల 15 గ్రామాల రైతులకు ఉచితంగానూ పంపిణీ చేసి పండించే విధానాల్లో నావంతు సాయం చేస్తుంటా. ఇప్పుడు నన్నెవరూ విమర్శించడంలేదు. చిరుధాన్యాలపై అందరికీ అవగాహన కలిగించడం, ఆరోగ్యంగా ఉండేలా చేయడం లక్ష్యంగా పెట్టుకొన్నా. దీనికోసం వివాహం కూడా చేసుకోకూడ దనుకుంటున్నా. అలాగే అమ్మానాన్నను లోటు లేకుండా చూసుకోవాలనేది నా ఆశయం. దిండోరీ జిల్లా కలెక్టరు వికాస్‌ మిశ్రా ఆహ్వానంపై ఈ ఏడాది గణతంత్రవేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై జాతీయజెండాను ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించడం మరవలేను. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఏఆర్‌) జోధ్‌పూర్‌ తరఫున రూ.10 లక్షలు ఉపకార వేతనానికి నా పేరు ప్రతిపాదించడం సంతోషంగా ఉంది’ అంటున్న ఈ చిరుధాన్యాల బ్రాండ్‌ అంబాసిడర్‌ నిరక్షరాస్యురాలు. అయితేనేం ఐసీఏఆర్‌ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధిస్తే వ్యవసాయ రంగంలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు పాఠాలు చెప్పే అవకాశం దక్కుతుందీమెకు.

ఈ ఏడాదిలో కేంద్రం మన దేశాన్ని చిరుధాన్యాల సాగు, పరిశోధనలకు ప్రపంచకేంద్రంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఈ తరుణంలో ఇంట్లో సొంతంగా చిరుధాన్యాల బ్యాంకును నిర్వహిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌కు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌గా 27 ఏళ్ల లహరి నిలవడం మరెందరికో స్ఫూర్తిదాయకం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్